‘మానవుడే మహనీయుడు... గగనాంతర రోదసిలో గంధర్వగోళ గతులు దాటిన... మానవుడే మాననీయుడు’ అన్నారు ఆరుద్ర. మానవుడిలోని ఆ శక్తినీ, యుక్తినీ మరోసారి గుర్తుచేస్తూ గత పది రోజులుగా వస్తున్న అంతరిక్ష యాత్రల వార్తలే అందుకు నిదర్శనం. ‘వర్జిన్ గెలాక్టిక్’ సంస్థ అధినేత – బ్రిటీషర్ రిచర్డ్ బ్రాన్సన్ జూలై 11న, తరువాత సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్’ అధినేత– అమెరికన్ వ్యాపారి జెఫ్ బెజోస్ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు. వీటి గురించి ఇవాళ ప్రపంచమంతా ఆసక్తిగా చెప్పుకుంటోంది. త్వరలోనే ‘టెస్లా’ సంస్థ అధినేత ఎలన్ మస్క్ తన ‘స్పేస్ ఎక్స్’ సంస్థతో జరిపేది ముచ్చటగా మూడో విహారం. నిజానికి, ఇవన్నీ కుబేరుల మధ్య పోటాపోటీ రోదసీ యాత్రలు. అయితేనేం, లక్షల డాలర్లు ఖర్చుపెట్టి వారు రూపొందిస్తున్న అంతరిక్ష విమాన నౌకలు, ఈ విహార ప్రయత్నాలు ప్రపంచంలో వస్తున్న మార్పుకు సూచనలు. ఖర్చు పెట్టుకొనే స్థోమతే ఉంటే, ఎవరైనా సరే అనాయాసంగా అంతరిక్ష విహారం చేసి రావచ్చని తేల్చిన నిరూపణలు. భవిష్యత్తులో రోదసీ పర్యాటకం ఓ ప్రధాన రంగంగా ఆవిర్భవించనుందని చాటిచెప్పిన కీలక సంఘటనలు.
కొద్ది నిమిషాల్లోనే భూవాతావరణాన్ని దాటి రోదసిలోకి ప్రయాణించి, భారరహిత స్థితిలో అంతెత్తు నుంచి భూగోళాన్ని చూసి, ఆ వెంటనే సురక్షితంగా భూమి మీదకు తిరిగొచ్చేయడం ఇక సాధ్యమని ఈ యాత్రలు చాటాయి. అపురూపమైన ఆ అనుభవం కావాలను కొనే సంపన్నులు, సాహసికులు ఇప్పుడిక డబ్బు సంచులు సిద్ధం చేసుకోవడమే తరువాయి! నాలుగు నిమిషాల అపూర్వ అనుభవం కావాలంటే, టికెట్ రెండున్నర లక్షల డాలర్లు. అలా ‘వర్జిన్ గెలాక్టిక్’ ఇప్పటికే 600 టికెట్లు విక్రయించడం గమనార్హం. తాజా రెండు యాత్రల్లోనూ కొన్ని విశేషాలున్నాయి. రిచర్డ్ బ్రాన్సన్ బృందంలో భాగమై, 86 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్ళి, రోదసీ విహారం చేసిన తొలి తెలుగమ్మాయిగా బండ్ల శిరీష చరిత్రకెక్కారు. ఆ వెంటనే బెజోస్ బృందం వంద కిలోమీటర్ల ఎత్తులోని కార్మాన్ రేఖ దాటి, భూమి నుంచి మరింత ఎత్తుకు 106 కిలోమీటర్ల దూరం దాకా వెళ్ళి రికార్డు సృష్టించింది. ఈ కొత్త రికార్డు యాత్రలో రోదసీ విహారం చేసిన అతి పిన్నవయస్కుడు (18 ఏళ్ళ ఆలివర్ డేమన్), అతి పెద్ద వయస్కురాలు (82 ఏళ్ళ వ్యోమగామి వ్యాలీ ఫంక్) కూడా భాగం కావడం మరో చరిత్ర.
నిజానికి, మానవాళి రోదసీ విజయ చరిత్ర ఎప్పుడో ఆరంభమైంది. అంతరిక్షయానం మనకు మరీ కొత్తేమీ కాదు. ఇప్పటి కుబేరుల పోటీలానే, దశాబ్దాల క్రితం ప్రపంచంలో ప్రచ్ఛన్న యుద్ధవేళ అంతరిక్ష విజయానికి అగ్రరాజ్యాల మధ్య పోటీ సాగింది. అరవై ఏళ్ళ క్రితం రష్యన్ వ్యోమగామి యూరీ గగారిన్ 1961లో రోదసీ యాత్ర చేసిన తొలి మానవుడనే ఖ్యాతి దక్కించుకున్నారు. ఇక, 52 ఏళ్ళక్రితం 1969 జూలై 20న అమెరికన్ నీల్మ్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలిసారిగా కాలుమోపాడు. ఇరవై ఏళ్ళ క్రితమే 2001లో రష్యన్లు ధనికుడైన పెట్టుబడిదారు డెన్నిస్ టిటోను రోదసిలోకి తీసుకువెళ్ళారు. ప్రైవేటు రోదసీ విమాన నౌకలో మనుషుల్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు పంపే వాణిజ్య ప్రయత్నాలు కూడా ఎలన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ సంస్థ ద్వారా గతంలో అనేకం జరిగాయి. అయితే, ఈ అనేకానేక తొలి అడుగులు, అనేక పరాజయాలు ఇప్పటికి ఓ కీలక రూపం ధరించాయని అనుకోవచ్చు. అలా తాజా రోదసీ విహారాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయని భావించవచ్చు.
చంద్రుడిపై మనిషి కాలుమోపిన చారిత్రక ఘట్టానికి సరిగ్గా 52 ఏళ్ళు పూర్తయిన రోజునే ఇప్పుడు బెజోస్ బృందం రోదసీ విహారం చేశారు. పాతికేళ్ళ పైచిలుకు క్రితం ఓ చిన్న గ్యారేజ్‌లో ఇ–కామర్స్ సంస్థ ‘అమెజాన్’ ఆలోచనకు శ్రీకారం చుట్టి, ఇవాళ ప్రపంచంలోనే అత్యంత ధనికుడైన 57 ఏళ్ళ అమెరికన్ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్‌కు రోదసీ విహారం తన అయిదో ఏట నుంచి ఓ కల. అందుకోసం 2000లో ‘బ్లూ ఆరిజన్’ స్టార్టప్‌ను స్థాపించి, ఇప్పటికి తన కల నిజం చేసుకున్నారు.
దశాబ్దాల ముందు కేవలం కల అనుకున్న అనేక విషయాలు ఇప్పుడు నిజం చేసుకోవడం సాంకేతిక పురోగతికి ప్రతీకలే. అయితే, అందుకు శ్రమ, ఖర్చూ కూడా అపరిమితం. రోదసీ విహారానికి జెఫ్ బెజోస్ ఖర్చు పెట్టింది అక్షరాలా 5.5 బిలియన్ డాలర్లని ఓ లెక్క. అయితే, ఇలా ఇన్నేసి లక్షల డాలర్లను మనోవాంఛ తీర్చే విహారానికి ఖర్చు చేసే బదులు మానవాళి నివాసమైన ఈ పుడమిని కాపాడుకొనేందుకు అర్థవంతంగా ఖర్చు చేయవచ్చుగా అనే విమర్శలూ లేకపోలేదు.
ఏమైనా, కొన్ని దశాబ్దాలుగా రష్యా, అమెరికా, చైనా, భారత్ సహా అనేక దేశాల మధ్య సాగిన అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల పోటీ ఇప్పుడు ధనిక వ్యాపారవేత్తలు, సంస్థల గగనవిహారం దిశగా మళ్ళింది. దీనివల్ల అంతరిక్షమొక సరికొత్త వ్యాపార వేదికగా రూపుదాల్చనుంది. నవలోకానికి దారులు తీసింది. మరోపక్క మన దేశం కూడా అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ రంగానికి ద్వారాలు తెరిచి, ప్రైవేట్ ఉపగ్రహ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. అందుకే, అంతరిక్ష పరిశోధన, పర్యాటకం – రెండూ ఇక రెండు కళ్ళు కావడం ఖాయం. చంద్రాది అనేక గ్రహాల మీద శాశ్వత మానవ ఆవాసాల ఏర్పాటు కూడా అచిరకాలంలోనే సాధ్యం కావచ్చు. ఇవాళ్టి కోటీశ్వరుల ప్రేమలు, పెళ్ళిళ్ళు, డెస్టినేషన్ వివాహాల సంస్కృతి... భవిష్యత్తులో రోదసీలో, భారరహిత స్థితిలోకి విస్తరించినా ఆశ్చర్యం లేదు. అంటే... ఒకప్పుడు మానవాళి తలపులకే పరిమితమైన తారాతీరం ఇప్పుడిక అందనంత ఎత్తేమీ కాదు! తలుపులు తెరుచుకున్న రోదసీ నవలోకానికి బాన్ వాయేజ్!!
Comments
Please login to add a commentAdd a comment