
వీహెచ్‌పీ ఆధ్వర్యంలో నిరసన
ఏలూరు (టూటౌన్): రాయచోటిలో ఈ నెల 4వ తేదీన వీరభద్ర స్వామి ఉత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహిస్తున్న హిందువులపై దాడి చేసిన వారికి పోలీసులు వత్తాసు పలుకుతూ అక్రమ కేసులు పెట్టారని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద సోమవారం పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. హిందూ సంఘాల ప్రతినిధులు, వీహెచ్‌పీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. హిందువులపై దాడి చేసిన వారిని వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. వీహెచ్‌పీ ఆంధ్రా, తెలంగాణ ప్రాంత కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ మాట్లాడుతూ పోలీసులు ఒక వర్గం వారికి అనుకూలంగా పక్షపాత ధోరణితో వ్యవహరించడం తగదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిర్మల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment