
వనజ (ఫైల్) సాన్వి (ఫైల్)
మెట్‌పల్లి: అదనపు కట్నం కోసం అత్తింటివారు పెట్టే వేధింపులు భరించలేక ఓ మహిళ తన ఐదేళ్ల కూతురుతో కలసి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై సుధాకర్ కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం ఆత్మనగర్‌కు చెందిన వేములవాడ రాజశేఖర్‌కు నిర్మల్ జిల్లా కడెం మండలం మద్దిపడిగ గ్రామానికి చెందిన వనజ (26)తో వివాహం జరిగింది. వీరికి సాన్వి అనే ఐదేళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా భర్తతోపాటు అత్త లింగవ్వ, ఆడపడుచులు.. మరికొంత కట్నం తీసుకురావాలంటూ వనజను వేధించడం ప్రారంభించారు.
పెద్దమనుషుల సమక్షంలో రూ.లక్ష ఇచ్చినా వేధింపులు ఆగలేదు. మరింత కట్నం కావాలంటూ వనజను వేధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన వనజ, తన కూతురును తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్లింది. సమీపంలోని వరద కాల్వలో దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కాల్వలో వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం తల్లీకూతుళ్ల మృతదేహాలు నీటిపై తేలాయి. పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వనజ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.