చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట
భీమడోలు: ప్రజా సంక్షేమం, అభివృద్ధిని మరిచి సీఎం చంద్రబాబు వైఎస్సార్ సీపీ శ్రేణులే లక్ష్యంగా కక్ష సాధింపు చర్యలకు, కుట్రపూరిత రాజకీయాలకు పెద్ద పీఠ వేయడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ అధ్యక్షుడు నౌడు వెంకట రమణ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ శ్రేణులను పాములతో పోల్చడం బాబు నీతిమాలిన రాజకీయాలకు పరాకాష్ట అని, ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నిర్వహించిన టీడీపీ ప్రజావేదికలో వైఎస్సార్ సీపీ శ్రేణులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను పనులు చేయవద్దని, వారికి పనులు చేస్తే పాములకు పాలు పోసినట్లేనని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 40 శాతం ఓటర్లను పాములుగా పోల్చడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో కుల, మత, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఆయన్ను చూసైనా బుద్ది మార్చుకోవాలని నౌడు హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment