అధికారంలోకి వచ్చీ రాగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంటా, బయటా మరమ్మతులు మొదలుపెట్టారు. ముఖ్యంగా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో చతికిలబడిన విదేశాంగ విధానం దుమ్ము దులిపి దానికి జవసత్వాలిచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ మొదలుకొని జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులీవాన్ వరకూ అందరూ విదేశీ పర్యటనల్లో బిజీగా వుండటం ఇందుకు రుజువు. సుదీర్ఘకాలం పెండింగ్‌లో వున్న చతుర్భుజ కూటమి(క్వాడ్) శిఖరాగ్ర సమావేశం ఈనెల 12న జరిగింది. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ సమావేశంలో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ అధినేతలు పాల్గొన్నారు. అది ప్రత్యేకించి చైనాను వ్యతిరేకించటానికి కాదని చెప్పినా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా అనుసరించాల్సిన ఆచరణాత్మక విధానాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. గత శుక్రవారం లాయిడ్ ఆస్టిన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలిశారు.
అంతక్రితం ఆయన జపాన్, ఉత్తర కొరియాల్లో కూడా పర్యటించారు. అమెరికా ఉన్నతాధికార బృందంతో చైనా ఉన్నత స్థాయి దౌత్యవేత్తలు గత వారం చివర చర్చలు జరిపారు. ఇందులో చర్చలకన్నా పరస్పర ఆరోపణలు, నిందలే ఎక్కువున్నాయి. హాంకాంగ్, తైవాన్‌లలో చైనా విపరీత పోకడలు, సైబర్‌దాడులు వగైరాల విషయంలో చైనాను గట్టిగా నిలదీశామని బ్లింకెన్ బాహాటంగానే చెప్పారు. అందుకు బదులు సైనిక బలగాలను ఉపయోగించి, ఆర్ధిక ఆంక్షలు విధించి వేరే దేశాలపై పెత్తనం చేస్తున్న అమెరికా వైఖరిని చైనా ఎత్తిచూపింది. అమెరికా చురుకుదనాన్ని చూసి రష్యా, చైనాలు సహజంగానే అప్రమత్తమయ్యాయి. రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవ్‌రోవ్ చైనాలో సోమవారం రెండు రోజుల పర్యటన ప్రారంభించారు. డాలర్ ఆధిపత్యాన్ని ప్రతిఘటించి, అమెరికా ఆంక్షల బారినపడిన దేశాలకు అండగా నిలవాలని తొలిరోజు చర్చల్లో నిర్ణయించారు. వేరే దేశాల సంగతలావుంచి తమపై విధించిన ఆంక్షల గురించే చైనా ఆగ్రహమంతా. చైనాలోని వీగర్ ప్రాంతంలో ముస్లింలపట్ల అనుసరిస్తున్న అణచివేత చర్యలతో ప్రమేయం వున్న ఇద్దరు చైనా ఉన్నతాధికారులపై అమెరికా ఈ ఆంక్షలు ప్రకటించింది.
వీగర్ ముస్లింలపై మారణహోమం అమలవుతున్నదని అమెరికా ఆరోపిస్తోంది. ఒకపక్క ఇండో–పసిఫిక్ ప్రాంతంలో తమకు వ్యతిరేకంగా అందరినీ కూడగడుతూ, మరోవైపు ఆంక్షల పేరిట పెత్తనం చలాయిస్తుండటం చైనాకు ఆగ్రహం కలిగిస్తోంది. అటు రష్యా సైతం ఈ మాదిరే కత్తులు నూరుతోంది. మొన్న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసి ట్రంప్‌కి సాయపడమని మరోసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలిచ్చారని అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ నివేదిక ఆరోపించింది. అయితే ఈసారి ఆ ఎత్తులు పారలేదని చెప్పింది. ఈ నివేదిక రష్యాకు ఆగ్రహం తెప్పిస్తోంది. క్రితంసారి సైతం డెమొక్రాటిక్ పార్టీ ఇలాంటి ఆరోపణే చేసి తన ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని అంటున్నది. ఈ నేపథ్యంలోనే చైనా, రష్యా చర్చలు మొదలెట్టాయి. డాలర్ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు సాంకేతికతలను పెంచుకుని తమ తమ కరెన్సీల వినియోగాన్ని విస్తరించాలని అవి నిర్ణయించాయి. అంతర్జాతీయ చెల్లింపులకు వినియోగిస్తున్న ‘స్విఫ్ట్’ విధానానికి ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని తీర్మానించాయి. వాస్తవానికి ఆ రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యంలో డాలర్ వాటా 2015తో పోలిస్తే గణనీయంగా తగ్గింది. అప్పట్లో డాలర్ మారకం 90 శాతం వరకూ వుంటే నిరుడు తొలి త్రైమాసికంలో అది 46 శాతానికి పడిపోయింది.
మన దేశంతోపాటు బ్రెజిల్, చైనా, రష్యా, దక్షిణాఫ్రికాలు సభ్యదేశాలుగా వున్న బ్రిక్స్‌లో కూడా ద్రవ్య మారకానికి ఎవరికి వారు సొంత కరెన్సీలు వినియోగించాలని ఇప్పటికే చైనా, రష్యాలు ప్రతిపాదించాయి. చెప్పాలంటే అమెరికా మిత్ర శిబిరంలోని యూరప్ దేశాలు కూడా ఈ బాటే పట్టాయి. 2019లో ఇరాన్‌పై ట్రంప్ అమలు చేసిన ఆంక్షల్ని అధిగమించటానికి ఈయూ మారకమైన యూరోలో ఇరాన్‌కు చెల్లింపులు చేయటం మొదలుపెట్టాయి. డాలర్‌ని కాదని జరిపే చెల్లింపుల్లో ఎన్నో సంక్లిష్టమైన అంశాలు ఇమిడివున్నాయి. వాటిని అధిగమించటానికి ఇంకా సమయం పడుతుంది. ఇదంతా మరోసారి ఆధిపత్య పోటీ మొదలైన వైనాన్ని వెల్లడిస్తోంది. ఈ పోటీలో ఎవరి పక్షం వహించాలో ఏ దేశానికా దేశం నిర్ణయించుకోక తప్పని స్థితి త్వరలోనే రావొచ్చు. దాదాపు అయిదు దశాబ్దాలపాటు అమెరికా, పూర్వపు సోవియెట్ యూనియన్‌ల మధ్య సాగిన ప్రచ్ఛన్న యుద్ధం పర్యవసానంగా ప్రపంచం ఎన్నో చేదు అనుభవాలు చవిచూసింది. ఎవరికి వారు ఆయుధాలు పోగేసుకోవటం, కయ్యానికి కాలు దువ్వటం అనేక సందర్భాల్లో ఉద్రిక్తతలు సృష్టించింది. ఘర్షణలు రగిల్చింది.
మరోమారు ఆ దిశగానే ప్రపంచం అడుగులు వేస్తున్న దృశ్యం కనబడుతోంది. అందరూ గుర్తించినంతకాలమే ఆధిపత్యం చెల్లుతుంది. ఎవరికి వారు దాన్ని బేఖాతరు చేయటం మొదలుపెడితే ఆ అధిపత్యం తొలుత అర్ధరహితమవుతుంది. ఆ తర్వాత కనుమరుగవుతుంది. కానీ ఆధిపత్యాన్ని వదులుకునే స్థితి ఏర్పడినప్పుడు అందుకు ప్రతి వ్యూహం కూడా వుంటుంది. అది ప్రపంచ యుద్ధంగా పరిణమించకుండా ప్రతి దేశమూ సంయమనంతో మెలగాలి. యుద్ధాలవల్ల మిగిలేది జన నష్టం, అపారవిధ్వంసమేనని గుర్తించాలి.
Comments
Please login to add a commentAdd a comment