సంక్షోభకాలంలో సంయమనం పాటించడం, దాన్నుంచి గట్టెడానికి అవసరమైన కార్యాచరణను రూపొందించటంలో నిమగ్నం కావడం కీలకం. అనవసర వివాదాల్లో తలదూర్చి వాటికోసమే శక్తి యుక్తుల్ని వెచ్చిస్తే అందువల్ల ఒరిగేదేమీ వుండదు సరికదా...నష్టపోతాం. ఈమధ్య ఢిల్లీలో కరోనా వైరస్ బారినపడినవారికి యువజన కాంగ్రెస్ ఆక్సిజన్ అందించే కార్యక్రమాన్ని మొదలెట్టింది. పలు ఇతర సంస్థలు కూడా ఈ విషయంలో శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. పలుకుబడిగల కొందరు వ్యక్తులు సైతం రోగులను ఆదుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలన్నిటా ఈ భోగట్టా కనబడుతూనేవుంది. ఇలాంటి సంస్థలనూ, వ్యక్తులనూ అందరూ ప్రశంసించాల్సిందే. ఎందుకంటే కష్టకాలంలో కేవలం ప్రభుత్వాలే అన్నీ చేయాలంటే సాధ్యం కాదు. సమాజంలో చొరవ, స్థోమత వున్న ప్రతి ఒక్కరూ పూనుకున్నప్పుడే సంక్షోభాల నుంచి సురక్షితంగా బయటపడగలం.
కానీ నాలుగైదు రోజులనాడు కేంద్రానికీ, కాంగ్రెస్‌కూ మధ్య జరిగిన చిన్నపాటి వివాదం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమై మన దేశం ప్రతిష్టను మసకబార్చింది. ఢిల్లీలోని ఫిలిప్పీన్స్ రాయబార కార్యాలయం తమకు ఆక్సిజన్ సిలెండర్ అవసరమైందంటూ ట్విటర్ ద్వారా యువజన కాంగ్రెస్‌ను కోరడంతో ఈ వివాదం మొదలైంది. ఆ విభాగం అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ బృందం వెంటనే కదిలి ఆ కార్యాలయానికి సిలెండర్ అందించింది. సహజంగానే కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కేంద్రాన్ని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. విదేశీ రాయబార కార్యాలయాల నుంచి వచ్చిన అత్యవసర సందేశానికి విపక్ష విభాగం వెనువెంటనే స్పందిస్తుంటే, విదేశాంగ శాఖ కార్యాలయం నిద్రపోతోందా అని ఆయన ప్రశ్నించారు. ఎప్పుడూ సౌమ్యంగా కనిపించే... మృదువుగా మాట్లాడే విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ ఎందుకనో దీనిపై తీవ్రంగా స్పందించారు. ఇది అయాచితంగా చేసిన సాయమంటూ చురక అంటించారు. దాంతో ఆగక ఆ రాయబార కార్యాలయాన్ని తాము సంప్రదించామని, వారివద్ద కరోనా కేసులే లేవని వెల్లడైందంటూ ముక్తాయించారు. నగరంలో అనేకమంది పౌరులు ఆక్సిజన్ కోసం ఆత్రపడుతున్న తరుణంలో చవకబారు ప్రచారం కోసం ఫిలిప్పీన్స్ కార్యాలయం కోరకుండానే సిలెండర్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. యువజన కాంగ్రెస్ ఊరుకోలేదు. అడిగాకే ఇచ్చామంటూ ఈ విషయంలో జరిగిన సంభాషణల ట్వీట్లను విడుదల చేసింది. స్విట్జర్లాండ్ దౌత్య కార్యాలయం కూడా ఆ మాదిరే అడిగింది. కానీ జరుగుతున్న జగడాన్ని చూసి చడీచప్పుడూ లేకుండా తన ట్వీట్‌ను తొలగించి సారీ చెప్పింది. ఆక్సిజన్ అవసరమై ‘అన్ని విధాలా’ తాము ప్రయత్నించామని, దీనికి పెడర్థాలు తీయడం వల్ల ఉపసంహరించుకుంటు న్నామని తెలిపింది. నిజానికి వివాదం అయింది ఫిలిప్పీన్స్ విషయంలో మాత్రమే.
కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చిన వేళ ఉద్వేగాలు పెరగడం సహజం. దేశ పౌరులకే ఆక్సిజన్ విషయంలో రకరకాల అనుభవాలు ఎదురవుతుంటే, వేరే దేశాలవారికి ఎలాంటి భయాలుంటాయో సులభంగానే గ్రహించవచ్చు. కరోనా బారిన పడుతున్న సహచరులకు వైద్యసాయం అందించ డానికి వారు ఆత్రపడటాన్ని అర్థం చేసుకోవచ్చు. టాంజానియా హైకమిషన్‌లోని కల్నల్ మోజెస్ బీటస్ మ్లూలా గత నెల 28న ఢిల్లీ ఆసుపత్రిలో మరణించాక దౌత్య కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిలో ఆందోళన బయల్దేరింది. అమెరికా, జర్మనీ, ఇజ్రాయెల్, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్తాన్, స్వీడన్, నేపాల్ దౌత్య కార్యాలయాలల్లో పనిచేసేవారిలో ఈమధ్య కరోనా కేసులు బయటపడ్డాయి. అమెరికా రాయబార కార్యాలయంలో సిబ్బంది, వారి బంధువులతోసహా వందమందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే మన పౌరుల్లా వారు బాహాటంగా అన్నీ బయటకు చెప్పలేరు. సమస్యలెదురైనా దౌత్యపరమైన మార్గాల్లో ప్రయత్నిస్తారు. విదేశాంగ శాఖలో వుండే ప్రోటోకాల్ చీఫ్, వివిధ దేశాల దౌత్య సిబ్బంది వ్యవహారాలను చూసే డివిజన్‌ల చీఫ్‌లు అనారోగ్య సమస్యల విషయంలో చురుగ్గా స్పందిస్తారు. వారిని ఆసుపత్రుల్లో చేర్చే బాధ్యతను కూడా తీసుకుంటారు. ఇదంతా సక్రమంగా జరిగితే దౌత్య కార్యాలయాల్లోని సిబ్బందిలో కరోనా తలెత్తిందన్న విషయం కూడా బయటకు తెలిసే అవకాశం వుండదు. అయితే ఈ క్రమంలో ఎక్కడో ఏర్పడిన లోపంవల్ల ఫిలిప్పీన్స్ దౌత్య కార్యాలయం యువజన కాంగ్రెస్‌ను సంప్రదించివుండొచ్చు. కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఎలా స్పందించినా ప్రభుత్వం అక్కడితో దాన్ని వదిలి, లోటుపాట్లేమైనా వుంటే సరిదిద్దుకుని వుంటే బాగుండేది. అందుకు భిన్నంగా బహిరంగ వేదికలపై అధికార, విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకోవటంతో రచ్చ అయింది. స్విట్జర్లాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ కూడా ఈ విషయంలో స్పందించక తప్పలేదు. తమ దౌత్య సిబ్బందిలో ఒకరు కరోనా బారిన పడిన విషయం నిజమేనని తెలిపారు. మావాళ్లు సరైనమార్గంలో ప్రయత్నించలేదని, అందుకు క్షమాపణ చెప్పారని అన్నారు. ఆమె ఇతరత్రా అంశాల జోలికి పోకుండా ఒక్కమాటలో ముగించారు. సాధా రణ సందర్భాల్లో అయితే దౌత్యంలో తలపండిన జయశంకర్ కూడా ఇలాగే మాట్లాడేవారు. కానీ ఆయన నోరు జారి అంతా అబద్ధమని, చవకబారు ప్రచారయావ మాత్రమేనని కొట్టిపారేసే ప్రయత్నం చేసి వివాదాన్ని పెంచారు. సామాజిక మాధ్యమాల ప్రాముఖ్యత పెరిగిన ప్రస్తుత దశలో ప్రతిదీ రచ్చకెక్కి మనల్ని నలుగురిలో పలుచన చేస్తుందని అందరూ గుర్తించడం మంచిది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో సంయమనం పాటించటం చాలా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment