కుష్టును నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వైకల్యం
అమలాపురం రూరల్: ప్రాణాంతకం కానప్పటికీ కుష్టు వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే శాశ్వత వైకల్యాన్ని కలిగించే మహమ్మారని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో స్పర్శ కుష్టు వ్యాధి ప్రచార కార్యక్రమ వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో అంతంతమాత్రంగా ఉన్న ఈ వ్యాధి తీవ్రత ఇటీవల కాలంలో పెరుగుతున్నట్లు వైద్య శాఖ గుర్తించిందని, దీంతో అప్రమత్తమైన జాతీయ ఆరోగ్య మిషన్ కుష్టు వ్యాధిగ్రస్తులు, ఆ లక్షణాలు కలిగిన వారి వివరాలను తెలుసుకోవాలని సంకల్పించిందన్నారు. ఇందులో భాగంగా 14 రోజుల పాటు ఇంటింటా లెప్రసీ(కుష్టు) ప్రచార కార్యక్రమం చేపట్టారన్నారు. జిల్లా అదనపు వైద్యారోగ్య శాఖ అధికారి, జిల్లా కుష్టు వ్యాధి నియంత్రణ అధికారి డాక్టర్ సీహెచ్‌వీ భరతలక్ష్మి మాట్లాడుతూ, జిల్లాలో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు కొనసాగుతుందన్నారు.
సూర్యఘర్‌ను సద్వినియోగం చేసుకోవాలి
విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకునేందుకు పీఏం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ మహేష్‌కుమార్ సూచించారు. ఈ పథకం పురోగతిపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. సోలార్ ప్యానళ్ల కోసం తక్షణమే పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తించాలన్నారు. లబ్ధిదారులు రూ.2 లక్షల విలువైన 3 కిలోవాట్ల సోలార్ ప్యానళ్లను ఇంటి కప్పుపై ఏర్పాటు చేసుకోవాలన్నారు. కేంద్రం గరిష్టంగా రూ.78 వేల సబ్సిడీ ఇస్తుందన్నారు. మిగిలినది బ్యాంకు రుణం పొందవచ్చన్నారు. సొంత అవసరాలు పోను, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు ఇచ్చి ఆదాయం పొందవచ్చని తెలిపారు. ఏపీఈపీడీసీఎల్ ఈఈ మోకా రవికుమార్, నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్ స్వామినాయుడు, డీఆర్డీఏ పీడీ డాక్టర్ శివశంకర్ ప్రసాద్, ఎల్డీఎం పి.కేశవవర్మ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మహేష్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment