కేదారిలంక ర్యాంపులో ఇసుక దందా
కపిలేశ్వరపురం: ఆహ్లాదకరమైన కేదారిలంక గ్రామం కూటమి నేతల అక్రమాలకు నిలయంగా మారింది. జిల్లా పర్యాటక కేంద్రంగా విలసిల్లిన ధనమ్మ మర్రి గ్రామంలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. ఉచిత ఇసుక పేరుతో అధిక ధరలకు ఇసుకను విక్రయిస్తున్నారు. కూలీలకు ఉపాధి మాటున యంత్రాల సాయంతో భారీ వాహనాల్లో ఇసుకను దూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదంతా చీకటిమాటున కాకుండా బహిరంగంగానే సాగుతున్నప్పటికీ, తహసీల్దార్ నుంచి క్షేత్ర స్థాయి ప్రభుత్వ సిబ్బంది వరకూ చేష్టలూడుతున్నారు. కనీసం ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయకుండా మిన్నుకుంటున్నారు.
వారం రోజుల క్రితం కేదారిలంక ర్యాంపులో పరిసర గ్రామాల వినియోగార్థం ఉచిత ఇసుక విధానంలో తవ్వకాలకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చారు. దాన్ని సాకుగా చూపి గ్రామానికి చెందిన టీడీపీ, జనసేన నాయకులు అక్రమాలకు బాట వేశారు. పటిష్టమైన బాటను నిర్మించి జేసీబీ యంత్రాలను సమకూర్చుకుని ఇసుకను లోడు చేస్తున్నారు. అక్రమాలకు నియోజకవర్గ స్థాయి టీడీపీ, జనసేన నాయకుల అండ పుష్కలంగా ఉందన్న వాదన ఉంది. ర్యాంపులో ట్రాక్టర్లకు బదులు లారీలను ఎందుకు అనుమతి ఇస్తున్నారని ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని స్థానికులు కొందరు చెబుతున్నారు. తహసీల్దార్ చిన్నారావు దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా కనీసం పట్టించుకోలేదని ఎంపీటీసీ యర్రంశెట్టి నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పోలిశెట్టి గణేష్ వాపోయారు. చివరకు చేసేది లేక ఈ నెల 27న కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌లో ఇసుక అక్రమాలపై ఫిర్యాదు చేశామన్నారు. సోమవారం ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకుంటారని ఆశించామని, మంగళవారం ఉదయమే ర్యాంపులో లారీల్లో ఇసుకను అక్రమంగా తరలించారన్నారు.
ఉచితంగా ఇసుకను అందించాల్సి ఉన్నప్పటికీ, ట్రాక్టర్ రూ.1,200కి విక్రయిస్తున్నారు. లారీలకు ఎలాంటి అనుమతి లేకపోయినప్పటికీ, రోజుకు సుమారు 25 లారీల చొప్పున ఇసుకను లోడు చేస్తున్నారు. రోజుకు 100 నుంచి 150 వరకూ ట్రాక్టర్లలో ఇసుకను విక్రయిస్తున్నారు, పెద్ద మొత్తంలో టీడీపీ, జనసేన నాయకులు వారి స్థాయిని బట్టి దండుకుంటున్నట్టు సమాచారం. ర్యాంపు నుంచి యంత్రాలతో ఇసుకను లోడు చేసి తరలిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నప్పటికీ, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, కనీస చర్యలు తీసుకోకపోవడంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. రాత్రి వేళలోనూ తవ్వకాలు జరుపుతున్నారని, భారీ వాహనాల రాకపోకలనతో భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉచితం మాటున టీడీపీ,
జనసేన నేతల అక్రమాలు
ట్రాక్టర్లతో పాటు,
భారీ వాహనాల్లో తరలింపు
కూలీల స్థానే యంత్రాలతో తవ్వకాలు
పట్టించుకోని అధికార యంత్రాంగం
ర్యాంపులో సిబ్బందిని
నియమించాం
ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టరులో స్థానిక అవసరాల మేరకు ఇసుక తరలింపునకు అనుమతి ఉంది. అక్రమాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వ సిబ్బందిని ర్యాంపు వద్ద విడతల వారీగా ఏర్పాటు చేశాం. అక్రమాలు జరుగుతున్నట్టు నా దృష్టికి రాలేదు.
– చిన్నారావు, తహసీల్దార్, కపిలేశ్వరపురం
Comments
Please login to add a commentAdd a comment