మలబద్దకం చాలా ఇబ్బంది కలిగించే సమస్య. పైగా ఇటీవలి కరోనా కాలంలో చాలామంది ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రాతిపదికన పనిచేస్తున్నందున ఈ కేసుల సంఖ్య పెరిగే అవకాశాలూ ఎక్కువ. గతంలో ఆఫీసు వరకు ప్రయాణం చేసేందుకు అవసరమైన కదలికలు కూడా ఇటీవల లేకపోవడంతో ఈ సమస్య మరింతగా కనిపిస్తున్నట్లు ఇటీవల హాస్పిటల్స్‌కు వచ్చే కేసుల సంఖ్యను బట్టి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మలబద్ధకం సమస్యకు కారణాలూ, నివారణ సూచనలను తెలుసుకుందాం.
పిల్లల్లోనైనా, పెద్దల్లోనైనా విరేచనం సాఫీగా కాకపోవడమో లేదా ముక్కి ముక్కి అతి కష్టమ్మీద వెళ్లాల్సిరావడమో జరుగుతుంటే అది మలబద్ధకంగా పరిగణించవచ్చు. కొంతవుంది తమకు రోజూ విరేచనం కావడం లేదు కాబట్టి ఈ సమస్య ఉందని అనుకుంటారు. అయితే విసర్జన ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండదు. అందరిలోనూ తప్పనిసరిగా రోజూ విరేచనం అయి తీరాలన్న నియమం లేదు. కనీసం వారంలో మూడుసార్లు మలవిసర్జన చేయడంలో సమస్య ఎదురుకావడంతో పాటు ఆ ప్రక్రియ చాలా కష్టంగా జరుగుతుంటే దాన్ని మలబద్ధకం అనుకోవచ్చు. చాలా సందర్భాల్లో ఇది అంత తీవ్రమైన సమస్య కాదు. అయితే సమస్య తీవ్రత చాలా ఎక్కువగా ఉంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
నివారణ ఇలా...
కొన్ని జీవనశైలి మార్పులతో మలబద్ధకాన్ని సమర్థంగా నివారించుకోవచ్చు. అందుకు ఉపయోగపడే కొన్ని సూచనలివి...
- జామ పండును గింజలతోనే తినేయండి. ఆ గింజలు మోషన్ ఫ్రీగా అయ్యేలా సహాయపడతాయి.
- ప్రతిరోజూ వెజిటబుల్ సలాడ్స్ (క్యారట్, బీట్‌రూట్, టొమాటో, కీర దోసకాయ, ఉల్లిని ముక్కలుగా చేసి పచ్చిగా) తినండి.
- మీరు తీసుకునే ఆహారంలో తాజా పండ్లు (జావు, ఆరెంజ్, బొప్పాయి. ఆపిల్ వంటివి) ఎక్కువగా తీసుకోండి. నీటిపాళ్లు ఎక్కువగా ఉంటే పండ్లు తినండి.
- మెులకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది.
- పొట్టుతో ఉన్న ధాన్యాలు (జొన్న, రాగి), పొట్టుతో ఉండే గోధువులు, వుుడిబియ్యం, పొట్టుతోనే ఉండే పప్పుధాన్యాలు వంటివి తీసుకోవడం వల్ల కూడా మలబద్ధకాన్ని నివారించవచ్చు.
- చివరగా.. రోజూ క్రవుం తప్పకుండా వ్యాయామం చేయండి. అయితే సమస్య తీవ్రంగా ఉన్నవారు మాత్రం డాక్టర్‌ను కలిసి దానికి కారణాలు కనుగొని, దానికి అనుగుణంగా తగిన మందులు వాడాల్సి ఉంటుంది.
మలబద్ధకానికి కారణాలు...
- ఆహారపరమైనవి: మనం తీసుకునే ఆహారంలో తగినన్ని పీచుపదార్థాలు లేకపోవడంతో పాటు... ఎక్కువ కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం (అంటే... వెన్న, నెయ్యి, మాంసం అందునా రెడ్‌మీట్ వంటివి) ఎక్కువగా తీసుకోవడం.
- ద్రవాహారం తక్కువగా తీసుకోవడం వల్ల: మనం తీసుకునే పదార్థాలలో నీళ్లు, పళ్లరసాలు వంటి ద్రవాహారం తక్కువగా ఉండటం. ద్రవాహారం ఎక్కువగా ఉంటే అది పేగుల కదలికలను ప్రేరేపించి విరేచనం సాఫీగా అయ్యేలా చేస్తుంది.
- సాధారణానికి భిన్నమైన పరిస్థితుల్లో : కొందరు మహిళలకు గర్భధారణ సమయంలో హార్మోన్ల ప్రభావంతో మలబద్ధకం రావచ్చు. మరికొందరిలో ప్రయాణ సమయంలో తమ ఆహారపు అలవాట్లు మారినందువల్ల కూడ ఈ సమస్య రావచ్చు.
- ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్): ఈ సమస్య ఉన్నవారిలో పేగుల కదలికలు ప్రభావితమై మలబద్ధకం ఉండవచ్చు. అయితే ఇది ఏరకంగానూ ప్రమాదకరమైన పరిస్థితి కాదు. కాబట్టి ఆందోళన అక్కర్లేదు.
- మరికొన్ని రుగ్మతల్లోనూ : సాధారణంగా నరాలకు సంబంధించిన వ్యాధులు, ఎండోక్రైన్ రుగ్మతలు వంటివి వచ్చినప్పుడు కూడా మలబద్ధకం రావచ్చు.
- మందులు: కొన్ని రకాల నొప్పి నివారణ మందులు, యాంటాసిడ్స్, యాంటీ డిప్రెసెంట్స్, ఐరన్ సప్లిమెంట్స్, మూర్ఛవ్యాధికోసం తీసుకునే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ తీసుకునేవాళ్లలో పేగుల కదలికలు బాగా మందగించి మలబద్ధకం రావచ్చు.
- వ్యాయావుం లేకపోవడం: దేహానికి కదలికలు తగినంతగా లేకపోవడం లేదా వ్యాయామం చేయకపోవడం వల్ల పేగుల కదలికలు మందకొడిగా ఉంటాయి. దాంతో ఎక్కువసేపు పడకపైనే ఉండేవారికి లేదా కూర్చునే ఉండేవారికి మలబద్ధకం వచ్చే అవకాశాలెక్కువ.
కరోనా కత్తికి డెంగీ డాలు!
‘అంతా మన మంచికే’ అన్నది మనందరికీ తెలిసిన ఓ తెలుగు సామెత. ‘ఎవరికైనా డెంగీ వచ్చిందనుకోండి. అది మంచికెలా అవుతుం’దంటూ గతంలో ఎవరైనా వాదిస్తే... గద్దిస్తే అప్పట్లో మనం చెప్పగలిగేదేమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడా సామెతకు సైతం తార్కాణాలున్నాయి! అందునా కరోనా... డెంగీల ఉదాహరణలతో!! ఇదే విషయాన్ని డ్యూక్ యూనివర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ గట్టిగా చెబుతున్నారు. పెద్దలు చెప్పే సామెతల్లో చాలా సందర్భాల్లో విశ్వజనీన వాస్తవాలు ఉంటాయని ఆ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మైగుల్ నికోలెలిస్ మాటల ఆధారంగా మరోమారు నిర్ద్వంద్వంగా రుజువైంది. బ్రెజిల్‌లో నిర్వహించిన అధ్యయనాల ఫలితంగా ఆయన చెబుతున్న వాస్తవం ఏమిటంటే... గతంలో ఓసారి డెంగీ వ్యాధి వచ్చి తగ్గిన వారిలో కరోనా వైరస్ పట్ల వ్యాధి నిరోధకత ఉంటుందట.
చాలావరకు లేకపోయినా ఎంతో కొంత మాత్రం తప్పనిసరిగా ఉంటుందంటున్నారు ప్రొఫెసర్ నికోలెలిస్. ఆయన పరిశీలన ప్రకారం... గతంలో డెంగీ వచ్చిన వారి శరీరాల్లో వృద్ధిచెందిన యాంటీబాడీస్ కారణంగా ఈసారి కరోనా సోకినప్పుడు వ్యాధి తీవ్రత పెద్దగా లేదనీ, చాలా మరణాలు కూడా నివారితమయ్యాయని కూడా ఖండితంగా చెబుతున్నారాయన. డెంగీ విస్తృతంగా వచ్చిన ప్రదేశాల్లో కరోనా తీవ్రత తక్కువగా ఉండటాన్ని కూడా ఆయన గుర్తించారు. డెంగీ కలగజేసే ఫ్లావీ వైరస్‌కీ... కరోనా వైరస్‌కూ కొంత సారూప్యం ఉండటం వల్ల ఇలా జరుగుతోందని ఆయన వివరించారు. గతంలో డెంగీ వచ్చి తగ్గినవారికి ఇది కొంతమేర శుభవార్తే కదా!
Comments
Please login to add a commentAdd a comment