అర్నవ్ కిశోర్‌కు ఆటలు అంటే ప్రాణం. స్పోర్ట్స్‌మెన్, ఫిట్‌నెస్ ప్రేమికులకు ఉపయోగపడే గాడ్జెట్‌లను సృష్టించాలనేది తన భవిష్యత్ లక్ష్యంగా ఉండేది. వేరబుల్ టెక్ కంపెనీ ‘ఫైర్–బోల్ట్’తో తన కలను నిజం చేసుకున్నాడు కిశోర్. స్మార్ట్ వేరబుల్ మార్కెట్‌ను తగిన అధ్యయనం చేసిన తరువాత మార్కెట్ వ్యూహాలు రచించుకున్నాడు. అప్పటికే చైనాలోని దిగ్గజ టెక్ కంపెనీలు మన మార్కెట్‌లోకి వచ్చాయి. వాటితో పోటీ పడడం అంత సులభం ఏమీ కాదు. మంచి టైమ్ రావాలంటే ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో ఓపిగ్గా ఎదురుచూడాలి. అర్నవ్ కిశోర్ అదే చేశాడు. సరిౖయెన సమయం చూసి మార్కెట్‌లోకి దిగి విజయం సాధించాడు.
తొలి సంవత్సరం....‘మన టైమ్ వచ్చేసింది’ అనుకున్నాడు. రెండో సంవత్సరం....‘ఈ ఫైర్ ఇలాగే కొనసాగాలి’ అనుకున్నాడు. గత సంవత్సరం ఫైర్–బోల్ట్ నాయిస్ మన దేశంలోనే అతి పెద్ద స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌గా అవతరించింది. ఆన్‌లైన్‌లోనే కాదు ఆఫ్‌లైన్ లోనూ సరసమైన ధరల్లో అందుబాటులో ఉండేలా చేయడమే కాదు, ఇన్నోవెటివ్, మార్కెట్–ఫస్ట్ ఫీచర్స్ కూడా కంపెనీ ఉత్పత్తులు విజయం సాధించడానికి ప్రధాన కారణం.
కంపెనీ ప్రాడక్ట్ లైన్‌లోనికి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐవోటి) డివైజ్‌లు, వైర్‌లెస్ ఇయర్ ఫోన్‌లు...మొదలైనవి వచ్చి చేరాయి. ఇండియన్ మార్కెట్‌లో విజయం సాధించిన అర్నవ్ అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. వ్యాపారవేత్త అయిన తండ్రి నుంచి కిశోర్ నేర్చుకున్న పాఠం... ‘నిరాశతో ప్రయాణాన్ని ఆపవద్దు. పరుగెత్తక పోయినా సరే, నడిస్తే చాలు. ప్రయాణంలోనే ఎన్నో విషయాలను నేర్చుకుంటాం. మంచి,చెడులను తెలుసుకుంటాం’. నిజానికి ప్రయాణ ప్రారంభంలోనే అర్నవ్ కిశోర్‌కి కోవిడ్ హాయ్ చెప్పి భయపెట్టింది. సంక్షోభ సమయంలో వ్యాపారవేత్త డీలా పడకూడదు. కిశోర్ ఆ సమయంలోనూ అధైర్య పడలేదు. వెనకడుగు వేయలేదు.
‘ట్రెండ్స్ ఆఫ్ బ్యాండ్’ ఏమిటి?
‘పాపులారిటీ కోల్పోయిన బ్యాండ్స్ ఏమిటి?’ అనే అంశంపై అవగాహన ఉన్న కిశోర్ 2021లో కొత్త స్ట్రాటజీతో ముందుకు వచ్చాడు. టెంప్టింగ్ ట్యాగ్‌తో నింజా సిరీస్ స్మార్ట్ వాచ్‌లను తీసుకువచ్చి విజయం సాధించాడు. ‘రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్(ఆర్ అండ్ డీ), డిజైన్ మార్కెట్‌లో మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగించాయి’ అంటాడు కిశోర్. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డ్‌లు అందుకున్నాడు అర్నవ్ కిశోర్. సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అర్నవ్ కిశోర్ ఇప్పుడు చేయాల్సింది....ఎప్పటిలాగే ఆట తెలివిగా ఆడటం. అతి ఆత్మవిశ్వాసం ఉంటే ఆట తారు మారు అవుతుంది.
ఇలాంటి విషయాలు అర్నవ్ కిశోర్‌కు తెలియనివేమీ కాదు. ఎందుకంటే ఈ యువ వ్యాపారవేత్త తండ్రి నుంచి ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. టెక్నాలజీ, ఫిట్‌నెస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, స్పోర్ట్స్...అనేవి అర్నవ్ కిశోర్(ఏకే) కలల ప్రపంచం. వాటిని మిళితం చేసి ‘ఫైర్–బోల్ట్’ స్టార్టప్ సృష్టించాడు. ఇది మన దేశంలోనే అతి పెద్ద వేరబుల్ టెక్ బ్రాండ్‌గా అవతరించింది. అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతుంది. ‘మంచి టైమ్ సెట్ చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది’ అంటాడు ఏకే...
Comments
Please login to add a commentAdd a comment