తాడేపల్లిగూడెం: ఏడేళ్ల వయసులోనే తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన కళారూపంలో ఆమె ఖ్యాతి గడించారు. రాష్ట్రవ్యాప్తంగా వందలాది ప్రదర్శనలతో ప్రశంసలు అందుకుంటున్నారు తాడేపల్లిగూడేనికి చెందిన బుర్రకథ కళాకారిణి యడవల్లి శ్రీదేవి. బుర్రకథ కళాకారుడు పద్మశ్రీ మిరియాల అప్పారావు కళావారసురాలిగా చిరుప్రాయంలోనే బుర్రకథ ప్రదర్శనలు ఇచ్చారు. ఆరోహణ, అవరోహణ రాగాలను అవలీలగా ఆకళింపు చేసుకుని బుర్రకథను రక్తికట్టించడంలో ప్రేక్షకుల మన్ననలు పొందారు. 1992లో ఆకాశవాణిలో తొలిసారిగా బాలవిహార్ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు కథను చెప్పారు. అప్పటినుంచి ఆమె ప్రస్తానం అప్రతిహతంగా సాగుతోంది. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతగా నిలిచారు. ఉగాది పురస్కారం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారి మహిళా సాధికారత అవార్డు, రాష్ట్రస్థాయిలో ఉత్తమ కళాకారిణి అవార్డులు అందుకున్నారు. 2023లో హుబ్లీలో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన యూత్ ఫెస్టివల్‌లో తన ప్రదర్శనతో మెప్పించి పురస్కారం అందుకున్నారు. రాష్ట్రంతో పాటు మలేషియా, కువైట్, సింగపూర్, దుబాయ్ దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి భళా అనిపించుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భగా శ్రీశ్రీ కళావేదిక తరపున నారీరత్న అవార్డును అందుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment