
‘నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరి పోతే
నిబిడాశ్చర్యంతో వీరు’ అన్న మహాకవి పలుకులలో ‘నిబిడాశ్చర్యం’ స్థానంలో
‘మహా ఆనందం’ చేర్చితే సరిగ్గా వీరే. చిన్న వయసులోనే పెద్ద ఘనతలో
వాటా పంచుకున్న యువకులు. భవిష్యత్ ఆశాదీపాలు...
‘ఆరంభం అదిరిపోయింది’ అనే మాటను ఇప్పుడు బ్రహ్మాండంగా వాడవచ్చు. మొన్న మన ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఆర్‌ఐశాట్–1, ఐఎన్‌ఎస్–2టిడి, ఇన్‌స్పైర్‌శాట్–1 అనే మూడు ఉపగ్రహలను వాహకనౌక ‘పీఎస్‌ఎల్‌వి’ ద్వారా విజయవంతంగా రాకెట్‌కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
మొదటి ఉపగ్రహనికి ఐఎన్‌ఎస్–2టిడి, ఇన్‌స్పైర్‌శాట్–1లను కో–ప్యాసింజర్లుగా అభివర్ణిస్తున్నారు. ఈ సహప్రయాణికులలో మనం కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇన్‌స్పైర్‌శాట్–1 శాటిలైట్ గురించి! దీన్ని యూత్‌ఫుల్ శాటిలైట్ అని పిలుచుకోవచ్చు. ఎందుకంటే ఈ ఉపగ్రహ రూపకల్పనలో స్టూడెంట్స్ కీలకపాత్ర పోషించారు. మన దేశంతో సహా కెనడా నుంచి సింగపూర్ వరకు పలు యూనివర్శిటీల స్టూడెంట్స్ ఇందులో పాలుపంచుకున్నారు.
చిన్నప్పటి భౌగోళికశాస్త్ర పాఠాల్లో ‘అయానోస్పియర్’ గురించి చదువుకున్నాం కదా! ఒక్కసారి ఆ జ్ఞాపకాల్లోకి అలా వెళితే... ‘అయానోస్పియర్... భూమి ఎగువ వాతావరణంలోని అయోనైజ్డ్ భాగం’
‘అయానోస్పియర్‌లో ఆకస్మిక మార్పులు వైర్‌లెస్ కమ్యూనికేషన్‌కు అవరోధాలు కలిగిస్తాయి’
తాజా విషయానికి వస్తే అట్టి ‘అయానోస్పియర్’ గురించి అధ్యయనం చేయడానికి రూపొందించిందే ఇన్‌స్పైర్‌శాట్–1. దీని బరువు 8.1 కిలోలు. తక్కువ భూకక్ష్యలో ఉండే దీని జీవితకాలం ఏడాది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐఐఎస్‌టీ), తిరువనంతపురం విద్యార్థులు అమన్ నవీన్, ధృవ అనంత్ దత్తా, దేవాషిష్ భల్లా, ఆరోషిష్ ప్రియదర్శన్... ప్రొఫెసర్ ప్రియదర్శన్ హరి ఆధ్వర్యంలో ‘ఇన్‌స్పైర్’ ప్రాజెక్ట్ కోసం పనిచేశారు. ఇందులో అమన్ నవీన్ (సికింద్రాబాద్), ధృవ అనంతదత్తా (విజయవాడ) మన తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లు.
‘చిన్న వయసులోనే ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది’ అంటున్నాడు నవీన్.
పిల్లల కష్టం పెద్దలకు ముచ్చటవేస్తుంది. నిండు మనసుతో ఆశీర్వదిస్తారు. ‘మా విద్యార్థులు చాలా కష్టపడి పనిచేశారు. వారిలో మంచి సృజనాత్మకశక్తి ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం వారికి లభించింది’ అంటున్నారు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ ఆఫ్ ది మిషన్ ప్రియదర్శన్ హరి.
ఎన్నో పరీక్షలలో విజయవంతమై నింగిలోకి దూసుకెళ్లిన ‘ఇన్‌స్పైర్‌శాట్–1’... టెంపరేచర్, కంపోజిషన్, సాంద్రత, గమనవేగం... ఇలా అయానోస్పియర్ డైనమిక్స్‌ను మరింతగా అర్థం చేసుకోవడానికి ఉపకరించనుంది. ఈ ప్రాజెక్ట్ కోసం భిన్నమైన వాతావరణం, సంస్కృతుల నుంచి వచ్చిన విద్యార్థులు కలిసి పనిచేశారు. ‘క్రాస్–కల్చరల్ ఎక్స్‌పీరియన్స్’ ను చవిచూశారు. పని ఒత్తిడిలో వారు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి ఉండవచ్చు. అయితే ఆటల ద్వారా, ప్రాంతీయవంటకాల రుచులను ఒకరికొకరు పంచుకోవడం ద్వారా ఉల్లాసవంతమైన శక్తితో ముందుకునడిచారు.
‘ఇన్‌స్పైర్‌శాట్–1’ శాటిలైట్ నిర్మాణంలో యువత శక్తిసామర్థ్యాలకు గట్టి సాక్ష్యం. ఆ యువబృందానికి మరిన్ని విజయాలు చేకూరాలని ఆశిద్దాం.