‘ఆడపిల్లలు సైకిల్ తొక్కడమేమిటి!’ అని ఆశ్చర్యపోయే కుటుంబాల్లో పుట్టారు గరీమ శంకర్, రేణు సింఘీలు చిన్నప్పుడు సైకిల్‌ను చూడడం తప్ప నడిపింది లేదు. సైకిల్‌పై జెట్ స్పీడ్‌తో దూసుకుపోయేవాళ్లను చూసి ఆశ్చర్యపడేవారు. అలాంటి వారు సైకిలింగ్‌లో అద్భుతాల సృష్టిస్తారని ఎవరూ ఊహించలేదు. ‘గోయింగ్ సోలో’ డాక్యుమెంటరీలో వారి అంతర్. బహిర్ ప్రయాణం ఉంటుంది. నాలుగు గోడల మధ్య ఇంటికి పరిమితమైన రోజుల నుంచి లండన్–ఎడిన్‌బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్)లాంటి ప్రతిష్ఠాత్మకమైన సైకిలింగ్ ఈవెంట్స్ వరకు చేసిన ప్రయాణం కళ్లకు కడుతుంది.
‘వారి జీవితాల్లో సైకిలింగ్‌కు మించి చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి అనిపించింది. వారి జీవితాల్లోని అద్భుతాలను ఆవిష్కరించడానికి సైకిల్ అనేది ఒక సాధనం మాత్రమే’ అంటాడు ‘గోయింగ్ సోలో’ డైరెక్టర్ అమీ గోర్. ఢిల్లీలోని ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన గరీమకు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు తప్ప ఏ లోటూ లేదు. టీనేజ్‌లో ఉన్నప్పుడు అందరిలాగా తాను కూడా రోడ్డు మీద సైకిల్ తొక్కాలనుకునేది. సైకిల్ తొక్కడం మాట ఎలా ఉన్నా ఇల్లు దాటి బయటికి రావడమే గగనంగా ఉండేది. తల్లిదండ్రులు ఆమెను పొరపాటున కూడా బయటికి పంపేవారు కాదు.
గరీమకు పెళ్లి అయింది. ఆ తరువాత ఒక బిడ్డకు తల్లి అయింది. బాగా బరువు పెరిగింది. అది తనకు చాలా ఇబ్బందిగా మారింది. బరువు తగ్గడానికి మార్గాల గురించి ఆలోచిస్తున్న సమయంలో తనకు ఇష్టమైన సైకిలింగ్ గుర్తుకు వచ్చింది. టీనేజ్‌లో ఉన్నప్పుడు తమ్ముడి ద్వారా సైకిల్ తొక్కడం నేర్చుకుంది. అయితే ఆమె సైకిల్ యాత్ర ఇంటిపరిసరాలకే పరిమితం. బరువు తగ్గడం మాట ఎలా ఉన్నా సైకిలింగ్ ద్వారా తాను ఒంటరిగా రోడ్డు మీదికి వచ్చింది. నగరంలో ప్రతి వీధిని చూసే అవకాశం వచ్చింది. అంతా కొత్తగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉంది! ఇక అప్పటి నుంచి రెగ్యులర్ రైడర్‌గా మారింది. సైకిల్ లేకుండా ఆమెను చూడడం అరుదైపోయింది.
సైకిలింగ్‌పై గరీమ ఆసక్తిని గమనించిన సన్నిహితులు ‘లక్ష్యం ఏర్పాటు చేసుకో. విజయం సాధించు’ అని చెప్పేవారు. దీంతో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి కొత్త అడుగులు వేసింది. సైకిల్ ఈవెంట్స్‌లో పాల్గొనడం ప్రారంభించింది. ఆ రేసులను విజయవంతంగా పూర్తి చేసిన తరువాత తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చేది. తెలిసినవాళ్లు లండన్–ఎడిన్‌బర్గ్–లండన్ (ఎల్‌ఈఎల్) సైకిల్ ఈవెంట్‌కు ప్రిపేర్ అవుతున్న సమయంలో షెడ్యూల్‌కు మూడు నెలల ముందు తన పేరును రిజిస్ట్రేషన్ చేయించుకుంది.
‘నిజానికి అదొక అసాధ్యమైన లక్ష్యం. కాని ఏదో ధైర్యం నన్ను ముందుకు నడిపించింది’ అంటున్న గరీమ ఎల్‌ఈఎల్‌లో 125 గంటలలో 1,540 కిలోమీటర్లు దూరం సైకిలింగ్ చేసింది. గరీమ ఉత్సాహం, సాహసానికి ముచ్చటపడిన ఎల్‌ఈఎల్ కమ్యూనిటీ ఆమెను మెడల్‌తో సత్కరించింది. ఇక రాజస్థాన్‌కు చెందిన రేణు సింఘీ విషయానికి వస్తే పెళ్లికి ముందు అంతంత మాత్రంగా ఉన్న స్వేచ్ఛ ఆ తరువాత పూర్తిగా పోయింది. వంట నుంచి పిల్లల పెంపకం వరకు పూర్తిగా ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. తన కుమారుడికి సైకిల్ కొనడానికి ఒకరోజు బైక్‌షాప్‌కు వెళ్లింది.
తన కోసం కూడా ఒక సైకిల్ కొన్నది. అప్పటికి ఆమె వయసు 52 ఏళ్లు. ‘ఈ వయసులో సైకిల్ తొక్కడమేమిటి’ అనేవారు కుటుంబసభ్యులు. అయితే అవేమీ పట్టించుకోకుండా లాంగ్–డిస్టెన్స్ సైకిలింగ్ ఈవెంట్స్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచేది. ఆ తరువాత ఇంటర్నేషనఃల్ ఈవెంట్స్‌పై దృష్టి పెట్టింది. ‘మనకు నచ్చింది చేయాలి. వయసు అనేది అడ్డు కాదు’ అంటున్న సింఘీ ఎల్‌ఈఎల్–ఈవెంట్ విజయవంతంగా పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. అమ్మీ మీడియా (న్యూయార్క్), ఖాన్ అండ్ కుమార్ మీడియా (ఇండియా) నిర్మించిన ‘గోయింగ్ సోలో’ను దిల్లీ, ఊటీ, జైపుర్, జోద్‌పూర్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌లో చిత్రీకరించారు.
70 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీకి అమీ గోర్ దర్శకుడు. టీవి, షార్ట్‌ఫిల్మ్, డాక్యుమెంటరీలలో పదిసంవత్సరాల అనుభవం ఉంది. ‘వారి అనుభవాలు, ప్రయాణం నన్ను ఎంతో ఉద్వేగానికి గురిచేశాయి. రకరకాల పరిస్థితులు లేదా వయసును కారణంగా చూపి తమకు తాము రకరకాల పరిమితులు విధించుకునే ఎంతోమందికి ఈ డాక్యుమెంటరీ స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నాడు డైరెక్టర్ అమీ గోర్.
(చదవండి: చూసే కన్ను బట్టి అర్థం మారుతుంది..ట్రై చేయండి అదేంటో!)
Comments
Please login to add a commentAdd a comment