
సాక్షి, బెంగళూరు : ప్రేమ వ్యవ హారం నేపథ్యంలో యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పుత్తూరు తాలూకా పడువన్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రవిరాజ్ (31) ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డాడు. ఇతడికి ఓ యువతితో ఈనెల 25న నిశ్చితార్థం నిశ్చయించారు. ఇందుకోసం రవిరాజ్ బెంగళూరు నుండి స్వగ్రామానికి వచ్చాడు. ఆదివారం రాత్రి స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తానని వెళ్లిన రవిరాజ్ తిరిగి ఇంటికి రాలేదు. మొబైల్ స్విచాఫ్ వచ్చింది. సోమవారం మడ్నూరు గ్రామంలోని తమ కొత్త ఇంట్లో రవిరాజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి వెలుగు చూసింది. కుందాపురకు చెందిన యువతిని రవిరాజ్ ప్రేమిస్తున్నాడని, ఆమెకు వివాహం జరిగిందని తెలిసి ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.