అమ్మా నాన్నా ఒకరితో ఒకరు బాగుంటే మంచిదే. ఒకరితో ఒకరు బాగోకపోయినా పిల్లలతో బాగుండాల్సిన బాధ్యత ఉంది. కాని ఇద్దరి మధ్య గొడవలు పిల్లలపై ప్రతీకారంగా మారితేనే సమస్య. నాన్న మీద కోపం అమ్మ పిల్లల మీద చూపినా అమ్మ మీద ఆగ్రహం నాన్న పిల్లల మీద చూపినా నలిగిపోయేది ఆ పసి మనసులే. తమిళనాడులో తులసి అనే తల్లి తన రెండేళ్ల కుమారుణ్ణి భర్త మీద కోపంతో కొట్టడం వైరల్ అయ్యింది. ఆమెను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కలతల కాపురాలలో పిల్లలపై హింస గురించిన కథనం...
రెండు రోజుల క్రితం తమిళనాడులో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఒక తల్లి తన రెండేళ్ల బాబును పదే పదే కొడుతూ ఆ వీడియోను రికార్డు చేసింది. ఆ పసివాడు తల్లి దెబ్బలకు తాళలేక ఏడుస్తూ తల్లి సముదాయింపు కోరుతూ ఉంటే ఆ తల్లి ఆ చిన్నారిని మళ్లీ మళ్లీ హింసించింది. ఇది బయటకు రావడంతోటే తమిళనాడు అంతా ఉలిక్కిపడింది. ఆ తల్లిని అరెస్టు చేయాలని నెటిజన్లు కోరారు. వెంటనే పోలీసులు రంగంలో దిగారు. ఆమెని అరెస్టు చేశారు. మూడు సెక్షన్లు– సెక్షన్ 323, 355, 75 కింద ఆమె ఇప్పుడు విచారణ ఎదుర్కొనాలి.
ఏం జరిగింది?
తమిళనాడు విల్లిపురం జిల్లాలోని గింజిలో వడివేలన్ (37), తులసి (22) భార్యాభర్తలు. వీరికి 2015లో వివాహం జరిగింది. ఇద్దరు అబ్బాయిలు. వడివేలన్ గింజిలో కాపురం పెట్టి చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఇంటికి వస్తూ పోతూ ఉన్నాడు. అయితే అతడు భార్య ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోందని గ్రహించి ఆమెని వారించాడు. మానకపోయేసరికి ఫిబ్రవరిలో చిత్తూరులోని ఆమె పుట్టింటికి పంపాడు. పిల్లల్ని తన దగ్గరే ఉంచుకున్నాడు. అయితే ఆమెను పుట్టింటికి పంపే ముందు ఆమె ఫోన్లో బాబును కొడుతూ రికార్డు చేసిన వీడియోలు చూశాడని ఒక కథనం. లేదా అప్పుడు రికార్డయిన వీడియోలు ఇప్పుడు బయట పడ్డాయని (అతడే బయటపెట్టాడని) ఒక కథనం. ఏమైనా కన్నతల్లి దారుణంగా తన పసిబిడ్డను కొట్టడం అందరినీ కలచి వేసింది. ఆదివారం తులసిని అరెస్టు చేసిన పోలీసులు విల్లిపురం తీసుకొచ్చారు. సైకియాట్రిస్టులు పరీక్షించి ఆమెకు ఏ మానసిక రుగ్మత లేదని నిర్థారించారు. కేవలం భర్త పట్ల కోపం, లేదా ఏదో ఒక నిస్పృహతోనే ఆమె పిల్లవాణ్ణి హింసించిందని ఒక అభిప్రాయం.
ఎందుకు కొడతారు?
‘తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కొడతారంటే వాళ్లు తిరిగి కొట్టలేరని’ అని రాశాడు ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకట చలం. తల్లిదండ్రుల కోపతాపాలకు పిల్లలు నలిగిపోవడం ఈ దేశంలో ఎప్పటి నుంచో ఉంది. భర్త మీద కోపంతో పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకున్న తల్లులు ఎందరో ఉన్నారు. భార్య మీద కోపంతో పిల్లల్నీ, తల్లిని హత్య చేసేంత వరకూ వెళ్లిన తండ్రులు ఉన్నారు. ఇవి తీవ్రమైన కేసులు అయితే బయటకు రానివి ఇంట్లోనే ఉండేవి పిల్లలకు మాత్రమే తెలుస్తాయి. కలతల కాపురం చేస్తున్న భార్యాభర్తలు తమ కోప తాపాలను పిల్లల మీద చూపడం, పిల్లలతో ‘నువ్వు పుట్టకపోయినా బాగుండేది ఏ నుయ్యో గొయ్యో చూసుకునే దానిని’ అని తల్లి అనడమో ‘నీ వల్లే మీ అమ్మతో వేగాల్సి వస్తోంది’ అని తండ్రి అనో పసి మనసులను గాయపరుస్తారు. అది చాలక భార్యను కొట్టలేక పిల్లల్ని కొట్టడం, భర్తను తిట్టలేక పిల్లల్ని బాదడం చేస్తుంటారు. ఇంకా దారుణంగా పిల్లలతో మాట్లాడటమే మానేసి తమ తమ పంతాలలో ఉండిపోతారు. ఇలా పిల్లల్ని బాధించడం శిక్షార్హమైన నేరం.
ఒక వైపు అయితే...
తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల్ని బాధిస్తూ ఉంటే తల్లి/తండ్రి కాని వెంటనే దాని నివారణకు సీరియస్‌గా ఆలోచించాల్సి ఉంటుంది. చట్ట సహాయం లేదా కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లల్ని ఆ బాధ నుంచి రక్షించాల్సి ఉంటుంది. కాని తల్లిదండ్రులు ఇద్దరూ బాధిస్తూ ఉంటే వారికి విముక్తి కలిగించాల్సిన బాధ్యత ఇరుగుపొరుగు వారిది, బంధువులది, స్నేహితులది అవుతుంది. కలహాల కాపురం దాచేస్తే దాగేది కాదు. కచ్చితంగా అయినవారికి తెలుస్తుంది. అలా తెలిశాక వారు చేయాల్సిన పని పిల్లల మీద ఏదైనా హింస జరుగుతున్నదా అని ఆరా తీయడమే. ఈ పని తప్పక చేయాలి. ఇది అంత సులువు కాకపోయినా పిల్లల మెల్లగా బుజ్జగించి ఆ విషయాన్ని రాబట్టాల్సి ఉంటుంది. లేదా అమ్మమ్మలు, తాతయ్య లు అయితే హక్కుగా కూడా నిలదీసి తెలుసుకోవచ్చు. అలా జరుగుతున్న పక్షంలో ఆ తల్లిదండ్రులను హెచ్చరించాలి లేదా పిల్లల్ని ఆ వాతావరణం నుంచి తప్పించాల్సి ఉంటుంది.
బ్లాక్‌మెయిలింగ్ సాధనం
భార్యాభర్తల కొట్లాటలలో పిల్లలు ఒక బ్లాక్‌మెయిలింగ్ సాధనంగా మారటం చాలా విషాదం. సమస్య చేయి దాటేశాక భర్తను/భార్యను తిరిగి అదుపులోకి తెచ్చుకోవడానికి ‘నా మాట వినకపోతే పిల్లల్ని చంపేస్తా’ అనే వరకూ వెళ్లిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అందుకు శాంపిల్‌గా పిల్లలకు వాతలు పెట్టి జీవిత భాగస్వామిని భయభ్రాంతం చేయాలనుకునే తల్లి/తండ్రి ఉన్నారు. ఈ సమస్య నుంచి పిల్లలు తమను తాము కాపాడుకోలేరు. దగ్గరి బంధువులే ఒక కన్నేసి పెట్టి ఈ పిల్లల గురించి పట్టించుకోవాలి. ‘మాకెందుకులే’ అనే భయం ఉంటే కనీసం చైల్డ్ కేర్ సెంటర్‌లకు ఫోన్ చేసి చెప్పడమో, పోలీసులకు ఇన్‌ఫామ్ చేయడమో చేయాలి.
తల్లిదండ్రులు ఒక విషయం ఆలోచించాలి. కుదరని సంసారం నుంచి బయటపడటం లేదా సర్దుబాటు చేసుకోవడం ఈ ప్రాసెస్‌లో భార్య/భర్త ఒకరినొకరు ఎంత ఇబ్బంది పెట్టుకున్నా ఆ వ్యవహారంలో పిల్లల్ని ఇన్‌వాల్వ్ చేయడం ఏ మాత్రం సంస్కారం కాదని గ్రహించాలి. ఇటీవల బడులలో ‘గుడ్ టచ్’ ‘బ్యాడ్ టచ్’ గురించి అవగాహన కల్పిస్తున్నారు. దాంతోపాటు ‘కొట్టే తల్లిదండ్రులు’ గురించి కూడా పిల్లలు టీచర్లకు చెప్పే అవగాహన కల్పించడం అవసరం. అప్పుడే పిల్లల్ని కొట్టే తల్లిదండ్రుల ఆగడాలు ఆగుతాయి.
అమ్మా... నాన్నా... కొట్టొద్దు ప్లీజ్
Published Tue, Aug 31 2021 12:33 AM | Last Updated on Tue, Aug 31 2021 12:33 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment