ప్రతీకాత్మక చిత్రం
సోషల్ మీడియా ఛాటింగ్‌ల వల్ల జరిగే నష్టాల్లో ఇదొకటి. అవతల ఉంది భర్తనా? పరాయి పురుషుడా? అనే విషయం కూడా పసిగట్టని ఓ ఇల్లాలు.. తన ప్రైవేట్ ఫొటోలు పంపింది. బ్లాక్‌మెయిలింగ్ ఎదురుకావడంతో చివరకు తల బాదుకుని పోలీసులు ఆశ్రయించింది. ముంబై మలాడ్ దిన్‌దోషి ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
భార్యభర్తలు ఇద్దరూ ఓ అపార్ట్‌మెంట్‌లో కాపురం ఉంటున్నారు. కొత్తగా ఆమె భర్త ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచాడు. భార్యకి ఫాలో రిక్వెస్ట్ పంపడంతో ఆమె యాక్సెప్ట్ చేసింది. ఆపై భర్తతో రెగ్యులర్‌గా ఛాట్ చేస్తోంది. ఈ క్రమంలో అతను కోరడంతో ప్రైవేట్ ఫొటోలు సైతం పంపింది. అలా మూడు నెలలు గడిచాయి. తీరా ఓ రోజు.. అదే పనిగా ఫొటోలు పంపాలంటూ భర్త నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో ఆమె చిరాకు పడడంతో.. ఆ ఫొటోల్ని ఇంటర్నెట్‌లో పెడతానని బెదిరింపులు వచ్చాయి.
సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తను ఈ విషయమై నిలదీయడంతో.. అసలు తనకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లేదని చెప్పడంతో భార్య షాక్ తింది. బ్లాక్‌మెయిలింగ్‌పై భర్తతో కలిసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఐపీ అడ్రస్ ఆధారంగా పక్క ఫ్లాట్‌లో ఉంటున్న 20 ఏళ్ల యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లోని ఫొటోల్లో ఒక్కదానిని సేకరించి మరీ.. భర్త పేరిట ప్రొఫైల్ క్రియేట్ చేశాడట నిందితుడు. అందుకే ఆమెకు అనుమానం రాలేదు. నిందితుడి యవ్వారం తెలిసి.. దిన్‌దోషి పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు.
కిందటి ఏడాది నవరాత్రి ఉత్సవాల్లో నిందితుడికి, బాధిత కుటుంబానికి ఏవో గొడవలు జరిగాయట. అది మనసులో పెట్టుకునే ఈ వికృత చేష్టలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. లైంగిక వేధింపులు, సైబర్ వేధిపులు, పరువుకు భంగం కలిగించే సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. నిందితుడికి మార్చి 28వరకు కోర్టు రిమాండ్ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment