దగా డీఎస్సీ
సాక్షి, రాజమహేంద్రవరం: మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం దగా చేస్తోంది. అధికారంలోకి రాగానే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని, సార్వత్రిక ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి నేతలు గద్దెనెక్కాక మాట మార్చడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా.. డీఎస్సీ నోటిఫికేషన్‌పై నేటికీ స్పష్టత ఇవ్వకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు ఇటీవల శాసనమండలిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే అసలు డీఎస్సీ నిర్వహిస్తారా..? లేదా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
నోటిఫికేషన్ మాటేంటో?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తొలి సంతకం ఆ ఫైల్‌పై పెడతానన్నారు. ‘ఏరుదాటాక తెప్ప తగలేసిన’ చందంగా ఇప్పుడు ఆ హామీని అటకెక్కించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులను మోసం చేశారు. అదిగో ఇదిగో అంటూ దాటవేత ధోరణి అవలంబిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో న్యాయపరమైన వివాదాలు పరిష్కరించిన అనంతరం డీఎస్సీ ప్రకటన ఉంటుందని చేసిన వ్యాఖ్యలు నిరుద్యోగుల్లో ఆగ్రహావేశాలు నింపుతున్నాయి. అసలు డీఎస్సీ నిర్వహించే ఉద్దేశం ఉందా..? లేదా..? అని ప్రశ్నిస్తున్నారు.
అభ్యర్థుల నిరీక్షణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తమను ఉపాధ్యాయు ఉద్యోగాలు వరిస్తాయని భావించిన డీఎడ్, బీఎడ్ అభ్యర్థులు శిక్షణకు సమాయత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేలకు పైగా అభ్యర్థులు వివిధ ప్రాంతాల్లో శిక్షణ పొందుతున్నారు. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ మరోవైపు కోచింగ్ తీసుకుంటున్నారు. కుటుంబాలను సైతం వదులుకుని సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తర్ఫీదు పొందుతున్నారు. ఎలాగోలా డీఎస్సీలో ప్రతిభ చూపి ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని భావించి కష్టాలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాదిగా రూ.వేలకు వేలు కోచింగ్ ఫీజులు చెల్లించి మరీ శిక్షణ పొందుతున్నామని, స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకు టెట్ నిర్వహించింది. ఇటీవలే ఫలితాలు సైతం వెలువడ్డాయి. టెట్ ప్రక్రియ సైతం పూర్తవడంతో ఇక డీఎస్సీ నిర్వహణకు మార్గం సుగమమైందన్న భావన అభ్యర్థుల్లో నెలకొంది. అయినా వారి ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి.
జిల్లాలో ఇలా..
తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 19 మండలాల పరిధిలో సుమారు 1,008 ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో సుమారు 650లకు పైగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు గతంలో అధికారులు లెక్కలు తీశారు. అయితే 2025 డిసెంబర్ వరకు ఏర్పడే ఖాళీలను అనుసరించి డీఎస్సీ పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రక్రియతో మరో 200 పోస్టుల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.
సర్దుబాటులోనూ గందరగోళం
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చంద్రబాబు, లోకేష్ ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారు. ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక డీఎస్సీ నిర్వహించాల్సిన సమయం ఆసన్న కావడంతో ఎలాగోలా మెగా డీఎస్సీని కాలయాపన చేసేందుకు ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సర్దుబాటుకు ఉన్న అర్థాన్నే మార్చేశారని ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. వర్క్ అడ్జెస్ట్‌మెంట్ (సర్దుబాటు) అంటే ఒకటి లేదా రెండు నెలల పాటు మిగులు టీచర్లను అవసరమైన చోట తాత్కాలికంగా వినియోగించుకోవడం. టీడీపీ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న వాదన ఉపాధ్యాయుల నుంచి వినిపించింది. సర్దుబాటులో భాగంగా ఉపాధ్యాయులు బదిలీ అయిన స్థానంలో ఈ విద్యా సంవత్సరం ముగిసే వరకూ (వచ్చే ఏడాది ఏప్రిల్ 23) అదే స్థానంలో కొనసాగాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాల విభజన జరిగింది. అందుకు అనుగుణంగా చేపట్టకుండా ఉమ్మడి జిల్లా కేంద్రంగా ప్రక్రియ సాగనుండటం ఉపాధ్యాయులకు మింగుడు పడని అంశంగా మారింది. ఈ విషయమై ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
రద్దు కాని జీవో
ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించిన జీవో 117న తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో నారా లోకేష్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అదే జీఓ ప్రకారం ప్రక్రియ కొనసాగిస్తున్నారు. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
నోటిఫికేషన్ వెంటనే వెలువరించాలి
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అభ్యర్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లలో ఉంటూ శిక్షణ పొందుతున్నారు. రూ.వేలు వెచ్చించి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించింది. ఇచ్చిన హామీ మేరకు వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
–డాక్టర్ ఎంవీవీ బ్రహ్మానందరెడ్డి,
ఏపీటీపీఐఈఏ, రాష్ట్ర అధ్యక్షుడు
మెగా డీఎస్సీ నిర్వహణపై
ప్రభుత్వం రోజుకో ప్రకటన
నిరుద్యోగులతో
కూటమి సర్కారు ఆటలు
ఎన్నికల సమయంలో ఊరించి..
ఉసూరుమనిపించి..
తాజాగా మంత్రి లోకేష్ ప్రకటనతో
మరింత ఆందోళన
అసలు డీఎస్సీ నిర్వహిస్తారా?
లేదా? అన్న సందేహాలు
జిల్లా వ్యాప్తంగా 650కు పైగా
టీచర్ పోస్టుల ఖాళీ
నోటిఫికేషన్ కోసం
అభ్యర్థుల ఎదురుచూపులు
Comments
Please login to add a commentAdd a comment