భీమవరం (ప్రకాశంచౌక్): ఈనెల 8న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని న్యాయమూర్తులు పోలీసులకు సూచించారు. 3వ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ డాక్టర్ బి.లక్ష్మీనారాయణ అధ్యక్షతన పోక్సో కోర్టు హాల్‌లో సోమవారం పోలీసు అధికారులతో న్యాయమూర్తులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. క్రిమినల్ కేసుల రాజీకి కక్షిదారులకు అవగాహన కల్పించాల్సిందిగా కోరారు. రాజీ చేసేందుకు ఏవిధమైన చట్టపరమైన సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కేసుల రాజీకి వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ జి.సురేష్ బాబు, 2వ అదనపు జ్యుడీషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ డి.ధనరాజు, డీఎస్పీ ఆర్‌జీ జయ సూర్య సర్కిల్, సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి
దెందులూరు: చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది. ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాల ప్రకారం గాలాయగూడెంకు చెందిన ఉప్పాటి గాయత్రి పదో తరగతి చదువుతోంది. గత నెల 27న కుటుంబ సభ్యులు మందలించడంతో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఏలూరు జీజీహెచ్‌కు తరలించగా అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ఆసుపత్రికి తరలించారు. ఈనెల 2న రాత్రి 10 గంటలకు విజయవాడ వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
‘జైన్’ ఒప్పందం విద్యార్థులకు ఉపయోగకరం
తాడేపల్లిగూడెం (టీఓసీ): మహారాష్ట్రకు చెందిన జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ అనే గ్లోబల్ కంపెనీతో సోమవారం డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో జైన్ ఇరిగేషన్ సిస్టం నిర్వహిస్తున్న అత్యాధునిక టిష్యూ కల్చర్ ల్యాబ్ సదుపాయాలను, వారి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సెంటర్స్‌ను తమ విద్యార్థులు పరిశోధనల కోసం వినియోగించుకోవడానికి వీలు కలుగుతుందని ఉప కులపతి డాక్టర్ కె.గోపాల్ అన్నారు. రాష్ట్రంలో కోకో పంట అభివృద్ధికి, మార్కెటింగ్ సహకారానికి ఈ అవగాహన ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, జైన్ ఇరిగేషన్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment