జాతీయ లోక్‌అదాలత్‌కు విస్తృత ఏర్పాట్లు
ఏలూరు (టూటౌన్): ఈనెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్‌కు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (ఎఫ్‌ఏసీ), ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.సునీల్ కుమార్ చెప్పారు. స్థానిక జిల్లా కోర్టు నందు గురువారం విలేకరులతో వారు మాట్లాడుతూ జాతీయ లోక్‌అదాలత్ నిర్వహణ కోసం జిల్లా కోర్ట్‌లో 6 బెంచ్‌లు ఏర్పాటు చేయగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్ట్‌లలో కలిసి 26 బెంచ్‌లు ఏర్పాటుచేసి కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామన్నారు. జాతీయ లోక్‌అదాలత్‌లో పరిశీలన కోసం 4,453 కేసులను గుర్తించగా వీటిలో 1,815 క్రిమినల్, 2,341 సివిల్ కేసులు, 297 ఎంవీఓపీ కేసులు ఉన్నాయన్నారు. వీటిలో 3,875 కేసులకు సంబంధించి నోటీస్‌లు కూడా జారీ చేశామన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో 2,500 కేసుల పరిష్కారాన్ని లక్ష్యంగా నిర్ణయించామన్నారు. వివిధ కారణాల వాళ్ల కోర్టుకు రాలేనివారి కోసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కక్షిదారుల నుంచి వివరాలు తీసుకుని, రాజీకి వారు సిద్ధపడితే కేసుల పరిష్కారం చేస్తామన్నారు. లోక్ అదాలత్‌లలో కేసుల పరిష్కార విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ శాఖల సిబ్బందితో 69 సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ మాట్లాడుతూ రాజీ కాదగిన కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకుని సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలన్నారు. జిల్లా కోర్ట్ ఆవరణలోని జిల్లా న్యాయ సేవాసదన్‌లో శాశ్వత లోక్ అదాలత్ ఏర్పాటు చేశామని, కోర్టుల పనిదినాల్లో కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment