ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్
అసమ్మతి గళం వినిపించిన ఆశావహులు
బాబు సొంత సామాజికవర్గ నేతలకూ తీవ్ర పరాభవం
టికెట్ కోసం యత్నించి భంగపడిన సీనియర్లు
మిత్రపక్షం బీజేపీలోనూ టికెట్ రగడ
‘పుట్టా మహేష్ ఎవరు.. మన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వ్యక్తేనా.. ఏలూరు టీడీపీ రాజకీయాల్లో ఉన్న అతనేనా.. యనమల అల్లుడని టికెట్ ఇస్తే ఆయన్నే వచ్చి పనిచేసుకుని గెలిపించుకోమనండి.. మాకేమి సంబంధం..’ ఇది ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ గురించి టీడీపీ నేతల వాట్సాప్‌ల్లో జరుగుతున్న చర్చ.
‘జిల్లాలో బీసీలే లేనట్టు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరేడు జిల్లాలు దాటి వైఎస్సార్ కడప నుంచి పుట్టా మహేష్ యాదవ్‌ను ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం ఏంటి’.. ఇదీ పుట్టా మహేష్ ఎంపికపై టీడీపీ నేతల ఆగ్రహం.
‘కడప నేతలు వద్దు.. దిగుమతి నాయకులను తీసుకువస్తే కచ్చితంగా తిప్పికొడతాం.. ఆత్మవంచన చేసుకుని పనిచేసేది లేదు.. అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటాం.’ విలేకరుల సమావేశంలో బీజేపీ నేతల హెచ్చరిక.
సాక్షి ప్రతినిధి,ఏలూరు: తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పుట్టా మహేష్ యాదవ్‌ను ప్రకటించడంపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలు తీవ్రస్థాయిలో అసమ్మతి గళం విప్పగా, మిత్రపక్షమైన బీజేపీ నేతలు కూడా ఇదేమి నమ్మకద్రోహం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటన కూటమిలో సరికొత్త చిచ్చు రగిల్చింది.
గోపాల్‌కు మొండిచేయి : ఏలూరు ఎంపీ టికెట్‌ను ఆశిస్తూ మాజీ ఎంపీ మాగంటి బాబుతో సహా చంద్రబాబు సొంత సామాజికవర్గ నేతలు ముగ్గురు బలంగా ప్రయత్నించారు. టీడీపీ ఆవిర్భావం నుంచి 2019 వరకు బాబు సామాజిక వర్గానికే ఇక్కడ ఎంపీ టికెట్ ఇస్తూ వచ్చారు. ఈసారి కూడా అలాగే ఇస్తారని సొంత నేతలు ముగ్గురు, బీసీ సామాజిక వర్గానికి ఇచ్చి ఎన్‌ఆర్‌ఐ గోరుముచ్చు గోపాల్ యాదవ్ హడావుడి చేశారు. సింగపూర్‌లో గోపాల్ యాదవ్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు. వ్యాపారాలను పక్కనపెట్టి సొంత మండలమైన కామవరపుకోట నుంచి ఏలూరు లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఏడాదిగా కార్యక్రమాలు నిర్వహించారు. అది కూడా చంద్రబాబు, లోకేష్ సూచనల మేరకు విపరీతంగా ఖర్చు చేశారు. బీసీ డిక్లరేషన్, జయహో బీసీ, చంద్రబాబు, లోకేష్ పర్యటనలు ఇలా ఏడాదిగా ఆయన్ను గట్టిగా వాడుకుని చివరికి టికెట్ విషయంలో టీడీపీ పెద్దలు మొండిచేయి చూపించారు.
కనీసం నెల రోజుల నుంచి చంద్రబాబు అపాయింట్‌మెంట్‌కు ప్రయత్నించినా ఇవ్వని పరిస్థితి. టికెట్ మీదేనంటూ యనమల రామకృష్ణుడు మభ్యపెట్టి చివరిలో హ్యాండ్ ఇచ్చి తనను రాజకీయంగా దెబ్బతీశారంటూ గోపాల్ యాదవ్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. ఈనెల 25న కామవరపుకోటలో దగాపడ్డ బీసీ సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. ఇక జిల్లాలోని బడా రాజకీయ కుటుంబమైన మాగంటి బాబుకూ భంగపాటు తప్పలేదు. పార్టీలో ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉంటూ పనిచేస్తున్నా కనీసం సమాచారం కూడా చెప్పని పరిస్థితి. ఇక అపాయింట్‌మెంట్ సంగతి సరేసరి.
జిల్లాతో ఎలాంటి సంబంధం లేకుండా..
ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడు, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మ హేష్‌ను ప్రకటించారు. జిల్లాకు ఎటువంటి సంబంధం గాని, పరిచయం గాని, గత ఐదేళ్లలో ఒక్కసారైనా జిల్లాకు గాని వచ్చిన లేదా జిల్లా టీడీపీ కా ర్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు మహేష్‌కు లేవు. కనీసం ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం హద్దు లు తెలియని టీడీపీ నేత కుమారుడికి టికెట్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలపర్వం ప్రారంభమైంది.
బీజేపీ నేతల అల్టిమేటం
కడప నేతలు వద్దు.. స్థానిక బీజేపీ నేతలకే టికెట్ ఇవ్వాలని బీజేపీ జిల్లా నేతలు అల్టిమేటం ఇచ్చారు. పొత్తుల్లో టికెట్ వస్తుందని ఆశించిన బీజేపీ నేత తపన చౌదరికే టికెట్ ఇవ్వాలని, దిగుమతి నేతలను తీసుకువస్తే కచ్చితంగా తిప్పికొడతామని ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించడంపై బీజేపీ పార్లమెంట్, నియోజకవర్గాల కన్వీనర్లు విలేకరుల సమావేశం నిర్వహించి హెచ్చరించారు. ఆత్మవంచన చేసుకుని టీడీపీకి పనిచేసేది లేదని, అధిష్టానంతో తాడోపేడో తేల్చకుంటామంటూ కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment