అమలాపురం నడిబొడ్డున రెండు చోరీలు
● పట్టణ సీఐ కార్యాలయం ఎదుటే ఘటన
● రూ.1.30 లక్షల నగదు దోచుకున్న
దొంగలు
అమలాపురం టౌన్: స్థానిక గడియారం స్తంభం సెంటరులో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణ సీఐ కార్యాలయానికి ఎదురుగా ఉన్న పత్రికా కార్యాలయం, చాందిసి క్లినిక్‌లో ఈ వరస చోరీలు జరిగాయి. పత్రిక కార్యాలయం తలుపు తాళాలు, క్లినిక్ ఇనుప షట్టర్ల తాళాలు పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. పత్రిక కార్యాలయంలో డ్రాయర్ తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రూ.85 వేల నగదు, క్లినిక్‌లో డాక్టర్ ఎంకే రాయ్‌కు చెందిన రూ.45 వేల నగదు, ఓ ఏటీఎం కార్డును దొంగలు తస్కరించారు.
తెల్లారే సరికి విజయవాడకు
చోరీకి పాల్పడిన వారు ప్రొఫెషనల్స్‌గా పోలీసులు భావిస్తున్నారు. తెల్లారే సరికి వారు విజయవాడకు వెళ్లిపోయినట్లు తెలిసింది. ఇక్కడ క్లినిక్‌లో చోరీ చేసిన డాక్టర్ ఏటీఎం కార్డును విజయవాడలో ఉపయోగించి నగదు డ్రా చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇక్కడ డాక్టర్ ఫోన్‌కు డబ్బు డ్రా అయినట్లు కాకుండా డబ్బుల కోసం రాంగ్ పిన్ నొక్కినట్టు మెసేజ్ వచ్చింది. దీనిని బట్టే చోరీకి పాల్పడ్డ దొంగలు తెల్లారే సరికి విజయవాడ చేరుకున్నట్లు బాధితులతోపాటు పోలీసులు కూడా భావించారు. పట్టణ సీఐ పి.వీరబాబుతోపాటు సిబ్బంది సోమవారం ఉదయమే చోరీలు జరిగిన చోటకు చేరుకున్నారు. క్లూస్ టీమ్ సభ్యులు చోరీలు జరిగిన చోట్ల నుంచి దొంగల వేలి ముద్రలను సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment