మంచి మాట: మన ఆలోచనలే మనం | Control over thoughts brings easy success | Sakshi
Sakshi News home page

మంచి మాట: మన ఆలోచనలే మనం

Published Mon, Apr 4 2022 4:07 AM | Last Updated on Mon, Apr 4 2022 4:07 AM

Control over thoughts brings easy success - Sakshi

మనిషిని మనిషిగా నిలబెట్టగల్గినవి ఆలోచనలే. మన సంకల్ప వికల్పాలకు మన మనస్సే ఆధారం. అది సాత్వికమైతే మన ఆలోచన ఇతరులకు ఉపయోగకరంగా ఉంటుంది. రాజసమైతే తమకనుకూలంగా ఉంటుంది. తామసికమైతే ఇతరుల విషయంలో ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే మనస్సు మీద అదుపు ఉండాలని చెప్తారు. మనస్సు వశంలో ఉన్నప్పుడే, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు అదుపులో ఉంటాయి. ఎప్పుడైతే మనస్సుతో పాటు ఇతర ఇంద్రియాల మీద పట్టు సాధించగల్గుతాడో, అప్పుడే మనిషి ఒక చక్కని ఆలోచనాపరుడిగా నిలబడగల్గుతాడు.

ఆలోచించే దానికంటే ఎక్కువగా ఆలోచించడం వల్ల, ఒక్కోసారి మనం మన స్థాయి కంటే మించిపోతామో ఏమో అనిపిస్తుంది. జీవితం ఒక పద్ధతిలో సాగాలంటే అందుకు మన ఆలోచనా సరళి దోహదకారి అవుతుంది. అసలు ఆలోచించడ మెందుకనే వారు కూడా ఉండవచ్చు. కానీ ఆలోచించకుండా ఏ మనిషీ ఉండజాలడు. మన సంకల్పం సక్రమ స్థితిలో ఆవిర్భవించినప్పుడు, మన ఆలోచన చక్కగా కొనసాగుతుంది. ఎప్పుడైతే మన ఆలోచన సరిగా సాగుతుందో అప్పుడు ఏ విషయంలోనైనా ఒక నిర్ణయానికి రాగలుగుతాం.
సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడు ఒకచోట చెప్పిన మాట ఆలోచనాత్మకమైంది.

‘‘ఎదుటి వారిని విమర్శించే ముందు మనం వారి స్థానంలో ఉండి ఆలోచించాలి’’ అనడంలో మనల్ని మనం చక్కదిద్దుకునే ఏర్పాటు మాత్రమే కాదు, ఎదుటి వారి దృష్టిలో పలుచన కాని వారమై కూడా ఉండాలన్న ఉపదేశం తేటతెల్లమవుతుంది.

సంకల్పించడం, ఆలోచించడం అనేవి మనిషికి గొప్ప వరాలు. వాటిని సాధించాలంటే జీవితాన్ని క్రమశిక్షణ మార్గంలో నడిపించాలి. ఈ క్రమశిక్షణ పుట్టుకతోనే రావాలని అనుకుంటారు కాని అది ఒకరిని ఆదర్శంగా తీసుకున్నపుడే సాధ్యమవుతుంది. ఆ ఒక్కరు తల్లిదండ్రులలో ఒకరు కావచ్చు, గురువు కావచ్చు, స్నేహితుడు కూడా కావచ్చు.

క్రమశిక్షణతో కూడిన ఆలోచన మనిషిని మహోన్నత శిఖరాలకు అధిరోహింపజేస్తుంది. ఒక సదాలోచన బుద్ధున్ని సత్యాన్వేషకున్ని చేసింది. ఒక సదాలోచన అంబేద్కరును రాజ్యాంగ నిర్మాతను చేసింది. ఒక సదాలోచన వివేకానందుని సన్యాసిని చేసింది. ఒక సదాలోచన దయానందుణ్ణి మనిషిని చేసింది. ఆలోచనకు ప్రతిరూపంగానే మనిషి భాసిస్తాడు. కనుకనే మనిషిని మేధావి అని పిలుస్తాం.

‘హెయిన్‌’ అనే పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రవేత్త ‘‘మంచి ఆలోచనలు చేసేవారే మంచి పనులు చేస్తుంటారు’’ అని సెలవిచ్చాడు. ఇది ముమ్మాటికీ నిజం. మంచి ఆలోచన మంచి పనికి దారి తీస్తుంది. మంచిపని మంచి ఫలితాన్ని ఇస్తుంది. ‘‘జీవితంలో గొప్పగా ఎదగాలంటే సానుకూలంగా ఆలోచించడం నేర్చుకోవా’’ లన్న బెన్నిసన్‌ మాటలు గమనింపదగ్గవి. ఉన్నతమైన ఆలోచనలే ఉన్నతమైన స్థానంలో నిలబెడతాయి. గొప్ప పనులు చేయాలంటే మొదట గొప్పగా ఆలోచించక తప్పదు. చరిత్రలో నిలబడ్డ మహా పురుషులందరూ గొప్పగా ఆలోచించినవారే.
   మంచి స్వభావం మనిషికి అలంకారమైనప్పుడు మంచి ఆలోచన అతనికి కిరీటంగా భాసిస్తుంది. ‘యద్భావం తద్భవతి’ అనే మాట ఒకటుంది. ఏది అనుకుంటే అది అవుతుందని దాని అర్థం. నిజానికి అందరు అనుకున్నది అవుతుందా? ఎవరైతే పరిశుద్ధమైన మనస్సుతో సంకల్పించి, కార్య రంగంలోకి దూకుతారో వారికే విజయం సంప్రాప్తమవుతుంది.

కొందరు అదేపనిగా ఆలోచిస్తుంటారు. ప్రతి దానికి ఆందోళన చెందుతుంటారు. మనస్సు కకావికలం కాగా, విచారానికి లోనవుతారు. కాని జరిగిన వాటిని గూర్చి, జరగబోయే వాటిని గూర్చి పండితులు ఆలోచించరు. లోకంలో జరిగినవి, జరగబోయేవి మనల్ని ప్రభావితుల్ని చేస్తాయి. కాని బుద్ధిశాలురు జరుగుతున్న విషయాలను మాత్రమే పట్టించుకుంటారు. వారు వర్తమానంలో జీవిస్తారు. వాస్

తవికతను ఆవిష్కరిస్తారు. పరిస్థితులను బట్టి వ్యవహరిస్తారు. కాని సామాన్యులు తద్భిన్నంగా ఆలోచిస్తూ జీవితాలను దుఃఖమయం చేసుకుంటారు.
మనస్సును నిగ్రహించుకున్నప్పుడు ఆలోచనలు ఆగిపోతాయి. అందుకే మన పెద్దలు ఆలోచనల్ని గుర్రాలతోను, మనస్సును పగ్గాలతోను పోల్చి చెప్పారు. అప్పుడు శరీరం రథంగాను, బుద్ధి సారధి గాను మారిపోయి, మనిషి అనుకున్న గమ్యం చేరడానికి వీలు కలుగుతుంది.

మనిషిని గమ్యం వైపు ప్రయాణింపజేసే ఆలోచనలే నిజమైన ఆలోచనలు. అందుకు మొదట మనిషి లక్ష్య శుద్ధి కల్గిన వాడు కావాలి. ఆ లక్ష్యాన్ని చేరడానికి జీవితంలో, అతనికి ఆలోచనల కంటే మించి సాయపడేవి మరేవీ ఉండవని గట్టిగా చెప్పవచ్చు.

– ఆచార్య మసన చెన్నప్ప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement