సాక్షి, కర్నూలు: ఏడడుగులు నడిచి నూరేళ్లు కలిసి కాపురం చేస్తానని బాస చేసిన భార్యే భర్తను కడతేర్చింది. వరుసకు కొడుకయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని క్షణికానందం పొందింది. తమకు అడ్డుగా ఉన్న భర్తను ఏడాదిన్నర క్రితమే అంతమొందించింది. ఇన్నాళ్లు తనకు ఏమీ తెలియదన్నట్టూ నాటకం ఆడింది. అయితే పోలీసులు ఎట్టకేలకు ఆమె నాటకానికి తెరదించారు.
గురువారం నంద్యాల తాలుకా పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి వివరాలు వెల్లడించారు. మహానంది మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన డక్కా క్రిష్ణయ్య (40), జయలక్ష్మి (37)లకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. క్రిష్ణయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే తన అన్న కుమారుడు డక్కా చింతలయ్యతో జయలక్ష్మి చనువుగా ఉంటూ రాసలీలలు కొనసాగించేది.
దీన్ని గమనించిన క్రిష్ణయ్య ఇద్దరిని మందలించాడు. అయినప్పటికీ వారి ప్రవర్తనలో మార్పురాలేదు. పదే పదే మందలిస్తుండటంతో అడ్డుతొలగించుకోవాలని చూసింది. భర్తకు ఈత రాదని ఎక్కడైనా నీళ్లలో తోసి హత్య చేయమని చింతలయ్యకు సలహా ఇచ్చింది. చింతలయ్య నంద్యాలకు చెందిన వెంకట సాయి అలియాస్ కవ్వ, ఆర్‌ఎస్ గాజులపల్లికి చెందిన శివరాజ్, తన సమీప బంధువు సుధాకర్, తమ్మడపల్లె గ్రామానికి చెందిన ప్రతాప్‌లతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. 2020 సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు నందిపల్లె గ్రామ శివారులోని పాలేరు వాగు వంతెనపై బైక్‌మీద వెళ్తున్న క్రిష్ణయ్యను చింతలయ్య ఆపాడు.
ఇద్దరు కలిసి మాట్లాడుతుండగా మిగతా నిందితులు క్రిష్ణయ్య కాళ్లు, చేతులు పట్టుకొని నీటిలోకి విసిరేశారు. దీంతో అతను నీటిలో మునిగి ఊపిరాడక మృతిచెందాడు. అదే రోజు జయలక్ష్మి తన భర్త కనిపించటం లేదని మహానంది పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత నంద్యాల పట్టణ శివారులోని జమ్ములమ్మ గుడి సమీపంలోని పాలేరు వాగులో క్రిష్ణయ్య మృతదేహం లభ్యం కావటంతో తాలుకా పోలీసులు గుర్తించి భార్యకు తెలియజేశారు.
క్రిష్ణయ్య మృతి చెందటానికి బలమైన కారణాలు అంతుచిక్కకపోవటంతో భార్య ఫిర్యాదు తీసుకొని విచారణ చేపట్టారు. అయితే జయలక్ష్మి, చింతలయ్య ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన మహానంది పోలీసులు నిఘా పెట్టారు. ఈక్రమంలో 15 రోజుల క్రితం చింతలయ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. విచారణలో చింతలయ్య హత్య తానే చేయించానని ఒప్పుకున్నాడు.
పోలీసులు చింతలయ్యను అదుపులోకి తీసుకున్నారని తెలియగానే జయలక్ష్మి కనిపించకుండా పరారైంది. నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ మురళీమోహన్, ఎస్‌ఐలు శ్రీనివాసులు, శేషయ్య, గంగయ్యయాదవ్, మల్లికార్జునులను అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి అభినందించారు.
నిందితులను అరెస్ట్ చూపుతున్న అడిషనల్ ఎస్పీ చిదానందరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment