మా చిన్నతనంలో ఎవరింట్లో అయినా పెళ్లికి వెళితే ముందుగా ఎదురుచూసేది, "పెళ్ళి ఉప్మా" కోసం. ఎందుకంటే, నాటి - మేటి "పెళ్ళి ఉప్మా" రుచి అల్లాంటిది !పచ్చటి అరిటాకులో తెల్లటి ఉప్మా వేడి వేడిగా వేయించుకుని, చట్నీ కూడా లేకుండా, నోరు కాలిపోతున్నా, ఆబగా తినేసి, మళ్ళీ మళ్ళీ వెళ్ళి, సిగ్గు లేకుండా...అదే... సిగ్గు పడకుండా...వేయించుకుని, ఆ కాలిన నోటితోనే, వేడి వేడి కాఫీని,గాజు గ్లాసుతో చప్పరిస్తే వుండేదీ..ఆహా ఏమి రుచీ... తినగా మైమరచీ అనేలా.
ఆ ఒక్కటీ అడగొద్దు..
ఇప్పుడూ పెళ్ళిళ్ళకి వెళుతున్నాం. ఖరీధైన, పేరుమోసిన క్యాటరింగ్ సర్వీసులు. రంగురంగుల డ్రెస్సులు వేసుకొని, టోపీలు పెట్టుకొని, ప్లాస్టిక్ ప్లేట్లలో ఉప్మాతో పాటు, నాలుగు రకాల టిఫిన్లు, మూడు రకాల చట్నీలు వేసి, స్పూన్‌లు వేసి మరీ మనమీదకి విసిరేస్తున్నారు. కానీ, ఏమిటో టిఫిన్ చెయ్యడం(అంటే వండడం కాదండి, తినడం)మొక్కుబడి అయిపోయింది.ఓ చేత్తో తింటూనే.. ఇంకో చేత్తో ఓ అరడజను మాత్రలు మింగాలిగా !"వేళకి మాత్రలు వేసుకు చావండి...లేపోతే ఛస్తారు"... అన్నారుగా డాట్టర్లు !) అందుకు తింటున్నాం !
తగ్గేదే లే...
ఇంకోటి గమనించారా...ఇప్పుడు హొటల్ కి వెళ్ళి, మెనూ కార్డుని ఛడా - మడా చదివేసి, "ప్లేటు ఇడ్లీ...వేడిగా వుండాలి, గట్టి చట్నీ, కారప్పొడీ - నెయ్యీ వేసి పట్రా..." అని ఆర్డరు ఇచ్చేస్తున్నాం కానీ, రెండో ప్లేటు తినే దమ్ములేవీ ?అసలు హోటల్లో టిఫిన్ తినేదే వాడు వేసే చట్నీలు, సాంబార్ కోసం.అదే కొంపలో అయితే, నాలుగో...ఆరో ఇడ్లీలు అవలీలగా ఆవకాయ్ తో పట్టేస్తాం ఏంటి ?ఇంక హొటల్లో మసాలా దోశలు, పూరీ - కూరలు, గారీ - సాంబార్ లు అయితే...తెలుసుగా...ఒక ప్లేటుకే..పొట్ట "హౌస్ ఫుల్" బోర్డు పెట్టేస్తుంది !మరదే...ఇంట్లో అయితే..."తినే వాడికి ఒడ్డించే వాళ్ళు లోకువ" అన్నట్టు,"ఇంకా తే.. ఇంకా తే" అనుకుంటూ కుంభాలు కుంభాలు పట్టించేస్తూనే ఉంటాం.
అస్తమానూ, "హమారే జమానే మే..." అనుకుంటూ, అప్పట్లో మనం, గోంగూర పచ్చడి, కొత్త చింతకాయ్ పచ్చడి లాంటి "ఇష్ట భోజ్యార్ధ సిధ్యర్ధం" ఎదురు చూసి,ఎదురు చూసి, కోరిక సిద్ధించగానే, పడికట్టుగా బాసింపట్టు వేసుక్కూర్చుని, రెండు, మూడు వాయిలు లాగించేసేవాళ్ళమని, ఇప్పటి 'ప్లేటు మీల్స్' వాళ్ళకి
చెబితే ఏం లాభం ? ప్చ్ !"అర్ధం చేసుకోరూ...." వాళ్ళు...అన్నిటికీ మనం సొంత డబ్బా కొట్టుకుంటున్నామనుకుంటున్నారు !
"చద్దన్నం - మజ్ఝాన్న భోజన పధకం - రాత్రి తిండి" అనే ముప్పొద్దుల 'ఉదర పోషణ' కార్యక్రమాలు ఉండేవని, మధ్య మధ్యలో ఆడుకుని వచ్చి, చిరుతిళ్ళకోసం,
"ఏదైనా పెట్టు" అంటూనే వుండేవాళ్ళమని, అందుకు గృహిణులు వంటింటినే అంటిపెట్టుకుని బతికేసేవారని, చెబితే, ఇప్పటి వారికి, "ఆసచర్యం...ఆసచర్యం" !అదీకాక, రాత్రి పలహారాల బ్యాచి, విభాగాలు వేరే ఉండేవని కూడా చెబితే...వీళ్ళు నమ్మట్లేదు ! ఏం చేస్తాం ?ఇంక పండగలు - పబ్బాలు వస్తే, తెల్లారుకట్ల లేచి, ఇంటిల్లిపాదికీ నలుగెట్టి తలంట్లు, నవకాయ పిండివంటలతో వంటలు, పైపెచ్చు, ప్రత్యేక పిండివంటలు చేసి - చేసి, గృహిణులు అలిసిపోయి, పులిసిపోయినా...
పాపం, "పండగ బాగా జరిగింది" అని పదిసార్లు చెప్పుకుని, మురిసిపోయేవాళ్ళే కానీ, ఏనాడూ,"మేం ఇంత పని చేశాం... అంత పని చేశాం" అని దెప్పడం ఎరుగుదుమా ? "హౌ గ్రేట్ !"
అదే ఇప్పుడైతే...తెలుసుగా...?
ఫ్రిజ్‌లోంచి స్పెషల్ ఐటమ్స్ రెడీ..పండగొస్తోందని మనవాళ్ళకి తెలిసేలోపే,స్వగృహా ఫుడ్స్ వాళ్ళు, మనందరి ఇళ్ళలోకీ కావలసినన్ని స్వీట్లు - హాట్లు,శ్రేష్టమైన నూనెల్తో తయారు చేయించేసి, ప్రత్యేక స్టాల్స్ వేసి, రోడ్డుమీద పెట్టేస్తున్నారుగా !వస్తూ వస్తూ, దారిలో నాలుగైదు రకాలు, తలో అర కేజీ తూపించుకుని వచ్చేస్తే, పండగ అయిపోయినట్టే !ఆ రోజుల్లో మగమహారాజులం మాత్రం, వంటింటి ఛాయలకి వెళ్ళకుండా, (భోంచెయ్యడానికి తప్ప) కొత్తబట్టలు వేసుకుని, భుక్తాయాసంతో అలిసిపోయేవాళ్ళం !
ఇంక తద్దినాలు, పితృ కార్యాలూ వస్తే, వందల కొద్దీ గారెలకి రుబ్బురోళ్ళలో పిండి రుబ్బడం దగ్గర్నుంచీ, నాలుగు రకాల కూరలు, పచ్చళ్ళు, పరవాన్నాలూ కూడా చేసి, సాయంత్రం ఏ నాలుగింటికో భోజనాలు చేసిన స్త్రీ మూర్తుల సహనాన్ని, ఓపికల్ని,"ఏమని వర్ణించనూ..." ఇప్పుడు అన్నిటికీ అంటే పుట్టిందగ్గిర్నించీ.. చివరిదాకా జరిపించే షోడశ కర్మలకీ... కాంట్రాక్టులు వచ్చేశాయి కాబట్టి, అలా...ఓ గంటసేపు రాఘవేంద్ర మఠానికి కార్లో వెళ్ళి, "మమ" అనుకుంటే...సరిపోతోంది !
అవన్నీ వాళ్లకేం తెలుసు?
ఈ మధ్య ఫేసు బుక్కుల్లో "గత కాలము మేలు, వచ్చుకాలము కంటెన్" అనుకుంటూ, రోడ్డుమీద గోళీలు, గూటీ బిళ్ళ ఆడుకున్న ఫోటోలు, కిరసనాలు లాంతర్లు, పాత మర్ఫీ రేడియోల ఫోటోలు తెగ షేర్ చేసేస్తూ, మురుసిపోతున్నారు కానీ, ఒక గంట కరెంటు, ఒక పది నిమిషాలు నెట్టు లేకుండా ఊహించుకోడానికే భయపడిపోతారు ! ఆ విరామ సమయంలో...పాత కాలం నాటి తాటాకు విసినికర్రలు వాడుకుంటూ, తొక్కుడుబిళ్ళ ఆడుకోచ్చుగా ? "ఆ ఒక్కటీ అడక్కు" అంటున్నారు.అమ్మమ్మలు, తాతలు కథల్లో బాగుంటారు కానీ, వాళ్ళు ఇప్పుటిదాకా బావుంటే, కూచుని లేవడానికి మనకే ఓపికల్లేవు, వాళ్ళనేం చూస్తాం...వాళ్ళకేం చేస్తాం ?
"పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు..ఉన్నోళ్ళూ పోయినోళ్ళ తీపిగురుతులూ..."అని చెప్పిన ఆత్రేయే, అనుకున్నామని జరగవు అన్నీ...అనుకోలేదని...ఆగవు కొన్నీ...జరిగేవన్నీ మంచికనీ.. అనుకోవడమే..మనిషి పనీ... !"అనికూడా అన్నాడు !కాబట్టి, అలాగే అనుకుంటే, ఓ పనైపోతుంది !శుభం భూయాత్ !
Comments
Please login to add a commentAdd a comment