ఇట్టే వస్తే రానీ వెంటా,నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా,డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గనీ అందాల దునియానే సూపిత్త పా చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కనీ.. పాడుతూ, డ్యాన్స్ చేస్తూ, బైక్ ఎక్కే రోజుల నుంచి గేర్ల్‌మీద గేర్లు మార్చుకుంటూ రయ్యన దూసుకెళ్తున్నారు నేటి తరం అమ్మాయిలు.
సెల్ఫ్‌తో బండిని స్టార్ట్‌చేసి సూదూర ప్రాంతాలకు సోలోగా రైడ్ చేస్తూ దునియాని చుట్టేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో రైడింగ్ చేస్తుంటే... మరింత ప్రత్యేకంగా హిజాబ్ ధరించి జాతీయ రహదారులే కాదండోయే దేశాలు దాటి మక్కా దాక బుల్లెట్ మీదే వెళ్తానంటోంది ముఫ్పై ఏళ్ల నూర్ బీ.
చెన్నైలోని పల్లవరానికి చెందిన అమ్మాయి నూర్‌బీ. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి. ఇది చేయకు! అది చేయకు! అలా ఉండకు! ఇలా ఉండాలి! అంటూ ఎన్నో నిబంధనలు. అడుగు తీసి అడుగు వేయాలంటే ఆలోచించాలి. అయినా నూర్ బీకి మాత్రం బైక్ నడపడం అంటే ఎంతో ఇష్టం. ఆ ఇంట్లో అమ్మాయిలు బైక్‌లు అస్సలు నడపకూడదు. అయినా తన ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు.
కాలేజీలో ఉండగానే మోటర్ సైకిల్ కొనుక్కోవాలనుకునేది. చదువు పూర్తయ్యాక బెంగళూరులోని ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్ ఉద్యోగం వచ్చింది. నెలనెలా వచ్చే జీతంలో కొంత మొత్తాన్ని బండి కొనుక్కోవడానికి దాచుకునేది. ఇలా జమ చేసిన డబ్బులతో 2021లో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోడల్‌ను కొనుక్కుంది. బండి కొన్న వెంటనే ఉద్యోగం మానేసి రైడింగ్ షురూ చేసింది.
ఫస్ట్ రైడ్...
ఎన్నాళ్లుగానో వేచిచూస్తోన్న క్షణాలు వచ్చేశాయి. వెంటనే రైడింగ్‌కు ప్రణాళిక రూపొందించుకుంది నూర్. 2021 నవంబర్ 14 తొలి రైడింగ్ గేర్‌ను స్టార్ట్ చేసింది. ఈ రైడ్ గురించి కుటుంబ సభ్యులకు చెప్పలేదు. బెంగళూరు నుంచి మహారాష్ట్ర, డామన్ డయ్యూ, గుజరాత్, రాజస్థాన్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా ఉంచినప్పటికీ మహారాష్ట్రలోని లోనావాలకు చేరుకునేటప్పటికి విషయం ఇంట్లో వాళ్లకు తెలిసింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు నూర్. ఐదున్నర అడుగుల ఎత్తున్న నూర్.. హిజాబ్ ధరించి బుల్లెట్ బండి మీద డుగ్గు డుగ్గు అని వెళ్తుంటే ఆమెను అంతా ఆసక్తిగా చూసేవారు. ఆ చూపులు నూర్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చేవి.
ఈసడింపులు, యాక్సిడెంట్ ఎదురైనప్పటికీ...
ప్రపంచం రోజురోజుకీ అప్‌డేట్ అవుతున్నప్పటికీ కొంతమంది ఇంకా ‘అమ్మాయి ఏంటీ ఇలా చేస్తోంది? ఇదేం విడ్డూరం?’ అని నోరు వెళ్లబెట్టిన వాళ్ల ఈసడింపులు నూర్‌కూ ఎదురయ్యాయి. అయినప్పటికీ రోడ్డు మీద గేర్‌లు మారుస్తూపోతూనే ఉంది. తన రైడ్‌ను ఎక్కడా ఆపలేదు. ఇదే దూకుడుతో... ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ప్రయాణిస్తూ నేపాల్‌కు వెళ్లాలనుకుంది.
బిహార్ సరిహద్దులోకి రాగానే చిన్న యాక్సిడెంట్ జరిగి రైడింగ్‌ను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. అప్పుడు తన మోటర్ సైకిల్‌ను ట్రైన్‌లో చెన్నై పంపించాల్సిన పరిస్థితి. చాలా బాధ వేసింది. అయినా తప్పలేదు. 2022 మేలో యాక్సిడెంట్ అయితే జూలైలో కోలుకుని బెంగళూరు వచ్చేసింది. ఇంక బండిని అమ్మేయమని అంతా చెప్పారు. అయినప్పటికీ నూర్ రైడింగ్ అపలేదు. జాతీయ రహదారులేగాక అంతర్జాతీయ రహదారులపై రైడింగ్ చేస్తానూ అంటోంది. వచ్చే సంవత్సరం బెంగళూరు నుంచి మక్కా, సౌదీ అరేబియా కూడా వెళ్తానని చెబుతోంది.
మనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకోవాలి...
‘‘నేను నోమాడ్ హిజాబీ రైడర్‌ని. దక్షిణ భారత దేశం నుంచి తొలి సోలోరైడర్‌ని నేనే అవుతాను. ఉత్తర భారతదేశంలోని గురుద్వారాలు, గుళ్లు, ఆశ్రమవాసులు నా మతం వేరైనప్పటికీ ప్రేమగా భోజన, వసతి సదుపాయాలను కల్పించేవారు. కొన్ని సేఫ్టీరూల్స్ పాటిస్తే తక్కువ బడ్జెట్‌లో ట్రిప్స్‌ను విజయవంతంగా పూర్తిచేయవచ్చు. సాయంత్రం ఐదు తరువాత ఎటువంటి రైడింగ్ చేయను. తెలియని వ్యక్తులతో అస్సలు మాట్లాడను.పెట్రోల్ బంకులు, ప్రార్థనా స్థలాలు, ఆశ్రమాల్లో రాత్రుళ్లు బస చేస్తూ, ఉదయం రైడింగ్ చేస్తున్నాను. ఈ స్పీడుతో మక్కాను చేరుకుంటాను ’’అని నూర్‌బీ ధీమా వ్యక్తం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment