కుష్టు కట్టడించేలా..
రాయవరం: అనారోగ్య సమస్యలతో పాటు, అంగవైకల్యానికి దారి తీసే కుష్టు వ్యాధి విస్తరించకుండా వైద్యారోగ్య శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. కుష్టు బాధితులకు వైద్య సాయం అందించడమే కాకుండా, ముందస్తు చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పిస్తోంది. ఏటా రెండుసార్లు జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో లెప్రసీ కేసుల గుర్తింపునకు సర్వే నిర్వహిస్తున్నారు. జూన్–జూలై, డిసెంబర్–జనవరి నెలల్లో ఈ సర్వేను చేపడుతున్నారు. అనుమానితులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, చికిత్స అందించేలా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
లక్షణాల గుర్తింపు
మైకో బాక్టీరియం లెప్రే అనే సూక్ష్మ జీవి కారణంగా కుష్టు వ్యాధి వస్తోంది. చర్మంపై స్పర్శలేని మచ్చ రాగి రంగులో ఉంటుంది. ఆ ప్రదేశంలో చెమట కూడా పట్టదు. శరీరంలో అధికంగా చర్మం, నరాలకు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. అరికాళ్లు, అరిచేతులు, గోళ్లు మినహా, శచర్మంపై ఎక్కడైనా రావచ్చు. వ్యాధి వచ్చిన ప్రదేశంలో వెంట్రుకలు రాలిపోతాయి. నిర్లక్ష్యం చేస్తే కాళ్లు, చేతులు వైకల్యం పొందడంతో పాటు, ముఖం, చెవి వద్ద వ్యాధి ప్రభావం అధికంగా ఉంటుంది.
చికిత్స ఇలా..
ఈ వ్యాధికి రెండు రకాల చికిత్సను అందిస్తారు. మొదటిది పాసిబేసిలరి(పీబీ). వ్యక్తి శరీరంలో 1 నుంచి 5 మచ్చల వరకు ఏర్పడడం, ఒక నరానికి మాత్రమే వ్యాధి సోకితే, ఆరు నెలల చికిత్స అందిస్తారు. ఐదు లేక అంతకంటే ఎక్కువ మచ్చలు, రెండు లేక అంతకంటే ఎక్కువ నరాలకు వ్యాధి సోకితే మల్టిబాసిలరి(ఎంబీ) అంటారు. దీనికి 12 నెలలు చికిత్స తీసుకోవాలి. నరాలకు క్రిమి చేరక ముందే పూర్తి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా కాపాడుకోవచ్చు. రోగి పూర్తిగా కోలుకున్నా, జీవితాంతం జాగ్రత్తలు పాటించాలి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 60 కుష్టు వ్యాధి నిర్థారణ కేసులున్నాయి. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు వీటిని గుర్తించారు. వీటిలో పాసిబాసిలరీ కేసులు 22 ఉండగా, మల్టీబాసిలరి లెప్రసీ కేసులు 38 ఉన్నాయి.
13 వరకు అవగాహన పక్షోత్సవాలు
గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఏటా కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమాలను నిర్వహిస్తారు. గురువారం నుంచి ఫిబ్రవరి 13 వరకు కుష్టు వ్యాధి నిర్మూలన పక్షోత్సవాలను నిర్వహించనున్నారు. వ్యాధిపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన కల్పించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది.
తీవ్రత ఆధారంగా చికిత్స
వ్యాధి లక్షణాలు గుర్తించిన వారికి తీవ్రత ఆధారంగా ఆరు, 12 నెలల పాటు చికిత్సను అందిస్తున్నాం. వ్యాధిని పూర్తి స్థాయిలో నిర్మూలించడమే ప్రభుత్వం ముందున్న లక్ష్యం. వైద్యారోగ్య శాఖ ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. వ్యాధి నివారణకు జిల్లాలో పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయి. తొలి దశలో గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా నియంత్రించవచ్చు.
– డాక్టర్ సీహెచ్‌వీ భరతలక్ష్మి, జిల్లా కుష్టు,
ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి,
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా
ఫిబ్రవరి 13 వరకు
లెప్రసీ అవగాహనా పక్షోత్సవాలు
జిల్లాలో కుష్టు వ్యాధి
నిర్ధారణ కేసులు 60
నేడు ప్రపంచ కుష్టు వ్యాధి
నిర్మూలన దినోత్సవం
Comments
Please login to add a commentAdd a comment