
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయానికి దోహదపడిన అంశాల్లో కీలకమైన వలసల వివాదం... తిరిగి తిరిగి ఆయన శిబిరంలోనే చిచ్చు పెడుతున్న వైనం కనబడుతోంది. ఆయన ప్రమాణ స్వీకారానికి చాలాముందే అనుచరగణం పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అమెరికాను మళ్లీ అగ్రస్థానానికి తీసుకెళ్లాలన్న ట్రంప్ ‘మాగా’ ఉద్యమ మూలపురుషుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్‌కూ, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కూ మధ్య హెచ్1బి వీసాల విషయంలో తాజాగా తలెత్తిన లడాయి ఇప్పట్లో చల్లారడం కష్టమే.
తొలిసారి ట్రంప్ విజేతగా నిలిచిన 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హెచ్1బి వీసాలపై ఆయన దూకుడుగా మాట్లాడటం వెనక మిల్లర్ వ్యూహం ఉంది. స్థానికులను నిర్లక్ష్యం చేసి తక్కువ వేతనాలకు పరాయి దేశాలవారిని ఉద్యోగాల్లో నియమించుకునే సంస్కృతిని సాగనివ్వబోనని అప్పట్లో ట్రంప్ చెప్పేవారు. తమ ఉద్యోగాలన్నీ బయటి దేశాల పౌరులు తన్నుకుపోతున్నారని ఆగ్రహంతో ఊగిపోయిన శ్వేతజాతి అమెరికన్లు ఆయనకు ఎగబడి ఓట్లేశారు. ట్రంప్ ప్రసంగాల రచయిత మిల్లరే. ఈ దఫా సైతం ఆయన ట్రంప్ ఆంతరంగిక బృందంలో ముఖ్యుడిగా ఉండబోతున్నారు.
వలసల విషయంలో ట్రంప్ అనుచరగణంలో స్పష్టత లోపించిందన్న సంగతి ప్రచార సమయంలోనే బట్టబయలైంది. అక్రమ వలసదారులే పెద్ద సమస్యని ట్రంప్ సన్నిహితుడు వివేక్ రామస్వామి అభిప్రాయపడుతున్నారు. ఆయన్ను ఈమధ్యే ప్రభుత్వ సిబ్బందిలో అత్యధికుల్ని సాగనంపేందుకు ఏర్పాటైన ప్రభుత్వ సామర్థ్య విభాగానికి ట్రంప్ ఎంపికచేశారు. ఆ విభాగంలో ఆయనతోపాటు పనిచేయబోయే మస్క్ సైతం వివేక్ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు.
కానీ మిల్లర్‌తోపాటు, తీవ్ర మితవాది అయిన లారా లూమర్, స్టీవ్ బానన్ వంటివారు దీన్ని అంగీకరించటం లేదు. అసలు హెచ్1బి వీసా విధానాన్నే పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికన్ సంస్కృతి, జీవన విధానం వైపు చర్చ మళ్లడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికన్లలో అనేకులు సమర్థత నుంచి నాసిరకం సంస్కృతికి మళ్లి చాన్నాళ్లవుతోందని వివేక్ రామస్వామి వ్యాఖ్యానిస్తే... అమెరికన్లు తెగువ, ఆత్మవిశ్వాసం దండిగా ఉన్నవారంటూ 2020లో ట్రంప్ చేసిన ప్రసంగం వీడియోను మిల్లర్ ఎక్స్ వేదికపై వదిలారు.
ఇంతకూ ట్రంప్ ఏమనుకుంటున్నారు? మాకు చురుకైనవాళ్లు, సమర్థులు కావాలని నూతన సంవత్సర వేడుకల సమావేశంలో ట్రంప్ చెప్పడం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది. తానెప్పుడూ హెచ్1బి వీసాల విధానాన్ని వ్యతిరేకించలేదని అనటం అర్ధ సత్యమే అయినా ట్రంప్ వైఖరి మారిందని, ఆయనపై మస్క్ ప్రభావం బలంగా ఉన్నదని రిపబ్లికన్లలో బలమైన మితవాద వర్గం గుసగుసలు పోతోంది. ఎవరెలా అనుకున్నా హెచ్1బి వీసాల సంగతలా వుంచి అక్రమ వలసదారుల్ని గెంటేయటం అంత తేలిక కాదు.
వారిపై ముందు వలస వ్యవహారాల న్యాయ స్థానంలో కేసు దాఖలు చేయాలి. వారు రకరకాల వాదనలతో ముందుకొస్తారు. విచారణ వాయి దాల్లో నడుస్తుంటుంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులు తేలాలంటేనే 2029 చివరివరకూ పడుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కొత్తవారిని గుర్తించి కేసులు పెడితే ఆ భారం మరింత పెరుగుతుంది. చట్టాన్ని సవరిస్తే తప్ప ఇది అంత సులభంగా తేలదు. దానికితోడు అక్రమ వలస దారులను గుర్తించే ఐసీఈ ఏజెంట్లు 6,000 మందికి మించిలేరు.
దానికి కేటాయించే నిధులు సైతం ఏ సమయంలోనూ 40,000 మందిని మించి నిర్బంధించేందుకు సరిపోవు. ఒకవేళ అక్రమ వలస దారులందరినీ సాగనంపడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినా, లక్షలమంది తరలింపునకు విమానాలు సమకూర్చడం అసాధ్యం. ఇక డెమాక్రాట్ల ఏలుబడిలో ఉన్న న్యూయార్క్, షికాగో, లాస్‌ఏంజెలస్, డెన్వర్ వంటి నగరాలు అక్రమ వలసదారుల ఏరివేతకు సహకరించవు.
అక్రమ వలసదారుల్ని వెనక్కిపంపిన గతకాలపు అధ్యక్షుడు ఐసెన్ హోవర్ తనకు ఆదర్శమని ట్రంప్ అంటున్నారు. కానీ ఆకాలంలో మెక్సికో మినహా మరే దేశంనుంచీ పెద్దగా వలసలు లేవు. ఇప్పుడలా కాదు... చైనా, భారత్, మారుటేనియా, ఉజ్బెకిస్తాన్ దేశాలనుంచి రికార్డు స్థాయి అక్రమ వలసలున్నాయి. ఇందులో ఎన్ని దేశాలు ట్రంప్‌కు సహకరిస్తాయన్నది ప్రశ్న.
సమస్యలు సృష్టించటం సులభం. కానీ వాటి పరిష్కారం అన్ని సందర్భాల్లోనూ అంత తేలిక కాదు. తగిన అర్హతలున్నవారు స్థానికంగా దొరక్కపోతే బయటి దేశాలనుంచి ఆ నైపుణ్యం ఉన్న వారిని తీసుకురావటం కోసం రూపొందించిన హెచ్1బి వీసాను బడా సంస్థలు ఖర్చు తగ్గించు కోవటానికి వాడుకుంటున్న మాట వాస్తవం. దాన్ని ట్రంప్ తనకు అనుకూలంగా సొమ్ము చేసు కోవటం సైతం నిజం. కానీ ఆ సమస్యే పార్టీలో చిచ్చుపెడుతుందని ఆయన ఊహించి వుండరు.
ఇంతకూ ఆయన ఎవరి పక్షమన్న విషయంలో వైరి వర్గాల్లో ఎవరికీ స్పష్టత లేదు. ఎందుకంటే వివేక్, మస్క్, శ్రీరాం కృష్ణన్‌వంటి గతకాలపు వలసదారుల్ని తీసుకున్న ట్రంప్ మరోపక్క వలసలకు పక్కా వ్యతిరేకి అయిన స్టీఫెన్ మిల్లర్‌తోపాటు ఆయన భార్య కేటీ మిల్లర్‌ను సైతం తన బృందంలో చేర్చు కున్నారు. ఏదేమైనా హెచ్1బి వీసాలు పొందినవారిలో అత్యధికులు మనవాళ్లే కనుక వారి మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది. అలాగే ట్రంప్‌ను మించిన శ్వేతజాతి చాంపియన్ అమెరికా రాజకీయాల్లో ఆవిర్భవించే అవకాశం కూడా లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment