ఉద్యాన వర్సిటీ శాస్త్రవేత్తలకు అవార్డులు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను అవార్డులు వరించాయి. గత నెలలో బెంగళూరులో ఐసీఏఆర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చర్ రీసెర్చ్ సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు హాజరైన శాస్త్రవేత్తలు పలు అంశాలపై ప్రజెంటేషన్‌లు, పరిశోధన విషయాలు వివరించారు. ఉత్తమ జీవ సంబంధమైన నియంత్రణ పరిశోధనకు అంబాజీపేట ఉద్యాన పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ఎస్‌బీవీ చలపతిరావుకు ఎస్.సీతానంతం అవార్డు వచ్చింది. ఉద్యాన పంటల్లో తెగుళ్ల నియంత్రణకు కృషి చేసినందుకు వెంకట్రామన్నగూడెం పరిశోధన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టి.నాగలక్ష్మికి ఫెలోషిప్ లభించింది. అవార్డులు సాధించిన శాస్త్రవేత్తలకు వీసీ కార్యాలయంలో ఉపకులపతి గోపాల్, రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు అభినందనలు తెలిపారు.
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
ఏలూరు (టూటౌన్): ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ నేపథ్యంలో ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం జిల్లా జైలు సందర్శించారు. జైలులో సౌకర్యాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడుతూ సత్ప్రవర్తనతో మేలగాలని సూచించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ సీహెచ్‌ఆర్‌వీ స్వామి, ఏఆర్ డీఎస్పీ శ్రీహరి, జైలర్లు కే వెంకటరెడ్డి, కే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గోపిమూర్తికి ఏపీటీఎఫ్ మద్దతు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన బొర్రా గోపి మూర్తికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు ఏపీటీఎఫ్ 1938 ఉపాధ్యాయ సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు పీడీఎఫ్ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేసిన గోపిమూర్తిని కలిసి పుష్పగ్ఛుం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ గుగ్గులోతు కృష్ణ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రత్నంబాబు, మోహన్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాడే గోపిమూర్తిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు.
ఖాతా నుంచి రూ.46.30 లక్షలు గల్లంతు
ఏలూరు టౌన్: ఏలూరుకు చెందిన కె.శేషగిరి ప్రసాద్ ఖాతాకు గుర్తు తెలియని ఖాతా నుంచి పొరపాటున రూ.20 వేలు వచ్చాయి. ఆ నగదును పంపాలని ఆ గుర్తుతెలియని వ్యక్తి అడగడంతో అతని ఖాతాకు రూ. 20 వేలు పంపగానే శేషగిరి ప్రసాద్ అకౌంట్‌లోంచి రూ.46.30 లక్షలు మాయమయ్యాయి. దీంతో బాధితుడు ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అశోక్‌నగర్‌కు చెందిన శేషగిరి ప్రసాద్ ఖాతాకు ఈనెల 8న రూ.20 వేలు వచ్చాయి. పొరపాటున వచ్చాయని తిరిగి వాటిని తన ఖాతాకు వేయాలని ఆ గుర్తు తెలియని వ్యక్తి ప్రాధేయపడ్డాడు. అతని మాటలు నమ్మిన శేషగిరి ప్రసాద్ తిరిగి ఆన్‌లైన్‌లో ఆ మొత్తాన్ని పంపాడు. ఈ నెల 10న తన ఖాతాను పరిశీలించుకోగా రూ.46.30 లక్షలు సైబర్ నేరగాళ్లు అపహరించినట్లు గుర్తించారు. దీంతో ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూటౌన్ సీఐ వైవి రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సమావేశం వాయిదా
ఏలూరు(మెట్రో): ఈ నెల 13వ తేదీ నిర్వహించాల్సిన జిల్లా నీటి పారుదల సలహా మండలి సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్లు ఇరిగేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ సిహెచ్. దేవప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment