ప్రపంచానికి మాస్కో పాఠం | Sakshi Editorial On Moscow terrorist attack | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి మాస్కో పాఠం

Published Tue, Mar 26 2024 5:40 AM | Last Updated on Tue, Mar 26 2024 5:40 AM

Sakshi Editorial On Moscow terrorist attack

ప్రపంచదేశాలు ఉలిక్కిపడ్డాయి. శుక్రవారం రాత్రి మాస్కో సమీపంలో క్రిక్కిరిసిన మాల్‌లోకి వచ్చి, ఓ సంగీత కార్యక్రమ హాలులోని జనంపై నలుగురు తీవ్రవాదులు జరిపిన విచక్షణారహితమైన దాడి ప్రపంచ భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. గత రెండు దశాబ్దాల్లో రష్యాలో కనివిని ఎరుగని ఈ స్థాయి దాడిలో దాదాపు 140 మందికి పైగా అమాయకులు ప్రాణాలు విడిస్తే, కొన్ని పదుల మంది గాయాల పాలయ్యారు. రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌ అయిదోసారి ఘనవిజయం సాధించిన కొద్ది రోజులకే ఈ దుశ్చర్య జరగడం గమనార్హం.

యథేచ్ఛగా కాల్పులు జరిపి, భవనాన్ని తగులబెట్టిన దుండగులకు ఉక్రెయిన్‌తో లింకుందని రష్యా గూఢచర్య సంస్థల మాట. అయితే, 2022 నుంచి రష్యా యుద్ధంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఉక్రెయిన్‌ మాత్రం తమకు సంబంధం లేదని ఖండించింది. కాగా, ఈ దాడి తామే చేసినట్టు తీవ్రవాద ‘ఐఎస్‌ఐఎస్‌’(ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాన్‌ అండ్‌ సిరియా) శాఖ అయిన ‘ఇస్లామిక్‌ స్టేట్‌ – ఖొరసాన్‌ ప్రావిన్స్‌’ (ఐఎస్‌ఐఎస్‌–కె) ప్రకటించడంతో కొత్త చర్చకు తెర లేచింది. 

జనబాహుళ్యం ప్రాంతాల్లో ఇస్లామిస్ట్‌ ఉగ్రదాడుల ప్రమాదం ఉందని అమెరికా మార్చి 7 నాటికే హెచ్చరించింది. అయినా, రష్యా పెడచెవిన పెట్టింది. అలా ఈ దాడులు మాస్కో స్వీయ భద్రతా వైఫల్యానికి అద్దం పట్టడమే కాక, ఆ దేశానికి తలవంపులయ్యాయి. మాస్కో శివారులోనే తీవ్ర వాదులు చులాగ్గా దాడి చేస్తుంటే, ఉక్రెయిన్‌పై యుద్ధంతో తీరిక లేని రష్యాకు తగిన ప్రత్యేక దళాలు అందుబాటులో లేకుండా పోయాయనే మాటా వినిపిస్తోంది.

అయినా సరే, దేశంలో అసమ్మతిపై ఉక్కుపాదం మోపి, ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా 87.7 శాతంపైగా ఓట్లు తెచ్చుకొని, ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రజామోదం ఉందని చెప్పుకుంటున్న రష్యా పాలకులు ఇప్పటికీ తప్పుడు దిశ వైపు చూస్తుండడం ఆశ్చర్యకరం. స్వయంకృతమని భావిస్తున్న తీవ్రవాద ముప్పుకూ పాశ్చాత్య ప్రపంచాన్నే నిందిస్తుండడం విచిత్రం. రెండు దశాబ్దాల పైగా ఉత్తర కాకసస్, చెచెన్యాలలో తీవ్రవాదంపై రష్యా తలపడుతోంది. సిరియా – ఇరాన్‌లతో దాని స్నేహం, మధ్యప్రాచ్యంలో దాని తీవ్రవైఖరి సరే సరి. ఇస్లామిజమ్‌ అణచివేతకూ దిగింది. దానికిప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోందని విశ్లేషణ.  

నిజానికి, ఇరాక్, సిరియా దేశాల యుద్ధక్షేత్రాల్లో అసలైన ఐఎస్‌ఐఎస్‌ చాలా వరకు ఓటమి పాలైంది. అయితే, ఆ మాతృసంస్థ తాలూకు రక్తసిక్త వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న ‘ఐఎస్‌ ఐఎస్‌ –కె’ పడగ విప్పి, బుసలు కొడుతోంది. అఫ్గానిస్తాన్‌ నుంచి పనిచేస్తున్నట్టుగా అందరూ భావిస్తున్న ఈ వర్గం నిదానంగా తన విషవృక్షపు ఊడలను విస్తరిస్తోంది. ఇప్పటికే అటు అఫ్గానిస్తాన్‌లోనూ, ఇటు పాకిస్తాన్‌లోనూ అది అనేక దాడులు జరిపింది. ఈ జనవరిలో సైతం ఇరాన్‌లోని కెర్మాన్‌లో ఇరానియన్‌ జనరల్‌ సంస్మరణ కార్యక్రమం సందర్భంగా అది జరిపిన బాంబు దాడుల్లో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

తాజా మాస్కో దాడితో ఈ తీవ్రవాద గ్రూపు భౌగోళికంగా తన పరిధిని విస్తరించుకుంటున్నట్టు కనిపిస్తోంది. 2015 నాటి సిరియా అంతర్యుద్ధంలో రష్యా సేనలు అక్కడి అధ్యక్షుడు బషర్‌ అల్‌–అసద్‌ ఏలుబడిని సమర్థిస్తూ, ఐఎస్‌ వర్గానికి వ్యతిరేకంగా నిలిచాయి. సిరియాలో ప్రస్తుతం సద్దు లేనందున ‘ఐఎస్‌ఐఎస్‌–కె’ సారథ్యంలోని తీవ్రవాదులు అక్కడ తమ ఓటమికి ఇప్పుడిలా దాడి రూపంలో రష్యాపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించి ఉండవచ్చు. 

ఉక్రెయిన్‌తో యుద్ధంలో మునిగిన పుతిన్‌ ఈ తాజా తీవ్రవాద దాడిపై స్పందించే తీరు రానున్న రోజుల్లో ప్రపంచ శక్తి సంబంధాలపై ప్రభావం చూపడం ఖాయం. అసలు దాడికీ, ఉక్రెయిన్‌కూ సంబంధం ఉందన్న రష్యా మాట నమ్మశక్యంగా లేకపోగా, మధ్య ఆసియా ప్రాంతానికి విస్తరించాలని ‘ఐఎస్‌ఐఎస్‌–కె’ పడుతున్న ఆరాటానికి బలమైన ఆధారాలు కనిపిస్తున్నాయి.

తజిక్‌ వర్గాల్లో ఈ తీవ్రవాద వర్గానికి ఆకర్షణ పెరుగుతోందనీ, ఈ ప్రాంతానికి విస్తరించే సత్తా దానికి ఉందనీ జనవరిలోనే ఐరాస భద్రతా మండలి తన నివేదికలో హెచ్చరించడం గమనార్హం. గత రెండు దశాబ్దాల్లో వివి«ద రకాల తీవ్రవాద ఘటనలు చూసిన మాస్కో కళ్ళు తెరిచి నిద్ర నటించడం మానాలి. ప్రస్తుత పరిస్థితుల్లో శుష్క ఆరోపణలు మానేసి, సమస్య అసలు మూలాలపై దృష్టి పెట్టాలి. సొంత పెరట్లోనే ఈ తీవ్రవాద వర్గంతో పోరాటం చేస్తున్న అఫ్గానిస్తాన్‌ పాలకులతో కలసి కార్యాచరణ చేపట్టాలి.
 
రష్యా ఘటన సాక్షిగా ఇప్పుడు కావాల్సిందల్లా... తీవ్రవాదంపై ప్రపంచ దేశాల మధ్య ఒక స్పష్టమైన అవగాహన, అంగీకారం. అంతర్జాతీయంగా ఐఎస్‌ఐఎస్‌–కె ఊడలు మరింత లోతుగా దిగక ముందే వివిధ ప్రపంచ దేశాలు నడుం బిగించాలి. మునుపు ఐఎస్‌ను మట్టి కరిపించడానికి కలసికట్టుగా కాలు కదిపినట్టే ఇప్పుడూ ముందుకు కదలాలి. ఐఎస్‌ఐఎస్‌–కె బలంగా వ్యతిరేకించే అఫ్గాన్‌ తాలిబన్‌తో అంతర్జాతీయ సమాజం సైతం సమన్వయం చేసుకోవాలి.

సొంత గడ్డపై ఐఎస్‌ఐఎస్‌–కె, టీటీపీ లాంటి తీవ్రవాదుల కార్యకలాపాలను అనుమతించడం వల్ల చివరకు తమ దేశంతో పాటు, ఈ ప్రాంత భద్రతకే ప్రమాదమని అఫ్గానిస్తాన్‌ కూడా గ్రహించాలి. అందుకే, ఆ దేశం, దాని పొరుగునున్న ఈ తీవ్రవాద విషసర్పం కోరలు పీకే పనిలో ముందు వరుసలో నిలవాలి.

ఇరాన్, చైనా, రష్యా, మధ్య ఆసియా దేశాలు కలిసొచ్చి, ప్రాంతీయంగా ముప్పుగా పరిణమిస్తున్న ఈ తీవ్రవాద భూతాన్ని నిర్వీర్యం చేయాలి. ఏకాగ్ర దృష్టితో సునిశితమైన కార్యాచరణకు దిగితేనే ఫలితాలుంటాయి. అప్పుడే అసువులు బాసిన అమాయకుల పక్షాన నిలిచి, దోషులను వెంటాడి వేటాడగలం. పొంచివున్న సరికొత్త తీవ్రవాద వర్గపు ప్రమాదం నుంచి ప్రపంచాన్ని కాపాడగలం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement