పత్తి పంటను ఇటీవల పరిశీలిస్తున్న దేవేంద్ర శర్మ
'రసాయన మందులేమీ వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో బీటీ హైబ్రిడ్ సీడ్ పత్తిని సాగు చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు రైతు ఏకుల లక్ష్మీనారాయణ. వ్యవసాయమే జీవనంగా బతుకుబండిని నడిపిస్తున్న లక్ష్మీనారాయణ తనకు కౌలుకు ఇచ్చిన భూ యజమాని కోటగిరి చైతన్య సూచనల మేరకు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో బీటీ హైబ్రిడ్ విత్తన పత్తిని రెండేళ్లుగా సమర్ధవంతంగా చేస్తూ విశేషమైన దిగుబడులతో పాటు అధిక నికరాదాయం పొందుతున్నారు.'
లక్ష్మీనారాయణది ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట. శివారు గ్రామమైన సీతారామపురంలో కోటగిరి చైతన్య మామిడి తోటకు పక్కనే ఉన్న మూడెకరాల ఎర్ర నేలను కౌలుకు తీసుకొని విత్తన పత్తిని రెండేళ్లుగా సాగుచేస్తున్నారు. ఒక ఎకరానికి డ్రిప్ వేశారు. రెండెకరాలకు నీటిని పారగడుతున్నారు. 120 రోజుల దశలో ఉన్న పత్తి మొక్కలన్నీ ఆరోగ్యంగా ఎదుగుతూ ఇంకా కొత్త చిగుర్లు వేస్తున్నాయి. మొక్కకు 90 నుంచి 110 వరకు కాయలతో చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. తనకు దిగుబడి 12 నుంచి 14 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎకరాకు రూ.20 వేల చొప్పున మూడెకరాలకు రూ.60 వేలకు కౌలుకు తీసుకొని విత్తన పత్తిని సాగు చేస్తున్నారు.
బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న చైతన్య కరోనా కాలంలో ఇంటి దగ్గర ఉన్న కాలంలో సేంద్రియ సాగులో మెళకువలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. ఇప్పుడు బెంగళూరు తిరిగి వెళ్లినా అక్కడి నుంచే లక్ష్మీనారాయణకు సూచనలిస్తూ పత్తి సాగు చేయిస్తున్నారు. ఆవు పేడతో జీవామృతం, అనేక రకాల జీవన ఎరువులు కలిపి మగ్గబెట్టి ప్రత్యేకంగా రూపొందించిన ఎన్‌రిచ్డ్ కంపోస్టును మూడెకరాల్లో దుక్కి 3 టన్నులు వేశారు. పత్తి విత్తిన 20 రోజులకు మరో 3 టన్నుల కం΄ోస్టును మొక్కల మొదళ్ల వద్ద వేశారు. లింగాకర్షక బుట్టలు, జిగురు అట్టలతో సమీకృత చీడపీడల యాజమాన్య మెళకువలు పూర్తిగా పాటిస్తున్నారు. పంచగవ్య, పుల్లటి మజ్జిగతోపాటు అగ్నిస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం తదితర కషాయాలను విడతల వారీగా లక్ష్మీనారాయణ సొంతంగా తయారు చేసుకుంటూ ఐదు రోజులకోసారి ఏదో ఒకటి అవసరాన్ని బట్టి పిచికారీ చేస్తున్నారు. దీంతో పత్తి మొక్కలు విత్తి 120 రోజులు అయినప్పటికీ ఇంకా బలంగా ఎదుగుతున్నాయి. అంతేగాకుండా ఒక్కొక్క చెట్టుకు కాయలు కూడా అధిక సంఖ్యలో వచ్చాయి.
నెలకొరిగినా తిప్పుకుంది!
డిసెంబర్ మొదటి వారంలో వచ్చిన మిచాంగ్ తుఫానుకు మూడెకరాల్లోని పత్తి పంటంతా నేల వాలింది. దీంతో రైతు లక్ష్మీనారాయణ తీవ్రమైన ఆందోళనకు గురయ్యారు. ఏదైతే అది అవుతుందని.. పడిపోయిన మొక్కలను కూలీలతో లేపి నించోబెట్టి మొదళ్లలో మట్టిని వేయించారు. ఆ తర్వాత రెండు రోజులకే తోటంతా ఆశ్చర్యకరంగా నిలదొక్కుకుంది. వానపాములు నేలను గుల్లగా ఉంచటం, వేరువ్యవస్థ బలంగా, లోతుగా ఉండటం వల్లే ఇది సాధ్యమైందని రైతు చెప్పారు. ఎంతో ఆరోగ్యంగా పెరుగుతున్న ఈ పంటను ఇటీవల పరిశీలించిన ప్రసిద్ధ వ్యవసాయ నిపుణులు దేవేంద్ర శర్మ, డా. జీవీ రామాంజనేయులు, పాలాది మోహనయ్య తదితరులు లక్ష్మీనారాయణ కృషిని ప్రశంసించారు. ఇతర రైతులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఆకాంక్షించారు.
మిచాంగ్ తుఫాను గాలులకు నేలకొరిగిన లక్ష్మీనారాయణ పత్తి పంట (ఫైల్)
3 ఎకరాల్లో విత్తన పత్తి సాగు: రూ. 7 లక్షల నికరాదాయం!
3 ఎకరాల పొలంలో విత్తన పత్తి క్రాసింగ్ కోసం అరెకరంలో పోతు (మగ) మొక్కల్ని పెంచుతున్నాను. అంటే.. నికరంగా 2.5 ఎకరాల్లోనే పత్తి పంట ఉన్నట్లు లెక్క. చెట్టుకు సగటున 90–100 కాయలున్నాయి. మొదటి విడత పత్తి తీశాం. మరో మూడుసార్లు తీస్తాం. ఎకరానికి 12–14 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనుకుంటున్నాం. కనీసం 30 క్వింటాళ్ల సీడ్ పత్తి వస్తుందనుకున్నా.. 18 క్వింటాళ్ల పత్తి విత్తనాలు, 12 క్వింటాళ్ల దూది వస్తుంది. విత్తనాలు క్వింటా రూ. 53,000, దూది క్వింటా రూ. 14,000కు అమ్ముతా. మొత్తం మీద రూ. 4.5 లక్షల ఖర్చులు పోగా నికరాదాయం రూ. 7 లక్షలకు తగ్గదు. తుఫాను దెబ్బకు కొన్ని కాయలు పాడవ్వకపోతే మరో రూ. లక్ష అదనంగా వచ్చి ఉండేది.
– ఏకుల లక్ష్మీనారాయణ (95509 84667), అన్నేరావుపేట,రెడ్డిగూడెం మండలం, ఎన్టీఆర్ జిల్లా
– ఉమ్మా రవీంద్ర కుమార్ రెడ్డి, సాక్షి, నూజివీడు
(చదవండి: రైతు శాస్త్రవేత్త విజయకుమార్‌కు ‘సృష్టి సమ్మాన్’ పురస్కారం)
Comments
Please login to add a commentAdd a comment