బిల్కిస్ బానో కేసులో ఖైదీల క్షమాభిక్ష చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. దోషులకు క్షమాభిక్ష పెట్టే అర్హత గుజరాత్ సర్కార్‌కు లేదని స్పష్టం చేస్తూ జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయాన్‌లతో కూడిన ధర్మాసనం సంచలన తీర్పును వెలువరించింది. 11 మంది అత్యాచార నిందితుల రిలీజ్‌ను సవాల్ చేస్తూ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
న్యాయ వ్యవస్థ మీద ఆశలు చిగురించాయి
దేశవ్యాప్తంగా సంచనల రేపిన ఈ తీర్పు బాధితురాలితోపాటు, సామాజిక కార్యకర్తలు మహిళాసంఘాలకు, మానవ హక్కుల సంఘాలకు ఊరటనిచ్చింది. మరోవైపు పలువురి పోరాటం,మద్దతు,మీడియా సాధించిన విజయని బిల్కిస్ బానో తరపున పిటీషన్ దాఖలు చేసిన వారు పేర్కొన్నారు. న్యాయం వ్యవస్థపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయని రూప్‌రేఖా వర్మ వ్యాఖ్యానించారు. ఈ తీర్పు మహిళలు నిరాశ పడకుండా న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చిందన్నారు.
ఈ కేసులో సర్ఫరోషి ఫౌండేషన్ ఫౌండర్ ప్రముఖ జర్నలిస్టు రేవతి లాల్, ప్రొఫెసర్ రూప్ రేఖా వర్మ, కమ్యూనిస్ట్ నాయకురాలు మాజీ ఎంపీ సుభాషిణి అలీ, బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా, మాజీ ఐపీఎస్ అధికారి మీరన్ చద్దా బోర్వాంకర్ కూడా ఈ మినహాయింపును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఈ కేసులో ఆదినుంచీ న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేసిన బిల్కిస్ బానో, గుజరాత్ కోర్టు తీర్పు తరువాత ఏ మాత్రం ధ్యైర్యాన్ని కోల్పోకుండా, నిరాశ చెందకుండా సుప్రీంకోర్టు గడప తొక్కిన వైనం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. వీరితో పాటు మరోపేరుకూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె మరెవ్వరో కాదు ఈ కేసులో కీలక తీర్పు వెలువరించిన జస్టిస్ బీవీ నాగరత్న. ఇంతకీ ఎవరీ నాగరత్న?
ఎవరీ జస్టిస్ బీవీ నాగరత్న
బిల్కిస్ బానో రేపిస్టులను మళ్లీ జైలుకు పంపిన ఎస్సీ జడ్జి బీవీ నాగరత్న ఎవరు అనేది చర్చనీయాంశంగా మారింది. 11 మంది దోషులను ముందస్తుగా విడుదల చేసిన రిమిషన్ ఉత్తర్వులను రద్దు చేసిన సుప్రీం న్యాయమూర్తి బీవీ నాగరత్న దోషులు రెండు వారాల్లో లొంగి పొవాలంటూ ఆదేశాలిచ్చి సంచలనం రేపారు.
1962 అక్టోబర్ 30న జన్మించిన జస్టిస్ బెంగుళూరు వెంకటరామయ్య నాగరత్న ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి. గతంలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. దివంగత భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్య కుమార్తె.కర్ణాటకకు చెందిన తొలి సుప్రీం న్యాయమూర్తి కూడా.
మాండ్య జిల్లా, ఎంగలగుప్పె చత్ర గ్రామానికి చెందిన నాగరత్న న్యూఢిల్లీలోని భారతీయ విద్యాభవన్‌లో విద్యను అభ్యసించారు.1984లో ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని జీసస్ అండ్ మేరీ కళాశాల నుండి BA హిస్టరీ పట్టా తీసుకున్నారు. 1987లో న్యాయ పట్టా పొందారు.
న్యాయవాద వృత్తి
జస్టిస్ నాగరత్న అక్టోబర్ 28, 1987న కర్ణాటక బార్ కౌన్సిల్‌లో చేరి న్యాయవాద వృత్తి చేపట్టారు. రాజ్యాంగ, వాణిజ్య, బీమా, సేవ, పరిపాలనా మరియు ప్రజా చట్టం, భూమి మరియు అద్దె చట్టాలు, కుటుంబ చట్టం మరియు మధ్యవర్తిత్వంలో నిపుణత సాధించారు. ఫిబ్రవరి 18, 2008న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగాను, ఫిబ్రవరి 17, 2010న శాశ్వత న్యాయమూర్తిగాను నియమితులయ్యారు. అనంతరం 2021 ఆగస్టులో భారత సుప్రీంకోర్టుకు నియమితులయ్యారు. జస్టిస్ నాగరత్న2027, సెప్టెంబరులో కేవలం 36 రోజుల వ్యవధిలో భారత తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి (CJI) కావాల్సి ఉంది.
కీలక తీర్పులు
కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి పలు కీలక తీర్పులను వెలువరించిన నాగరత్నం 2012లో ఎలక్ట్రానిక్ మీడియాను నియంత్రించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రసార మాధ్యమాలను నియంత్రించేందుకు స్వయం ప్రతిపత్తి, చట్టబద్ధమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరిన ఆమెకే దక్కింది.
నోట్ల రుద్దు చట్ట విరుద్ధం: ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, నోట్ల రద్దుపై ఆమె అభిప్రాయాలు ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన అత్యంత ప్రముఖమైనదిగా పేరొంది. 2016 నవంబరు నాటి నోట్ల రద్దు నిర్ణయంపై, సుప్రీంకోర్టు బెంచ్‌లోని ఇతర నలుగురు న్యాయమూర్తులు డీమానిటైజేషన్ సమర్థించగా మెజారిటీ అభిప్రాయానికి భిన్నంగా జస్టిస్ నాగరత్న అది సదుద్దేశంతో కూడుకున్నదే కానీ చట్టవిరుద్ధని అభిప్రాయపడ్డారు. అలాగే కేంద్ర ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేయడం కంటే దానిని అమలు చేయడానికి శాసన ప్రక్రియను అనుసరించాల్సి ఉందని చెప్పారు.
2019 తీర్పులో, జస్టిస్ నాగరత్న దేవాలయం వాణిజ్య సంస్థ కాదంటూ మరోసాహసోపేత తీర్పును వెలువరించారు. దాని ఉద్యోగులు గ్రాట్యుటీ చెల్లింపు చట్టం ప్రకారం గ్రాట్యుటీకి అర్హులు కాదని, అయితే కర్ణాటక హిందూ మతపరమైన సంస్థలు మరియు స్వచ్ఛంద సేవా చట్టం ప్రకారం ఇలాంటి ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది.
కర్నాటక హైకోర్టులో 2021లో పోక్సో చట్టంపై ఇచ్చిన తీర్పు గురించి కూడా ప్రధానంగా చెప్పుకోవాలి. ఈ చట్టంలోని సెక్షన్ 35లో పేర్కొన్న ఆదేశాన్ని పూర్తి కాని పక్షంలో నిందితులకు బెయిల్‌పై హక్కు ఉండదని జస్టిస్‌లు బీవీ నాగరత్న , ఎంజి ఉమతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. అంటే కేసును మొదట గుర్తించినప్పటి నుండి ఒక సంవత్సరంలోపు విచారణను ముగించాలి. పిల్లల ప్రమేయం ఉన్నట్లయితే, నేరాన్ని అంగీకరించిన 30 రోజులలోపు కోర్టు వారి సాక్ష్యాలను నమోదు చేయాలి. ఏవైనా జాప్యాలు జరిగితే వాటిని వ్రాతపూర్వకంగా రికార్డు చేయాలని కూడా స్పష్టం చేశారు.
బిల్కిస్ బానో కేసు
2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లలో సమయంలో బిల్కిస్ బానోపై ఇంట్లోకి చొరబడిన పలువురు దుండగులు సామూహిక అత్యాచారం చేశారన్న ఆరోపణలు నమోదైనాయి. ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానో మూడేళ్ల కూతురితో పాటు ఇంట్లో అందరినీ దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో ఈ కేసులో మొత్తం పదకొండు మంది దోషులకు కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ తరువాత ఈ తీర్పుపై నిందితులు అప్పీల్ చేసుకోవడంతో యావజ్జీవ శిక్షగా మారింది. అయితే గత ఏడాది స్వాతంత్ర దినోత్సవం రోజున సత్ ప్రవర్తన, 14 ఏళ్లు శిక్ష పూర్తి చేసుకున్నారంటూ క్షమాభిక్షపేరుతో విడుదల చేసింది. దీంతో దిగ్భాంతికి గురైన బిల్కిస్ బానో తిరిగి సుప్రీను ఆశ్రయించారు. ఈ నేపధ్యంలో గతేడాది అక్టోబర్ లో తీర్పును రిజర్వ్ చేశారు. ఈక్రమంలో జస్టిస్ నాగరత్న గుజరాత్ ప్రభుత్వం వైఖరిని తప్పుబట్టారు. దోషుల క్షమాభిక్షను రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment