Elon Musk Wealth Drops 15billion Dollars as tech stocks plunge: షేర్ మార్కెట్ పరిణామాలు.. ఎప్పుడు? ఎవరి తలరాతను ఎలా? మార్చేస్తాయో ఊహించడం కష్టం. ఒక్కపూటలో కాసులు కురిపించి.. అదేటైంలో రోడ్డు మీదకు లాగేస్తుంది కూడా. ఐపీవో పరిణామాలైతే మరీ ఊహించని రేంజ్‌లో ఉంటున్నాయి. అయితే అపరకుబేరుల విషయంలో ఈ పరిణామాలన్నీ పెద్దగా అనిపించకపోయినా.. వాళ్ల ర్యాంకింగ్‌లను మాత్రం పైకి కిందకి మార్చేస్తుందన్నది ఒప్పుకోవాల్సిన విషయం.
ఈ తరుణంలో లక్ష కోట్లకుపైగా పొగొట్టుకున్నా ఆ అయ్యగారు.. ఇంకా నెంబర్ వన్ పొజిషన్‌లోనే కొనసాగుతున్నారు. ఇంతకీ ఈ అయ్యగారు ఎవరో కాదు.. స్పేస్‌ఎక్స్ అధినేత, అపరకుబేరుడి జాబితాలో మొదటి స్థానంలో ఉన్న ఎలన్ మస్క్.
శుక్రవారం అమెరికా ఈ-వెహికిల్స్ తయారీదారు కంపెనీ ‘టెస్లా’ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఈ పరిణామంతో ఏకంగా 15.2 బిలియన్ డాలర్ల సంపదను నష్టపోయాడు ఎలన్ మస్క్. ఈ విలువ మన కరెన్సీలో లక్ష కోట్ల రూపాయలకు పైనే. ఇదిగాక స్పేస్‌ఎక్స్ షేర్ల పతనంతో మరో బిలియన్ డాలర్లు(ఏడున్నర వేల కోట్ల రూపాయలకుపైనే) నష్టపోయాడు. మొత్తంగా ఒక్కరోజులోనే 16.2 బిలియన్ డాలర్ల(లక్షా నలభై వేల కోట్ల రూపాయలకు పైనే) నష్టంతో.. ప్రస్తుతం ఎలన్ మస్క్ సంపద విలువ 266.8 బిలియన్లుగా ఉంది.
ఇక ఈ లిస్ట్‌లో మస్క్ మొదటి ప్లేస్‌లో ఉండగా.. రెండో ప్లేస్‌లో అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ ఉన్నాడు. 195.6 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ బ్లూ ఆరిజిన్ బాస్. ఇక అమెజాన్ షేర్లు కూడా 1.20 శాతం పడిపోవడంతో.. 2.4 బిలియన్ డాలర్లు నష్టపోయాడు బెజోస్.
జాబితాలో బ్రిటిష్ బిలియనీర్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ 187.5 బిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, బిల్‌గేట్స్ (136.4 బిలియన్ డాలర్లు) నాలుగో ప్లేస్‌లో, లారీ పేజ్ (121.5 బిలియన్ డాలర్లు) ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. ఒమిక్రాన్ ప్రభావంతో మార్కెట్లన్నీ పతనం దిశగా పయనిస్తుండగా.. ఫోర్బ్స్ టాప్ టెన్‌లో ఉన్న బిలియనీర్లంతా షేర్ల నష్టాలతో భారీగా సంపదను కోల్పోవడం విశేషం.
ఎటు చూసినా టాపే
దాదాపు ఐదేళ్ల తర్వాత టెస్లాలోని తన షేర్లను అమ్మేసుకున్నాడు ఎలన్ మస్క్. పైసా తీసుకోని జీతగాడిగా(జీరో శాలరీ) కేవలం టెస్లా షేర్లతోనే లాభాలు అందుకుంటున్న ఎలన్ మస్క్.. ఈ మధ్య 10 శాతం వాటా అమ్మేసుకుంటున్నట్లు ప్రకటించి ఆసక్తికర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి అమ్మకంతో 10.9 బిలియన్ డాలర్ల విలువైన 10.1 మిలియన్ షేర్లు అమ్మేసుకున్నాడు. ఇంకా దాదాపు ఏడు మిలియన్లు అమ్మేయాల్సి ఉంది. మరి మొత్తంగా తన వాటాగా ఉన్న 17 మిలియన్ షేర్లను వదులుకోవడం ద్వారా మస్క్ నష్టపోడా? బిలియనీర్ జాబితాలో కిందకి జారిపోడా? అనే అనుమానాలు చాలామందికే కలుగుతున్నాయి.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. షేర్ల అమ్ముకోవడం ద్వారా కట్టాల్సిన ట్యాక్స్ నుంచి భారీ మినహాయింపు పొందాడు ఎలన్ మస్క్. పైగా ఈ అమ్మకాల ద్వారా వాటిల్లిన నష్టం(1,084 డాలర్లు) నుంచి తప్పించుకుని లాభపడ్డాడు కూడా!. ఇక ఈ ఏడాది మొదట్లో ఏకంగా 384 బిలియన్ డాలర్ల సంపదతో(266.8 బిలియన్లకు చేరుకుంది ప్రస్తుతం) రిచ్చెస్ట్ మ్యాన్‌గా అవతరించాడు ఎలన్ మస్క్. మరోవైపు స్పేస్‌ఎక్స్ నుంచి సుమారు 10 బిలియన్ డాలర్ల సంపదను పోగేశాడు. ఇదీగాక ఈ మధ్యే కేవలం స్పేస్‌ఎక్స్ సంపదే వంద బిలియన్ల డాలర్లకు చేరుకుంది. తాజా నివేదికల ప్రకారం.. ప్రపంచంలో రెండో అతిపెద్ద విలువైన ప్రైవేట్ కంపెనీగా స్పేస్‌ఎక్స్ అవతరించింది.
ఇవిగాక భవిష్యత్తులో స్పేస్ టూరిజానికి ఉన్న డిమాండ్, నాసా లాంటి ఏజెన్సీలతో కాంటాక్ట్‌లు, శాటిలైట్ ఇంటర్నెట్ ‘స్టార్‌లింక్’ సేవలతో మస్క్ సంపద మరింతగా పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఎలా చూసుకున్నా అయ్యగారి నెంబర్ వన్‌స్థానానికి ఇప్పట్లో వచ్చిన నష్టమేమీ లేదని ఫోర్బ్స్ ఓ ఆసక్తికర కథనం ప్రచురించింది ఈ మధ్య.
Comments
Please login to add a commentAdd a comment