చొల్లంగి తీర్థం చూసొద్దాం రండి!
ఫ రేపు జరిగే తీర్థానికి భారీ ఏర్పాట్లు
ఫ తరలి రానున్న వేలాది మంది భక్తులు
కరప: పురాణ ప్రసిద్ధి గాంచిన చొల్లంగి అమావాస్య తీర్థం బుధవారం కరప మండలం ఉప్పలంక శివారు మొండి వద్ద సముద్ర తీరాన జరగనుంది. చొల్లంగి తీర్థం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రాముఖ్యథ సంతరించుకుంది. వేలాదిగా భక్తులు తరలివచ్చి సముద్రస్నానం చేయడం ఆనవాయితీ. దేవదాయ, పోలీసు శాఖలతో పాటు, ఉప్పలంక గ్రామ పంచాయతీ సంయుక్తంగా తీర్థం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏటా పుష్యమాసంలో అమావాస్య రోజున తీర్థం జరుగుతుంది. తుల్యభాగ నదీపాయ సముద్రతీరంలో కలిసే ప్రదేశమే సాగర సంగమం అంటారు. చంద్రుడు శాపవిమోచనం పొందడానికి తనభార్య రోహిణితో కలసి ఈ సాగర సంగమం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయడంతో శివుడు ప్రత్యక్షమై మోక్షం కలిగించినట్టు పురాణగాథలు తెలుపుతున్నాయి. చొల్లంగి వద్ద సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితమే రాజ రాజేశ్వరీదేవి సమేత సోమేశ్వరస్వామి ఆలయం నిర్మించారు. మొండివద్ద సముద్రతీరాన 109 సంవత్సరాల క్రితం మల్లాడి సత్యలింగం నాయకర్ సంగమేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో బాలాత్రిపురసుందరి సమేత సంగమేశ్వరస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయానికి పక్కనే సీతారాముల ఆలయం, ఆంజనేయస్వామి, కాలభైరవస్వామి వార్ల ఆలయాలు కూడా ఉంటాయి. తర్వాత పక్కనే ఉన్న చొల్లంగిలో చంద్రుడు ప్రతిష్ఠించిన రాజరాజేశ్వరి సమేత సోమేశ్వరస్వామివారి శివలింగాన్ని భక్తులు దర్శించుకుంటారు. అమావాస్య రోజున సముద్ర స్నానం చేస్తే మోక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం. కాకినాడ జిల్లానుంచే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి సముద్రస్నానం చేసి సంగమేశ్వరస్వామి, భైరవస్వామి, సోమేశ్వరస్వామివార్లను దర్శించుకుంటారు.
ట్రాఫిక్ మళ్లింపు
చొల్లంగి తీర్థం రోజున ఎంఎస్‌ఎన్ చార్టీస్ నుంచి మొండివద్ద స్నానాల రేవు వరకు ఉండే భక్తుల తాకిడిని దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల సూచన మేరకు ట్రాఫిక్‌ను ఒక రోజు(మంగళవారం అర్ధరాత్రి నుంచి) మళ్లించినట్టు కరప ఎస్‌ఐ సునీత తెలిపారు. యానాం వైపు నుంచి తాళ్లరేవు మీదుగా వచ్చే వాహనాలు పటవల వద్ద నుంచి జి.వేమవరం, గొర్రిపూడి, పెనుగుదురు గ్రామాల మీదుగా కాకినాడకు చేరుకుంటాయన్నారు. కాకినాడ నుంచి తాళ్లరేవు, యానాంవైపు వెళ్లే వాహనాలు కాకినాడ, తూరంగి, నడకుదురు, గురజనాపల్లి గ్రామాల మీదుగా యానాం రోడ్డుకు చేరుకుని వెళతాయన్నారు. స్నానాల రేవు వద్ద, ఆలయం వద్ద భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవదాయ, పోలీసుశాఖల అధికారులతో కలసి అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఉప్పలంక సర్పంచ్ బొమ్మిడి నయోమి, గ్రామకార్యదర్శి ఎం.భవానీ తెలిపారు. స్నానాలరేవు వద్ద గజ ఈతగాళ్లను ఉంచినట్టు, దర్శనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్టు ఎంఎస్‌ఎన్ చార్టీస్ ఏసీ కె.విజయలక్ష్మి తెలిపారు. మొండివద్ద చొల్లంగి తీర్థం రోజున ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు కరప పీహెచ్‌సీ డాక్టర్ యాంజలిన్ తెలిపారు.
సప్తసాగర యాత్ర
చొల్లంగి అమావాస్య మరుసటి రోజు నుంచి సప్త సాగర యాత్ర ప్రారంభమవుతుంది. చొల్లంగి, కోరంగి, తీర్థాల మొండి, రామేశ్వరం, బ్రహ్మసమాఖ్యం, నాసంగితిప్ప, అంతర్వేదిలలో సముద్రస్నానం చేస్తే సప్త సాగర యాత్ర పూర్తవుతుంది. సప్త సాగర యాత్ర తర్వాత అంతర్వేదిలోని లక్ష్మీ నరసింహస్వామి తీర్థం జరుగుతుంది.
చంద్రునికి శివుడు ప్రత్యక్షమైనప్పుడు నందేశ్వరునికి కూడా వరమివ్వడం వల్లనే చొల్లంగి అమావాస్య రోజున అప్పన్నెద్దులను తీసుకొచ్చి సముద్రస్నానం చేయిస్తారు. గ్రామాల్లోని వీరభద్రుడు గద్దెల నుంచి ప్రభలను తీసుకొచ్చి చొల్లంగి తీర్థం రోజున సముద్రస్నానం చేసి, సంగమేశ్వరస్వామి, భైరవస్వామి, సోమేశ్వరస్వామివార్లను దర్శించుకుంటారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ ఆధ్వర్యాన కరప ఎస్‌ఐ టి.సునీత పోలీసు సిబ్బందితో కలసి బందోబస్తు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment