ఈపీఎఫ్‌ఓ–2020 నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల భర్తీకి త్వరలో పరీక్ష నిర్వహించనున్నట్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఇటీవల ప్రకటించింది. గతేడాది వెలువడిన ఈ నోటిఫికేషన్ నియామక పరీక్ష వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఈ పరీక్ష ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/అకౌంట్స్ ఆఫీసర్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్
శాఖల్లో 421 ఖాళీలు భర్తీ చేయనున్నారు. 2021 మే 9వ తేదీన పరీక్ష జరుగనుంది. ఈ నేపథ్యంలో.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్ టిప్స్...
యూపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఈపీఎఫ్‌ఓ నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టులకు గ్రాడ్యుయేషన్ చేసినవారు అర్హులు. ఇప్పటికే ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి గతంలోనే జరగాల్సిన ఈ పరీక్ష కోవిడ్ కారణంగా వాయిదా పడింది. దాంతో చాలామంది తమ ప్రిపరేషన్‌ను వాయిదా వేశారు. మే 9వ తేదీన పరీక్ష జరుగనుంది. ప్రస్తుతం తక్కువ సమయమే అందుబాటులో ఉంది. ఈ విలువైన సమయంలో సమర్థంగా ప్రిపరేషన్ సాగిస్తే.. విజయం సాధించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పరీక్ష విధానం
ఈపీఎఫ్‌ఓ పోస్టుల ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో(ఫేజ్–1, ఫేజ్–2) చేపడతారు. మొదటి దశలో ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇందులో ప్రతిభ చూపినవారిని రెండో దశ పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు.
♦ రాత పరీక్ష: ఇది ఆఫ్‌లైన్ అంటే.. పెన్ అండ్ పేపర్ ఆధారిత విధానంలో జరిగే పరీక్ష. ఇందులో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. వీటిని రెండు గంటల్లో పూర్తిచేయాలి. అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3వంతు మార్కు తగ్గిస్తారు. పేపర్ హిందీ, ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
♦ పర్సనల్ ఇంటర్వ్యూ: రాత పరీక్షలో ప్రతిభ చూపినవారిని పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. దీనికి కూడా 100 మార్కులు కేటాయించారు. ఈ విభాగంలో మొత్తం మార్కుల్లో జనరల్ అభ్యర్థులు కనీసం 50మార్కులు, ఓబీసీలు 45, ఎస్సీ/ఎస్టీ /వికలాంగులు 40 మార్కులు సాధించాలి. వీటిని రాత పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులతో కలిసి తుది జాబితా రూపొందిస్తారు. రాత పరీక్షకు 75శాతం, ఇంటర్వ్యూకి 25 శాతం వెయిటేజీ ఇస్తారు.
సిలబస్‌పై ఓ లుక్కేయండి
♦ ఇందులో ప్రధానంగా తొమ్మిది విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
♦ జనరల్ ఇంగ్లిష్: ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, గ్రామర్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రధానంగా క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, పేరా జంబుల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, సెంటెన్స్ కంప్లీషన్, పేరా కంప్లీషన్, స్పెల్లింగ్స్, సినానిమ్స్, యాంటినిమ్స్‌పై ప్రశ్నలు ఉంటాయి.
♦ భారత స్వాతంత్రోద్యమం: 1857 నాటి తిరుగుబాటు–బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్య్ర పోరాటం, భారత జాతీయోద్యమం–కారణాలు,భారత జాతీయవాదం–మితవాద దశ, మింటో–మార్లె సంస్కరణలు, 1905లో బెంగాల్ విభజన, భారత జాతీయోద్యమం–అతివాద దశ, ముఖ్యమైన భారత స్వాతంత్య్ర సమరయోధులు, భారత స్వాతంత్య్రోద్యమంలో విప్లవకారులు, భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ పాత్ర, రౌలత్ చట్టం, జలియన్ వాలాబాగ్ ఘటన, 1916 లక్నో ఒప్పందం, సహాయ నిరాకరణోద్యమం; హోమ్‌రూల్ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, 1921 నాటి మోప్లా తిరుగుబాటు, సైమన్ కమిషన్, స్వరాజ్ పార్టీ, గాంధీ–ఇర్విన్ ఒప్పందం, 1930 మొదటి రౌండ్ టేబుల్ సమావేశం, పూనా ఒడంబడిక, క్రిప్స్ మిషన్; క్విట్ ఇండియా ఉద్యమం, భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు, 1947 భారత స్వాతంత్య్ర చట్టంపై ప్రశ్నలు ఉంటాయి.
♦ కరెంట్ ఈవెంట్స్: ఈ విభాగంలో జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు,క్రీడలు, అవార్డులు–వాటి ప్రాముఖ్యత, రాజకీయాలు, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ రంగం, జనాభా గణన, ముఖ్యమైన పుస్తకాలు–వాటి రచయితలు, స్టేట్ యానిమల్స్ అండ్ సింబల్స్, నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తల పేర్లు–వారి ఆవిష్కరణలు, ముఖ్యమైన తేదీలు, ప్రధానమైన ఆవిష్కరణలు–ఆవిష్కర్తల గురించి ప్రశ్నలు వస్తాయి.
♦ ఇండియన్ పాలిటీ–ఎకానమీ: సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఎన్నిక–విధులు, కాగ్ వంటి ముఖ్యమైన రాజ్యాంగ సంస్థలు, పార్లమెంటు గురించి వాస్తవాలు, ప్రాథమిక విధులు, గవర్నర్–విధులు, రాష్ట్ర శాసనసభ, ప్రధాన రాజ్యాంగ సవరణలు–వాటి ప్రాధాన్యం, అధికార భాషలు, అత్యవసర నిబంధనలు, జాతీయ రాజకీయ పార్టీలు–వాటి చిహ్నాలు నుంచి ప్రశ్నలు ఉంటాయి.
♦ జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపుల్స్: ఇందులో అకౌంటింగ్ కాన్సెప్ట్స్ విభాగంలో.. సెపరేట్ ఎన్‌టిటీ కాన్సెప్ట్, మనీ మెజర్‌మెంట్ కాన్సెప్ట్, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, డ్యూయల్ యాస్పెక్ట్ కన్సర్న్, రియలైజేషన్ కాన్సెప్ట్, కాస్ట్ కాన్సెప్ట్, అకౌంటింగ్ పిరియడ్ కాన్సెప్ట్, మ్యాచింగ్ కాన్సెప్ట్ అంశాలు ఉన్నాయి. అకౌంటింగ్ కన్వెన్షన్ విభాగంలో.. కన్సర్వేటిజం, కన్సిస్టెన్సీ, ఫుల్ డిస్‌క్లోజర్, మెటీరియాలిటీ అంశాలను పరిశీలించాలి.
♦ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్: ఈ విభాగంలో భారత రాజ్యాంగం– కార్మికుల నిబంధనలు, మహిళా కార్మికుల కోసం చట్టాలు–ప్రసూతి ప్రయోజన చట్టం, విశాఖ కేసు, ఫ్యాక్టరీల చట్టం, సమాన వేతన చట్టం, భారతదేశంలో కార్మిక చట్టం, కనీస వేతనాల చట్టం, సమ్మెలు, లాకౌట్లు, పారిశ్రామిక వివాదాల చట్టం (ఐడీఏ), లేబర్ కోర్టులు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునళ్లు, కార్మికుల నష్టపరిహార చట్టం, ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ చట్టం, పదవీ విరమణ ప్రయోజనాలు, వలస చట్టం, అసంఘటిత కార్మికులు, అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ), భారతదేశంలో కార్మిక మంత్రిత్వశాఖ–కార్మిక మంత్రిత్వశాఖలో ముఖ్యమైన కార్యాలయాలు/సంస్థలు, ప్రధాన కార్మిక కమిషనర్, లేబర్ బ్యూరో, వెల్ఫేర్ కమిషనర్లు, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ), ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ), బోర్డ్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.
జనరల్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్‌పై పరిజ్ఞానం: జనరల్ సైన్స్ విభాగంలో..బయాలజీ నుంచి మానవ శరీర భాగాలకు సంబంధించిన ముఖ్యమైన, ఆసక్తికరమైన వాస్తవాలు, జంతువులు, మొక్కల పోషణ, వ్యాధులు–వాటికి కారణాలు ఉంటాయి.
► ఫిజిక్స్ నుంచి ఎస్‌ఐ ప్రమాణాలు, చలనం, ధ్వని, కాంతి, తరంగం, శక్తి, విద్యుచ్ఛక్తి, కెమిస్ట్రీ నుంచి రసాయనిక ధర్మాలు–వాటి ఉపయోగాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ మొదలైన ముఖ్యమైన పదార్థాల రసాయనిక నామాలు, రసాయన మార్పు–భౌతిక మార్పు, వాయువుల ధర్మాలు, ఉపరితల రసాయనశాస్త్రం, నిత్యజీవితంలో రసాయన శాస్త్రం ఉంటాయి.
► కంప్యూటర్స్ డెవలప్‌మెంట్,ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ పరికరాలు, మెమొరీ, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్‌నెట్ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
► జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో.. జనరల్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్’ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
జనరల్ మెంటల్ ఎబిలిటీ: సీక్వెన్స్ ఆఫ్ ఫిగర్స్, సిరీస్, రక్త సంబంధాలు, దిక్కులు, సిలోజిజం, సీటింగ్ అరేంజ్‌మెంట్, పజిల్ టెస్ట్, స్టేట్‌మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్‌మెంట్ అండ్ ఇన్ఫెరెన్సెస్, డేటా సఫిషియెన్సీపై ప్రశ్నలు ఉంటాయి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: ఆల్జీబ్రా, హెచ్‌సీఎఫ్ అండ్ ఎల్‌సీఎం, యావరేజెస్, మిక్చర్స్ అండ్ అలైగేషన్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్టనర్‌షిప్, పర్సంటేజ్ అండ్ ఇట్స్ అప్లికేషన్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ఏజెస్, క్యాలెండర్ అండ్ క్లాక్, ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంశాలను పరిశీలించాలి.
సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా: ఇందులో భారతదేశంలో సామాజిక భద్రత, అసంఘటిత రంగానికి సామాజిక భద్రత పథకాలు, పెన్షన్, ఆరోగ్య బీమా–వైద్య ప్రయోజనం, వైకల్య బెనిఫిట్, ప్రసూతి బెనిఫిట్, గ్రాట్యుటీ వంటి సామాజిక సామాజిక భద్రతా పథకాలు, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ), ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఈఎస్‌ఐసీ), అటల్ పెన్షన్ యోజన(ఏపీవై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎం జేజేబీఈ), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన(పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) యోజన, ప్రధానమంత్రి కిసాన్ మంధాన్ యోజన మొదలైన పథకాలపై ప్రశ్నలు వస్తాయి.
పాత పేపర్ల సాధన
రాత పరీక్షను మే 9వ తేదీన నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. దీనిప్రకారం చూస్తే మొత్తం సిలబస్ పూర్తి చేయడానికి ఉన్న సమయం సుమారు 45 రోజులు మాత్రమే. ఇంత తక్కువ సమయంలో సిలబస్‌ను పూర్తిచేయాల్సి రావడం కత్తిమీద సాములాంటిదే. అందువల్ల సీరియస్‌గా ప్రిపేర్ అయ్యే అభ్యుర్థులు ఇప్పటికే పూర్తి చేసిన సిలబస్‌ను మరోసారి రివిజన్ చేసుకుంటూ.. పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. తప్పు సమాధానానికి నెగిటివ్ మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. ప్రతిరోజు మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ కోసం నిర్ణీత సమయం కేటాయించుకోవాలి. ఏ విభాగంలో వెనుకబడి ఉన్నారో గుర్తించి.. ఆయా టాపిక్స్‌పై అధిక సమయం కేటాయించి చదవాలి.
Comments
Please login to add a commentAdd a comment