రైతు వ్యతిరేక విధానాలపై ఆగ్రహం
ఏలూరు (టూటౌన్): మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్త పిలుపు మేరకు రైతులకు ఇచ్చిన హామీలను తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల జిల్లా సమన్వయ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని, పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతు వ్యతిరేక విధానాలు విడనాడాలంటూ నినాదాలు చేశారు. రైతు సంఘం సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, రైతు కూలీ సంఘం సహాయ కార్యదర్శి షేక్ బాషా, బీకేఎంయు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. జిల్లాలో మిర్చి, పత్తి, కోకో, మినుములు, పెసలు వంటి పంటలకు ధరలు పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఇంకా ప్రారంభించలేదని, సాగునీటి ప్రాజెక్టులు, పంట కాలువలు, డ్రైన్ల నిర్వహణ ప్రైవేట్ సంస్థలకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారికి వినతి పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment