నూజివీడు: ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 7 వందల గ్రాముల బంగారు ఆభరణాలను, ఒక మోటార్ సైకిల్‌ను, కారును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ పీ సత్యశ్రీనివాస్ బుధవారం తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దొంగతనాలను నివారించాలనే లక్ష్యంతో ప్రత్యేక బృందాలతో నిఘా ఏర్పాటు చేసి అనుమానితుల కదలికలను పరిశీలిస్తుండగా విశాఖపట్టణంకు చెందిన శీలా అనిల్‌కుమార్, పెల్లి శ్రీనివాసరెడ్డి, మచిలీపట్నంకు చెందిన వేల్చూరి అనిల్‌కుమార్‌లను అదుపులోకి తీసుకొని విచారించగా వారు చేసిన పలు దొంగతనాల వివరాలు వెల్లడయ్యాయన్నారు. వీరు రాత్రి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లకు వెళ్లి తాళాలను పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దొంగిలిస్తారన్నారు. వీటిని విక్రయించడం, తాకట్టు పెట్టడం, కరిగించి అమ్మడం చేస్తూ ఉంటారు. వీరిపై నూజివీడు, రాజమండ్రి టూ టౌన్, తెనాలి 3 టౌన్, నెల్లూరు జిల్లా దర్గమిట్ట, అనపర్తి, సర్పవరం, ఏలూరు 2 టౌన్, శ్రీకాకుళం జిల్లా సంతకవిటి, చల్లపల్లి, భీమవరం 2 టౌన్, ఏలూరు 3 టౌన్, కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్‌లలో చోరీ కేసులున్నాయన్నారు. వీరి వద్ద నుంచి పలు కేసులకు సంబంధించిన 7 వందల గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశామన్నారు. చోరీ కేసుల్లో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన నూజివీడు టౌన్, ఏలూరు 3 టౌన్, ఏలూరు సీసీఎస్ సీఐలు పీ సత్యశ్రీనివాస్, వీ కోటేశ్వరరావు, రాజశేఖర్, నూజివీడు టౌన్ పోలీస్‌స్టేషన్ ఎస్సై జీ జ్యోతీబసు, ఏఎస్సై పీ సురేష్, హెచ్‌సీ బాలరమేష్, కానిస్టేబుళ్లు సీహెచ్ రామకృష్ణ, ఎస్ రాధాకృష్ణ, ఏలూరు 3 టౌన్ హెచ్‌సీ ఓం ప్రకాష్‌లను ఎస్పీ అభినందించడంతో పాటు రివార్డులు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment