ఇల గోదారి పరవళ్లలోఅల రాములోరి ఆనవాళ్లు | - | Sakshi
Sakshi News home page

ఇల గోదారి పరవళ్లలోఅల రాములోరి ఆనవాళ్లు

Published Mon, Jan 22 2024 3:00 AM | Last Updated on Mon, Jan 22 2024 9:34 AM

ధవళేశ్వరం రామపాదాల రేవు - Sakshi

ధవళేశ్వరం రామపాదాల రేవు

సాక్షి అమలాపురం: ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ ఈ వాక్యం చాలు ధర్మం రాశీభూతమైతే రాముడిలా ఉంటుందని చెప్పడానికి. రాముడికి వాల్మీకి ఇచ్చిన నిర్వచనం ఇదే.లోకాభిరాముడు.. జగదేక రాముడు.. శ్రీరాముడు.. ఏకపత్నీవ్రతుడు.. పితృవాక్య పరిపాలకుడు.. ఒకే మాట.. ఒకే బాణం.. ఒకే సతి.. వినయశీలుడు ఇవన్నీ రామాయణాన్ని చదివిన, విన్నవారికి రాముని గురించి అనిపించిన గుణశీల సంపన్నములు. శ్రీకృష్ణుడు ‘ఏం చేసైనా ధర్మాన్ని నిలబెట్టాలి’ అని చెబితే.. ‘ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మం వైపు నిలబడి బతకాలని’ రాముడు దిశానిర్దేశం చేశాడు.. ఆచరించి చూపించాడు.

ఏటా శ్రీరామ నవమికి ప్రతి రామాలయంలో, ప్రతి ఇంటా జరిగే పట్టాభిషేకాన్ని చూసి అక్షతలు శిరసున వేసుకున్నా.. నేడు అయోధ్యలో జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన తదితర కార్యక్రమాలు ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించే ప్రతి భక్తునికీ రామాయణ బాలకాండలోని విశేషాలు సాక్షాత్కరిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. అయోధ్యలో రూపుదిద్దుకున్న భవ్య రామ మందిరంలో బాలరాముని దివ్యరూపం కొలువుదీరుతున్న వేళ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రతువు జరుగుతున్న శుభ గడియలు ఆసన్నమవుతున్న తరుణంలో వాల్మీకి అరణ్యకాండలో ప్రస్తావించిన గోదావరి జిల్లాలతో శ్రీరాముని అనుబంధనాన్ని భక్తులు గుర్తు చేసుకుని పుకలరించిపోతున్నారు. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠకు అనుబంధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ మురిిసిపోతున్నారు.

తండ్రి మాట జవదాటని శ్రీరాముడు సీతా సమేతంగా వనవాసానికి వెళ్లిపోయాడు. ఈ సమయంలోనే రామయ్య సీతా సమేతంగా తమ్ముడు లక్ష్మణుడితో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నడయాడారని భక్తుల విశ్వాసం. స్వయంగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన పలు శివాలయాలు.. ఆలయాలు.. గోదావరి నదీతీరంలో పుణ్యస్నానాలు చేసిన ప్రాంతాలు.. వాటిని రామఘాట్‌ అంటూ పిలుచుకుంటూ భక్తులు రామునిపై తమ విశ్వాసాన్ని చాటుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శ్రీరాముని వనవాసానికి సంబంధించి పలు పురాణ గాథలున్నాయి. అలాగే పురాణ ప్రసిద్ధి చెందిన ఆలయాలూ ఉన్నాయి.

► అల్లవరం మండలం ఎస్‌.పల్లిపాలెం శివారు నక్కా రామేశ్వరం తీర ప్రాంతంలోని పార్వతి సమేత శివాలయాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు నిర్మించడం వల్లే రామేశ్వరాలయంగా పిలుస్తారని భక్తుల విశ్వాసం. రావణాసుడిని అంతమొందించిన శ్రీరాముడు బ్రహ్మ హత్యా దోషానికి పరిహారంగా కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించి సముద్రతీరంలో ప్రతిిష్ఠించాలని భావిస్తాడు. ఈ క్రమంలో లంక నుంచి అయోధ్యకు వెళుతున్న సమయంలో కాశీ నుంచి శివలింగాన్ని తీసుకురావలసిందిగా హనుమంతుడికి ప్రతిపాదిస్తాడు. సూర్యాస్తమయం కావస్తుండడం, శివలింగం రావడం ఆలస్యం కావడంతో రామేశ్వర క్షేత్రంలో ఇసుకతో సముద్రతీరంలో శివ లింగాన్ని తయారుచేసి ప్రతిష్ఠించి పూజలు చేసినట్లు ఈ క్షేత్రం పురాణ గాథ.

► ఇదే మండలం మొగళ్లమూరు శివారు లక్ష్మణేశ్వరంలో పార్వతీ సమేత లక్ష్మణేశ్వరస్వామి వారిని లక్ష్మణుడు ప్రతిష్ఠించినట్లు పురాణ గాథ. ఈ ఆలయాన్ని కూడా బ్రహ్మహత్యాదోష నివారణకు రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు నిర్మించినట్టు చెప్తుంటారు. మకర సంక్రాంతి నుంచి జూన్‌ వరకు మేఘ వర్ణం, జూన్‌ నుంచి సంక్రాంతి వరకు ధూమ్ర (బూడిద) వర్ణంతో శివలింగం ప్రకాశిస్తుందని పురోహితులు చెబుతున్నారు.

► రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరం వద్ద అఖండ గోదావరిని ఆనుకుని రామపాదాల రేవు ఉంది. ఇక్కడ ఉన్న జనార్దన స్వామి ఆలయానికి పుర్వకాలంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్ష్మణ స్వామిని వెంటబెట్టుకుని వచ్చారని, ఇక్కడ పుణ్యస్నానాలు చేశారని నమ్మకం. ఇక్కడ రాముని పాదముద్రలు కూడా ఉంటాయి. పుష్కరాల సమయంలో ఇక్కడ స్నానాలు చేస్తే పుణ్యమని భక్తుల విశ్వాసం.

► వాల్మీకి రాసిన అరణ్యకాండలో గోదావరి తీరం ప్రస్తావన ఉంది. సీతారాములు వనవాసం చేశారని, సీతాదేవి అహరణకు గురైన తరువాత ఆమెకు గోదావరి తీరం అంటే ఇష్టమని అక్కడ వెదుకుదామని లక్ష్మణుడితో శ్రీరాముడు అన్నట్టు రాశారు.

► గుడిమెళ్ల రామేశ్వరంలో కృతకృత్య రామలింగేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠకు వెళ్లే ముందే శ్రీరాముడు, సీతాదేవి ఇప్పుడున్న సఖినేటిపల్లి వద్ద విశ్రాంతికని ఆగారంటారు. ఆ సమయంలో స్వామివారు ‘సఖీ’ ఇదే నేటిపల్లె (పల్లె నిద్ర చేయడం) అన్నారని, అప్పటి నుంచి ఈ ప్రాంతం సఖినేటిపల్లిగా గుర్తింపు పొందిందని చెబుతారు.

► అంబాజీపేట మండలం మాచవరం (నాటి మాసవరం)లో కౌశికానది తీరంలో పుణ్యస్నానాలు చేస్తే బ్రాహ్మణ హత్య మహాపాతకం పోతుందని చెప్పడంతో శ్రీరాముడు ఇక్కడ స్నానం చేసి శివాలయాన్ని ప్రతిష్ఠించారని పూర్వీకులు చెబుతున్నారు. నాటి నుంచి దీనిని శ్రీరామఘాట్‌గా పిలుస్తారు. ఇక్కడ పుష్కరాలకు పుణ్యస్నానాలు చేస్తారు.

► రత్నగిరి సత్యదేవుని ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీరాముడు కావడం మరో విశేషం. సత్యదేవునికి జరిగే ప్రతి వైదిక కార్యక్రమానికి, కల్యాణానికి శ్రీరాముడు పెళ్లిపెద్దగా వ్యవహరిస్తారు.

► గొల్లలమామిడాడ కోదండ రామస్వామి ఆలయం రాష్ట్రంలో కడప జిల్లా ఒంటిమిట్ట తరువాత అంతటి ప్రాముఖ్యం ఉన్న ఆలయం. ఈ ఆలయాన్ని విశిష్టమైన వాస్తు శాస్త్రంతో నిర్మించారు. రెండు భారీ గోపురాలు కలిగి ఉంటాయి. ఈ ఆలయాన్ని ‘చిన్న భద్రాది’ లేదా ‘చిన్న భద్రాచలం’ అని కూడా అంటారు. శ్రీరామ నవమి పండగకు ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తారు.

► రావణ వధ తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా పుష్పక విమానంలో తిరిగి అయోధ్య వెళ్తుండగా శ్రమణి అనే రుషి భార్య శాపవశాత్తు కురూపిగా మారిపోతుంది. శాప విమోచనకు ఆమె తపస్సు చేస్తుంటుంది. ఆ ప్రదేశానికి వచ్చేసరికి పైన వెళ్తున్న పుష్పక విమానం ఆగిపోతుంది. అది గుర్తించిన రాముడు ఆమెకు క్షణ కాలంలోనే శాప విమోచనం కలిగించాడు. అనంతరం అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. దీంతో ఆ ప్రదేశానికి క్షణ ముక్తేశ్వరం పేరు వచ్చిందని పురాణ గాధ. అలాగే యుద్ధంలో వినియోగించిన అస్త్రాలను ముక్తిగుండంలో వదిలిపెట్టారని భక్తుల విశ్వాసం. ఈ గుండంలోని నీటినే శివలింగానికి అభిషేకిస్తారు.

అంతా రామమయం
అయోధ్యలో సోమవారం బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపనను దేశ వ్యాప్తంగా హిందువులు పండగగా భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎటుచూసినా రామనామమే వినిపిస్తోంది. శ్రీరాముని ఆలయాల వద్దనే కాదు.. ప్రతి ఆలయం వద్దా అయోధ్య రామాలయ ప్రతిష్ఠ సందడి నెలకొంది. ఆలయాలు, ఇళ్లు, వ్యాపార, వాణిజ్య కేంద్రాల వద్ద హనుమంతుని జెండాలను తగిలించి భక్తిని చాటుకుంటున్నారు. పలు దుకాణాల వద్ద ఈ జెండాల విక్రయం జోరుగా సాగుతోంది. ఆలయాల వద్దనే కాదు, చివరకు చాలా మంది సెల్‌ఫోన్‌ రింగ్‌ టోన్లు కూడా ‘జై శ్రీరామ్‌’ నినాదాన్నే పెట్టుకుంటున్నారు. వాట్స్‌అప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌ల డీపీలు రాముని చిత్రాలతో నిండిపోతున్నాయి. ఊరూవాడా ప్రత్యేక యాత్రలు, భజనలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పలువురు ఆయోధ్య వెళ్లారు. ఊరూవాడా శ్రీరామ మహా శోభాయాత్రలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ‘జై శ్రీరామ్‌’ నినాదాలు హోరెత్తుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/3

గొల్లల మామిడాడ రామాలయం 2
2/3

గొల్లల మామిడాడ రామాలయం

అంబాజీపేటలో శ్రీరామ భక్తుని ప్రచారం 3
3/3

అంబాజీపేటలో శ్రీరామ భక్తుని ప్రచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement