బాల్యావస్థ చిత్రమైనది. ఆ దశలో కంటిముందు కనబడేవన్నీ తన సొంతం అనుకునే మనస్తత్వం ఉంటుంది. మరో పదిరోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న డోనాల్డ్ ట్రంప్ ఈ మాదిరి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతోంది. అధికారంలోకి రాకముందే ఆయన వరసబెట్టి పొరుగు దేశాలకు తాఖీదులు పంపుతున్నారు. ‘మీరంతా నా దారికి రండి’ అన్నదే వాటి సారాంశం. అమెరికాలో 51వ రాష్ట్రంగా స్థిరపడటానికి కెనడా సిద్ధంగా ఉండాలట. డెన్మార్క్‌లో భాగంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్ ప్రాంతాన్ని ఆ దేశం వదిలేసుకోవాలట. అలాగే పనామా అధీనంలోని పనామా కాల్వపై అమెరికాకు పూర్తి హక్కున్నదట.
తన అభీష్టం నెరవేరటానికి ఆ దేశాలపై టారిఫ్ మోత మోగి స్తారట. ఫలితం రాకపోతే దురాక్రమణకు సిద్ధపడతారట. సోవియెట్ యూనియన్ దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉన్నదని బెదరగొట్టి 1949లో నాటో కూటమిని ఏర్పాటుచేసింది అమెరికాయే. దాని స్థానంలో వచ్చిన రష్యావల్ల కూడా ముప్పు ముంచుకురావచ్చని ఒప్పించి నాటోను కొన సాగిస్తున్నదీ అమెరికాయే. తీరా ట్రంప్ ప్రకటనల తీరు చూశాక నిజమైన ముప్పు అమెరికానుంచే ఉండొచ్చన్న భయాందోళనలు యూరప్ దేశాల్లో కలుగుతున్నాయి.
ఏడెనిమిదేళ్లుగా అమెరికా ‘నియమాల ఆధారిత’ ప్రపంచం గురించి మాట్లాడుతోంది. చైనా ప్రాబల్యాన్ని అడ్డగించటమే లక్ష్యంగా అమెరికా వాడుకలోకి తెచ్చిన ఇండో–పసిఫిక్ వ్యూహానికి ప్రాతిపదిక ‘నియమాల ఆధా రిత’ ప్రపంచమే. ట్రంప్ ప్రకటనలకూ, ఈ వ్యూహానికీ పూర్తిగా చుక్కెదురు. అమలులో ఉన్న నియ మాలను ధిక్కరించి, అంతర్జాతీయ న్యాయానికి భిన్నంగా ప్రవర్తించి ఏ దేశాన్నయినా ఆక్రమించు కోవాలనుకునే మనస్తత్వం దేనికి దారితీస్తుంది?
అందుకే యూరప్ దేశాలన్నీ ట్రంప్ ప్రకటనపై విరుచుకు పడుతున్నాయి. సభ్యదేశాల్లో ఎవరిపై దాడి జరిగినా మిగిలిన దేశాలన్నీ అండగా నిలవాలన్నది నాటో నియమం. దానికి అనుగుణంగానే జర్మనీ, ఫ్రాన్స్ మొదలు అన్ని దేశాలూ ట్రంప్ తీరును ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడిన రష్యాను ఖండిస్తూ, తైవాన్‌ను సొంతం చేసుకోవాలనుకునే చైనాను హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తానే దురాక్రమణదారుగా మారుతుందా అన్నది చెప్పలేం.
పూర్వాశ్రమంలో రిపబ్లికన్ పార్టీకే చెందిన నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఇలాంటి బెదిరింపులకే పాల్పడేవారు. తానొక ప్రమాదకారినన్న భావన కలిగిస్తే చాలు... ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుందన్న భ్రమ ఆయనకు ఉండేది. దాన్ని ‘మ్యాడ్‌మ్యాన్ థియరీ’గా పిలిచేవారు. చివరకు ఆయన హయాంలోనే ఎంతో అప్రదిష్టపాలై ఉత్తర వియత్నాం నుంచి అమెరికా సైనికులు వైదొల గాల్సి వచ్చింది. ట్రంప్ మాటలు ‘మ్యాడ్‌మ్యాన్ థియరీ’వంటివేనా... నిజంగా ప్రమాదకరమైనవా అనే విచికిత్సలో పడ్డాయి యూరప్ దేశాలు.
దౌత్యరంగంలో ఎవరైనా సరే... మరో దేశాధినేత వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమకేం చెప్పారన్నది కాక, వారి బహిరంగ ప్రకటనలనూ, వారి ఆచరణనూ పరిగణనలోకి తీసుకుంటారు. తొలి ఏలుబడిలో సైతం ట్రంప్ ఇలాంటి హెచ్చరికలు చాలా చేసేవారు. ఉత్తర కొరియాపై నిప్పుల వాన కురిపించబోతున్నట్టు ప్రకటనలు చేయటం, చివరకు ఆ దేశానికి అతిథిగా వెళ్లి ఒప్పందం కుదుర్చుకురావటం అందరూ చూశారు. చైనా పైనా అదే తరహాలో చిందులు తొక్కేవారు. కానీ ఎప్పుడూ దాని జోలికిపోలేదు.
అయితే ఇరాన్ విషయంలో అలా కాదు. ఆ దేశ అగ్రనేతల్లో ఒకరైన కాసిం సొలేమనిని హత్య చేయించారు. వేరే దేశాల నేతలపై దాడులకు పాల్పడటం, దాన్ని అధికారికంగా ప్రకటించటం అసాధారణం. కనుకనే ట్రంప్ రెండో ఏలుబడిపై అందరిలోనూ ఆందోళన నెలకొన్నది.
విస్తరణవాద చాపల్యం అమెరికాకు మొదటినుంచీ ఉన్నదే. కానీ అదంతా మృదువైన భాష వెనక నడిచేది. వేరే దేశాల్లో పాలకుల్ని మార్చకుండానే తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకునేది. నేరుగా బెదిరింపులకు దిగటం ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త ధోరణి. ఏటా కెనడా రక్షణకు రెండువేల కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నామని, అందువల్ల ఒరిగేదేమీ లేదన్నది ఆయన అభిప్రాయం. 51వ రాష్ట్రంగా కలుపుకొంటే అదంతా ఆదా అవుతుందని ట్రంప్ అంటున్నారు. కెనడా వాదన భిన్నంగా ఉంది.
అమెరికా–కెనడా సంబంధాల వల్ల ఇరు దేశాలూ బాగుపడుతున్నాయని ఆ దేశం చెబుతోంది. తమనుంచి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఇంధనం మార్కెట్ ధరకన్నా తక్కువకు అమెరికాపొందుతున్నదని, వేలకోట్ల డాలర్ల విలువైన అమెరికా సరుకులు కెనడాలో అమ్ముడవుతున్నాయని, అమెరికా చేసే యుద్ధాలకు కోట్ల డాలర్ల ధనం వెచ్చిస్తున్నామని కెనడా విపక్ష నేత పియే పొలియేరా గుర్తుచేశారు. దండిగా ఖనిజ వనరులున్న గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్నుపడింది.
పద్దెనిమిదేళ్ల ట్రంప్ కుమారుడు ఆ ప్రాంతానికెళ్లి అది తమ సొంత జాగీరన్న అర్థం వచ్చేలా ప్రకటించాడు. నిజానికి గ్రీన్‌ల్యాండ్ డెన్మార్క్ అధీనంలో కూడా లేదు. 57,000 మంది నివసించే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉంది. కేవలం సైనిక, ఆర్థిక వ్యవహారాలు మాత్రమే డెన్మార్క్ చూస్తుంది. పనామా కాల్వపై హక్కు వదులుకోవటానికి పనామా దేశం కూడా సిద్ధంగా లేదు.
ట్రంప్ ఒక తేనెతుట్టె కదిల్చి తమాషా చూడదల్చుకున్నారా... నిజంగానే దురాక్రమణకు సిద్ధపడతారా అన్నది మున్ముందు తేలుతుంది. దురాక్రమణకు సిద్ధపడితే ఇప్పుడు పుతిన్‌కు ఉక్రెయిన్‌లో ఎదురవుతున్న పరాభవమే అమెరికాకు తప్పకపోవచ్చు. అంతకన్నా కీలకమైనదేమంటే... అమెరికా విశ్వసనీయతతో పాటు మిత్రులనూ కోల్పోతుంది. ఏకాకిగా మారుతుంది.
Comments
Please login to add a commentAdd a comment