అమెరికాలోని అయోవా రాష్ట్రం అందరి భయాలనూ నిజం చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి రెండోసారి రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఆ రాష్ట్రంలోని పార్టీ ప్రతినిధులు పట్టం కట్టారు. దేశానికి ట్రంప్ బెడదను నివారించటంలో అయోవా రిపబ్లికన్లు తోడ్పడితే బాగుణ్ణని చాలామంది పెట్టుకున్న ఆశలు తలకిందయ్యాయి. ఇదే రేస్‌లోవున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అయోవాలో తగినన్ని ఓట్లు రాబట్టలేక పోటీకి స్వస్తిచెప్పారు. మెరుగ్గా ఓట్లు పడకపోతే పోటీ నుంచి తప్పుకుంటారేమోనని వివేక్ మద్దతుదారులు భయపడ్డారు. చివరకు అదే జరిగింది.
మున్ముందు ఏమవుతుందన్నది పక్కనబెడితే అయోవాలో ట్రంప్ సాధించిన విజయం అనేక విధాల కీలకమైనది. ఇదే రాష్ట్రంలోని రిపబ్లికన్లు ఎనిమిదేళ్లక్రితం అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ను పట్టించుకోలేదు. అప్పట్లో ఆయనకు కేవలం 21 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండేళ్ల క్రితం నిర్వహించిన సర్వేల్లో సైతం రిపబ్లికన్లలో అనేకులు విముఖంగానే వున్నట్టు తేలింది. కేవలం కార్మికవర్గ ఓటర్లు మాత్రమే ఆయన వైపు మొగ్గుచూపుతున్నారని, పార్టీలోని కాలేజీ గ్రాడ్యుయేట్స్‌లో అత్యధికులకు ట్రంప్ పోకడలు నచ్చటం లేదని ఆ సర్వేలు తెలిపాయి. వేరేచోట్ల ముందంజలోవున్న ట్రంప్‌ను అయోవాలో అడ్డుకోగలిగితే పార్టీ తరఫున దేశాధ్యక్షుడిగా పోటీ చేయటానికి తన అవకాశాలు మెరుగుపడతాయని డీశాంటిస్ లెక్కలేశారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి.
విధానాలకూ, నిబంధనలకూ కట్టుబడి ఉండటం ముఖ్యమా... లౌక్యంగా పోవటం మంచిదా అన్న మీమాంస చాలా పాతది. డోనాల్డ్ ట్రంప్ ఒక నీలి చిత్రాల నటి నోరునొక్కేందుకు తన న్యాయవాది ద్వారా ముడుపులు చెల్లించారన్న అభియోగం విచారణార్హమైనదేనని మన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ నిర్ధారించినప్పుడు అనేకులు లబలబలాడారు. కేసులు పెడితే సానుభూతి వెల్లువెత్తుతుందని, ఆయన బలపడతాడని హెచ్చరించారు. కానీ డెమాక్రాట్లు వినలేదు. ఇక 2020నాటి అధ్యక్ష ఎన్నికల వ్యవహారం సరేసరి. ఓటమి తప్పదని గ్రహించిన ట్రంప్ వాటిని తారుమారు చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. న్యాయస్థానాల్లో కేసులు వేశారు. చివరకు ఓట్ల లెక్కింపును అడ్డుకోవటం కోసం కేపిటల్ హిల్ భవననానికి తరలిరావాలంటూ మద్దతుదార్లను రెచ్చగొట్టారు. పర్యవసానంగా భారీయెత్తున హింస చోటుచేసుకుంది. పలువురు మరణించారు.
ఈ ఉదంతాల్లో ట్రంప్‌పై కేసులున్నాయి. అదిగాక తనకు ప్రధాన పోటీదారు కాబోతున్న డెమాక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌పై విచారణకు ఆదేశించాలని 2019లో ఉక్రెయిన్‌పై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలో ఒకసారి... ఓట్ల లెక్కింపు సమయంలో మద్దతుదార్లను హింసకు ప్రేరేపించారన్న అభియోగంలో మరోసారి ప్రతినిధుల సభ ఆయన్ను అభిశంసించింది. రెండుసార్లూ తమకు బలంవున్న సెనేట్‌లో రిపబ్లికన్లు ట్రంప్‌ను నిర్దోషిగా బయటపడేశారు. చివరకు జరిగేదేమిటో తెలిసి నప్పుడు ట్రంప్‌పై ఇదంతా అవసరమా అన్నది విశ్లేషకుల వాదన. కానీ డెమాక్రాట్లకు ఇదంతా పట్టలేదు. నిజానికి సానుభూతే అయోవాలో కొత్త ఓటర్లను ఆయనవైపు మళ్లించిందని తేలింది. తాజా ఎన్నికకు ముందు జరిగిన సర్వేల్లో ప్రత్యర్థుల కన్నా ట్రంప్ చాలా ముందున్నారు.
ట్రంప్‌పై పెట్టిన కేసులన్నీ బోగస్‌వేనని పార్టీ ఓటర్లు చెప్పడం గమనించదగ్గది. నిజానికి అయోవాపై ట్రంప్ పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. 2016లో పార్టీలో తనపై పోటీచేసిన సెనెటర్ టెడ్ క్రజ్ రిగ్గింగ్‌తో గెలిచారని అప్పట్లో ఆయన గొడవ చేశారు. ఈసారి అదే పని డీశాంటిస్ చేయ బోతున్నారని గగ్గోలు పెట్టారు. కానీ అందుకు భిన్నంగా కార్మికవర్గ ఓటర్లతోపాటు గ్రాడ్యుయేట్లు కూడా ట్రంప్‌ను బలంగా సమర్థించారని తేలింది. ఇక్కడ డీశాంటిస్‌కు గట్టి మద్దతుందని అంచనా వేసిన నిక్కీ హేలీ ఆయనకు వ్యతిరేకంగా భారీయెత్తున ఖర్చుచేశారు. పైగా డెమాక్రటిక్ ఓటర్లు కొందరు హేలీ కోసం రిపబ్లికన్ అభ్యర్థిత్వాన్ని స్వీకరించి, ఆమెకు అనుకూలంగా ఓట్లు వేశారు.
బహుశా అందుకే కావొచ్చు...డీశాంటిస్ కన్నా కాస్త మెరుగ్గా ఓట్లు సాధించి ఆమె ద్వితీయ స్థానంలో నిలిచారు. అయోవాతో మొదలైన రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి ఎంపిక ప్రక్రియ వచ్చే జూన్ 4తో ముగుస్తుంది. పార్టీలో ఎన్నడూ లేనివిధంగా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాక కూడా రిపబ్లికన్లకు ట్రంపే నాయకుడిగా కొనసాగుతున్నారు. నోటి దురుసుతనం, ప్రత్యర్థులపై తీవ్రంగా విరుచుకు పడటం లాంటివి ఆయనకు తోడ్పడుతున్నాయో... ఆ పార్టీయే అటువంటివారిని నెత్తినపెట్టుకునే స్థాయికి దిగజారిందో అనూహ్యం. ట్రంప్‌ను విమర్శిస్తే ఆయన మద్దతుదార్లు దాడి చేస్తారని పార్టీ లోని ప్రత్యర్థులే బెంబేలెత్తటం గమనించదగ్గది.
ట్రంప్ ఇటీవలి వ్యాఖ్యలు అందరినీ హడలెత్తిస్తున్నాయి. వలసదారులు దేశాన్ని విషపూరితం చేస్తున్నారని, వారిని తరిమికొట్టడమే తన ధ్యేయమని ఆ మధ్య ప్రకటించారు. తాను మళ్లీ అధికారంలోకొస్తే నియంతగా మారి వ్యతిరేకులందరినీ తుడిచిపెడతానని, అసమ్మతిని అణిచేస్తానని హెచ్చరించారు. పార్టీలో ఆయనతో పోటీపడుతున్నవారిదీ అదే బాణీ. తాను గెలిస్తే ఎఫ్‌బీఐని రద్దుచేస్తానని, ప్రభుత్వ సిబ్బందిలో 75 శాతం మందిని ఇంటికి పంపుతానని వివేక్ ఎలుగెత్తారు. ఉన్నంతలో నిక్కీ హేలీ కన్నా డీశాంటిస్ మెరుగే అయినా ట్రంప్ ముందు ఆయన నిలబడలేరని తాజా ఎన్నికల తీరు చూస్తే అర్థమవుతుంది. ఇటు డెమాక్రాట్లు సైతం 81 ఏళ్ల జో బైడెన్‌ను మించి మరెవరినీ ఎంపిక చేసుకోలేక ట్రంప్ సునాయాస విజయానికి పరోక్షంగా బాటలు పరుస్తున్నారు.
ట్రంప్ వైపే ‘అయోవా’!
Published Wed, Jan 17 2024 5:19 AM | Last Updated on Wed, Jan 17 2024 5:19 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment