
జరిమానాల మోత.. తస్మాత్ జాగ్రత్త
తణుకు అర్బన్: పిల్లాడు బండి నడిపేస్తున్నాడంటూ సంబర పడి మైనర్లకు బండి ఇస్తున్నారా.. కేరింతలు కొడుతూ ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారా.. హెల్మెట్ లేకుండానే బండి నడుపుతున్నారా.. రహదారుల్లో ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేసేస్తున్నారా.. ఇన్సూరెన్స్ అవసరం లేదనుకుంటున్నారా అయితే ఇక మీకు జరిమానాల మోతమోగిపోతాది తస్మాత్ జాగ్రత్త. మార్చినెల 1 తేదీ నుంచి వచ్చిన నూతన వాహనాల చట్టం ప్రకారం నిబంధనలు మీరే వారికి జరిమానాలతో షాకిచ్చేందుకు పోలీసు, రవాణా శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మోటారు వాహనదారులు నిబంధనలు ఉల్లంఘిస్తే వారికి వేసే జరిమానాలు హడలెత్తిస్తున్నాయి. ఈనెల 1వ తేదీ నుంచి వాహనదారులు నిబంధనలు పాటించకపోతే వేసే జరిమానాల తాలూకా ఫ్లెక్సీలను పట్టణ ప్రధాన రహదారులు, కూడళ్లలో పోలీసులు ఏర్పాటుచేశారు. దీంతో నిబంధనలు పాటించని వారితోపాటు డ్రైవింగ్ లైసెన్స్‌లు లేనివారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంతేకాకుండా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో సైతం కొత్త జరిమానాలు వైరల్‌గా మారాయి. లైసెన్స్‌లు లేకుండా బండెక్కితే జరిమానాల మోత మోగనుందనే విధంగా నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
న్యాయస్థానం ఉత్తర్వుల ప్రకారం
మార్చి 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం నూతన మోటారు వాహన చట్ట నిబంధనలను అనుసరించి వాహన చట్ట ఉల్లంఘనపై పెంచిన జరిమానాలు ఎం.పరివాహన యాప్‌లో పొందుపరిచారు. అలాగే నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలివిగో అనే ఫ్లెక్సీలు తణుకులో గత రెండు రోజులుగా ప్రధాన కూడళ్లలో ప్రత్యక్షం కావడంతో వాహనదారులు ఆగి పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, రవాణా శాఖ అధికారులతో వాగ్వివాదానికి దిగినా, సమాచారం ఇచ్చేందుకు నిరాకరించినా చట్టపరమైన చర్యలు కూడా తీసుకొనబడతాయంటూ ఫ్లెక్సీల్లో పొందుపరిచారు.
వేగానికి కళ్లెం పడనుందా..?
ప్రస్తుతం తణుకు పట్టణంలో వాహనాల వేగానికి అద్దూ అదుపు లేకుండా పోయిందని, ముఖ్యంగా వాహనాల వేగాన్ని నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. సైలెన్సర్‌లు తీసేసి నడుపుతున్న యువత, బైక్‌లపై స్టంట్‌లు చేస్తూ భయాన్ని ఉసిగొల్పుతున్న ఆకతాయిలపై తప్పనిసరిగా ఈ తరహా జరిమానాలు వేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చిన నూతన నిబంధనలు
వాహనదారులు జాగ్రత్త పడాలని హెచ్చరిక
ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పోలీసులు
పోలీసు అధికారులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లోని అంశాలు..
ఉల్లంఘనలు జరిమానాలు
హెల్మెట్ లేకపోతే రూ.వెయ్యి
వెనుక కూర్చున్న వ్యక్తికి
హెల్మెట్ లేకుంటే రూ.వెయ్యి
డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే రూ.10వేలు.
వాహనానికి బీమా లేకపోతే
(మొదటిసారి) రూ.వెయ్యి
రెండోసారి పట్టుబడితే రూ. 2వేలు
శబ్దం – పొగ కాలుష్యానికి
పాల్పడితే రూ. 2వేలు
డేంజరస్ పార్కింగ్ రూ. 1500 నుంచి రూ.3వేలు
రేసింగ్ (ఓవర్‌స్పీడ్) రూ.5 వేలు
డేంజరస్ డ్రైవింగ్ రూ.10 వేలు
మైనర్ డ్రైవింగ్ రూ.వెయ్యి
ప్రయాణికులను రవాణా
వాహనాల్లో ఎక్కిస్తే ఒక్కరికి రూ.200
ప్రమాదాల నివారణకే నూతన చట్టం
రోడ్డు ప్రమాదాల నివారణ, శబ్ధ కాలుష్యం తదితర ఇబ్బందులను పరిష్కరించే ఉద్దేశ్యంతో ఏపీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మోటారు వాహనాల చట్టం నూతన జరిమానాలు ఈనెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఇకపై తప్పనిసరిగా వాహనదారులు హెల్మెట్ పెట్టుకుని, డ్రైవింగ్ లైసెన్స్‌తోపాటు వాహనానికి తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి. జాతీయ రహదారులతోపాటు పట్టణం, గ్రామాల్లో వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాలు చేయాలి. – ఎన్.కొండయ్య, తణుకు పట్టణ సీఐ

జరిమానాల మోత.. తస్మాత్ జాగ్రత్త
Comments
Please login to add a commentAdd a comment