ప్యారిస్ వేసవి విశ్వక్రీడా సంరంభం ముగిసింది. దాదాపు 850 పతకాలు విజేతలను వరించిన ఈ 2024 ఒలింపిక్స్‌లో 10 ప్రపంచ రికార్డులు, 32 ఒలింపిక్ రికార్డులతో సహా మొత్తం 42 రికార్డులు బద్దలయ్యాయి. మరి, భారత్ సాధించినదేమిటి అన్నప్పుడే ఆశ నిరాశలు దోబూచులాడతాయి. 117 మంది అథ్లెట్లతో, 16 క్రీడాంశాల్లో పోటీపడుతూ భారత ఒలింపిక్ బృందం ఎన్నో ఆశలతో విశ్వ వేదికపై అడుగుపెట్టింది. ఈసారి రెండంకెల్లో పతకాలు సాధిస్తామనే ఆకాంక్షను బలంగా వెలి బుచ్చింది.
తీరా ఒలింపిక్స్ ముగిసేవేళకు అరడజను పతకాలతోనే (5 కాంస్యం, 1 రజతం) తృప్తి పడాల్సి వచ్చింది. గడచిన 2020 టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన 7 పతకాల అత్యుత్తమ ప్రదర్శనతో పోలిస్తే... ఇది ఒకటి తక్కువే. ఈ సంరంభంలో మొత్తం 84 దేశాలు పాల్గొంటే, ప్రపంచంలో అత్యధికంగా 145 కోట్ల జనాభా గల మన దేశం పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది. మన పతకాలు, జనాభా నిష్పత్తి చూస్తే, ప్రతి 25 కోట్ల మందికి ఒక్క పతకం వచ్చిందన్న మాట. ‘ఖేలో ఇండియా’ పేరిట కోట్లు ఖర్చుచేస్తున్నామంటున్న పాలకులు ఆత్మశోధనకు దిగాల్సిన అంశమిది.
ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం, పొంచివున్న దాడుల పట్ల భద్రతా సిబ్బంది భయం, ఫ్రెంచ్ ప్రజానీకంలో పెద్దగా ఉత్సాహం లేకపోవడం... వీటన్నిటి మధ్య ప్యారిస్ ఒలింపిక్స్ సరిగ్గా జరుగు తాయో జరగవో అని అందరూ అనుమానపడ్డారు. అన్నిటినీ అధిగమించి ఈ విశ్వ క్రీడోత్సవం విజయవంతంగా ముగిసింది. పైగా, అస్తుబిస్తుగా ఉన్న ఫ్రెంచ్ ఆర్థిక వ్యవస్థకు ఇప్పుడు అత్యవ సరమైన కొత్త ఉత్సాహమూ నింపింది.
క్రితంసారి కోవిడ్ మూలంగా టోక్యోలో ప్రేక్షకులు లేకుండానే పోటీలు నిర్వహించిన నేపథ్యంలో ఈసారి స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్ల నుంచి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఒత్తిడి ఉంది. నిర్వాహకులు మొత్తం ప్యారిస్‌ను ఓపెన్–ఎయిర్ ఒలింపిక్ క్రీడాంగణంగా మార్చేసి, అందరూ ఆహ్వానితులే అనడంతో ఊహించని రీతిలో ఇది దిగ్విజయమైంది.
పోటీల్లో పాల్గొన్న ఒకరిద్దరు క్రీడాకారుల జెండర్ అంశం, భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ అనర్హత వ్యవహారం లాంటివి మినహా ఈ ప్యారిస్ ఒలింపిక్స్ అతిగా వివాదాస్పదం కాలేదనే చెప్పాలి. ఉక్రెయిన్, గాజా లాంటి భౌగోళిక రాజకీయ అంశాలు, అలాగే అమెరికాలో ఎన్నికల వేడి, బ్రిటన్‌లో అల్లర్లు, బంగ్లాదేశ్‌లో సంక్షోభం లాంటివి పతాక శీర్షికలను ఆక్రమించేసరికి ఒలింపిక్స్ వివాదాలు వెనుకపట్టు పట్టాయనీ ఒప్పుకోక తప్పదు.
ప్యారిస్ వేసవి ఒలింపిక్స్‌కు తెర పడింది కానీ, ఈ ఆగస్ట్ 28 నుంచి అక్కడే పారా ఒలింపిక్స్–2024 జరగనుంది. తదుపరి 2028 వేసవి ఒలింపిక్స్‌కు లాస్ ఏంజెల్స్ సిద్ధమవుతోంది. కేవలం రెండే పతకాలు సాధించిన 2016 నాటి రియో ఒలింపిక్స్‌తో పోలిస్తే, భారత్ మెరుగైన మాట నిజమే. అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, మహిళా బ్యాడ్మింటన్‌లో వెనుకబడినా టేబుల్ టెన్నిస్, షూటింగ్‌లలో కాస్త ముందంజ వేశామన్నదీ కాదనలేం.
ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి, ఆ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా 22 ఏళ్ళ మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. గోల్‌కీపర్ శ్రీజేశ్ సహా హాకీ బృందమంతా సర్వశక్తులూ ఒడ్డి, వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ పతకం సాధించింది. ఇక ఈ ఒలింపిక్స్‌లో ఊరించి చేజారిన పతకాలూ చాలా ఉన్నాయి. భారత మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ సంచలన విజయాలు నమోదు చేసినా, వంద గ్రాముల అధిక బరువు రూపంలో దురదృష్టం వెన్నాడకపోతే స్వర్ణం, లేదంటే కనీసం రజతం మన ఖాతాలో ఉండేవి.
షట్లర్ లక్ష్యసేన్, అలాగే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటర్ అర్జున్ బబుతా సహా కనీసం 6 సందర్భాల్లో మనవాళ్ళు ఆఖరి క్షణంలో నాలుగో స్థానానికి పరిమితమ య్యారు. లేదంటే పతకాల పట్టికలో మన దేశం మరింత ఎగబాకేదే. పతకాలు, విజయాల మాటెలా ఉన్నా, మన మార్కెటింగ్ విపణికి కొన్ని కొత్త ముఖాలు దొరికాయి. గాయాల నుంచి ఫీనిక్స్ పక్షిలా లేచిన నీరజ్ చోప్రా, పీవీ సింధుల మొదలు నిలకడగా ఏళ్ళ తరబడి ఆడిన శ్రీజేశ్, రెండు పతకాల విజేత మనూ భాకర్, బ్యాడ్మింటన్ క్రేజ్ లక్ష్యసేన్ దాకా పలువురు బ్రాండ్లకు ప్రీతిపాత్రులయ్యారు.
కానీ ఇది సరిపోతుందా? ఆర్చరీ, బాక్సింగ్ సహా పలు అంశాల్లో నిరాశాజనక ప్రదర్శన మాటే మిటి? మిశ్రమ భావోద్వేగాలు రేగుతున్నది అందుకే. ఇప్పటికైనా మన ప్రాధాన్యాలను సరి చేసుకో వాలి. అత్యధిక జనాభా గల దేశంగా ప్రతిభకు కొదవ లేదు. ప్రతిభావంతుల్ని గుర్తించి, ప్రోత్సహించి, సరైన రీతిలో తీర్చిదిద్దడమే కరవు. మనకొచ్చిన 6 పతకాల్లో 4 దేశ విస్తీర్ణంలో 1.4 శాతమే ఉండే హర్యానా సంపాదించి పెట్టినవే.
అంటే, మొత్తం పతకాల్లో హర్యానా ఒక్కదాని వాటా 66 శాతం. మరి, మిగతా దేశం సంగతి ఏమిటి? అక్కడి పరిస్థితులేమిటి? ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థ మనదని జబ్బలు చరుచుకుంటున్న పాలకులు ఇవాళ్టికీ క్రీడలకు సరైన రీతిలో వస తులు, వనరులు ఇవ్వట్లేదు. పేరొచ్చాక సాయం చేస్తే సరిపోదు. క్షేత్రస్థాయిలో ఆటగాళ్ళకు నారు పోసి, నీరు పెట్టాలి.
మన క్రీడా సంఘాలు, ప్రాధికార సంస్థలు రాజకీయ నేతల గుప్పెట్లో ఇరుక్కుపోవడం పెను విషాదం. పతకాలకై పోరాడాల్సిన ఆటగాళ్ళు లైంగిక వేధింపులు సహా అనేక సమస్యలపై రోడ్డెక్కి పోరాడాల్సిన పరిస్థితిని కల్పించడం మన ప్రభుత్వాల తప్పు కాదా? క్రీడా సంస్కృతిని పెంచి పోషించడానికి బదులు రాజకీయాల క్రీనీడలో ఆటను భ్రష్టు పట్టిస్తే, పతకాలు వచ్చేదెట్లా? అంతర్జాతీయ స్థాయిలో విజయానికి దూరదృష్టి, సరైన వ్యూహం, నిరంతరం పెట్టుబడి, స్పష్టమైన క్రీడా విధానం రాష్ట్ర స్థాయి నుంచే కీలకం.
ఆ దిశగా ఆలోచించాలే తప్ప దాహమేసినప్పుడు బావి తవ్వితే కష్టం. అందుకే, 1900 తర్వాత నూటపాతికేళ్ళలో ఒలింపిక్స్‌లో ఇది మన రెండో అత్యుత్తమ ప్రదర్శన. ఇకనైనా అపూర్వ క్రీడాదేశంగా మనం అవతరించాలంటే, పాలకులు చేయాల్సింది చాలా ఉంది.
చేయాల్సింది చాలావుంది!
Published Tue, Aug 13 2024 12:05 AM | Last Updated on Tue, Aug 13 2024 12:05 AM
Comments
Please login to add a commentAdd a comment