పెరటిహిట్టు!
బంగారు ఆభరణాల స్వాధీనం
నిందితుడి అరెస్టు
కోటనందూరు: దొంగిలించిన 100 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేసినట్టు తుని రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు తెలిపారు. స్థానిక పోలీసుస్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై టి.రామకృష్ణతో కలిసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 24న కోటనందూరు మండలం బిళ్లనందూరుకు చెందిన మాతిరెడ్డి గంగయ్యమ్మ ఇంటికి తాళం వేసి ఉపాధి పనులకు వెళ్లింది. గంగయ్యమ్మ ఎదురింటి వ్యక్తి బొత్స వీరబాబు (34) తాళం పగులగొట్టి పడకగది బీరువాలో ఉన్న 35.30 గ్రాముల నల్లపూసల గొలుసు, 22.5 గ్రాముల పుస్తెలతాడు, 23.2 గ్రాముల చైను, 12.5 గ్రాముల చెవిదిద్దులు, 5.5 గ్రాముల బంగారు ముక్కలను అపహరించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు వీరబాబు ఆదివారం టీజే నగరం బస్టాండు వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఎస్సై రామకృష్ణ, సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా టీజే నగరం వర్మీకంపోస్టు కేంద్రం వద్ద రహదారి కింద ఉన్న కల్వర్టులో ఆభరణాలను దాచినట్లు అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment