ముందుకు లాక్కొచ్చిన మృత్యువు
భీమడోలు: అప్పటి వరకు ప్రైవేటు బస్సులో వెనుక సీటులో కూర్చొన్న వ్యక్తి స్వగ్రామం దగ్గర పడుతుండడంతో ముందు సీటు ఖాళీ అవ్వగా అక్కడకు వచ్చి కూర్చున్నాడు. అంతలోనే హైటెక్ బస్సుకు జరిగిన ప్రమాదంలో అతడిని మృత్యువు కబళించింది. చోదిమెళ్ల వద్ద గురువారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని హైటెక్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో భీమడోలు గ్రామానికి చెందిన బొంతు భీమేశ్వరరావు(43) మృతి చెందాడు. జీవనోపాధి నిమిత్తం రెండు నెలల క్రితం భీమేశ్వరరావు హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ పెయింటింగ్ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆతని భార్య, ఇద్దరు పిల్లలు భీమడోలులో నివాసముంటుంన్నారు. ఈ క్రమంలో ఈనెల 8, 9వ తేదీల్లో 12 ఏళ్ల కొకసారి వచ్చే భీమడోలు జాతర వేడుకల్లో పాల్గొనేందుకు భీమేశ్వరరావు బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళ్లే ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. తెల్లవారితే తన కుటుంబ సభ్యులను కలుసుకుని సంతోషంతో గడపాలని భావించాడు. ట్రావెల్ బస్సులో అప్పటి వరకు వెనుక సీటులో కూర్చున్న భీమేశ్వరరావు హనుమాన్ జంక్షన్ వద్ద ముందు సీటు ఖాళీ అవ్వడంతో వెనుక ఉన్న ఆతను ముందు సీటులో కూర్చున్నాడు. చోదిమెళ్ల వద్దకు వచ్చేసరికి బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో భీమేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు మృతి చెందగా బస్సులోని 21 మంది గాయాలపాలయ్యారు. భీమేశ్వరరావు మృతితో భీమడోలులో విషాదఛాయలు అలుముకున్నాయి.
చోదిమెళ్ల వద్ద హైటెక్ బస్సుకు జరిగిన ప్రమాదంలో వ్యక్తి మృతి
భీమడోలులో విషాదఛాయలు
Comments
Please login to add a commentAdd a comment