ఆభరణాలు ఎన్ని ఉన్నా ఆ ఒక్క అలంకారం తక్కువైతే అందానికి పరిపూర్ణత చేకూరదు. ఆ ఒక్కటే ముక్కుపుడక లేదా ముక్కెర. వేడుకలలో ప్రత్యేకంగా వెలిగిపోతూ నోస్‌పిన్‌గా స్టైల్‌లో తనదైన శైలిని చూపుతూ మురిపెంగా మెరిసిపోయే ముక్కున సింగారపు వేడుకలకు ప్రత్యేకం. వ్యక్తిగత శైలికి బలమైన ప్రతిబింబంగా నిలిచే ముక్కెర ఎంపిక కోసం కొన్ని కసరత్తులు చేయాల్సిందే. గుండ్రని ముఖం ఉన్న మహిళలు పొడవుగా ఉండే నోస్‌రింగ్ ఎంచుకోవడం మంచిది. అలాగే, ముఖం కోలగా ఉండేవారు గుండ్రని నోస్పిన్ డిజైన్స్ ఎంచుకుంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు.
సంప్రదాయంలో మెరుపు
బ్రైడల్ కలెక్షన్‌లో భాగంగా స్వచ్ఛమైన బంగారు, డైమండ్ ముక్కు ఆభరణాలను ఎంచుకుంటుంటారు. అయితే గ్రాండ్‌గా ఉండేందుకు బంగారం, డైమండ్, ముత్యాలు, ఇతర రత్నాలతో ఉండే ముక్కెరలను ఎంచుకోవచ్చు. ఇటీవల బ్రైడల్ నోస్ రింగ్స్‌లో డిజైన్స్ సందర్భానికి తగ్గట్టుగా ఉంటున్నాయి.
ఆధునిక శైలి
వృత్తి, ఉద్యోగాలలో ఉంటున్న మహిళలైతే ఎలాంటి హంగులూ లేని సింపుల్ డిజైన్స్ ఇష్టపడుతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో డ్రెస్సులకు తగినట్టు మార్చుకోగలిగే ట్రెండింగ్ డిజైన్స్‌ను ఎంచుకుంటున్నారు. వీటిలో అన్ని రకాల స్టోన్స్‌కు మాత్రమే కాదు సిల్వర్, స్టీల్ నోస్‌రింగ్స్‌కు ఓటేస్తున్నారు. వీటిలో సెంట్రల్ నోస్ రింగ్స్ మరింత ట్రెండీగా మారాయి.
రాష్ట్రాల వారీగా...
మహారాష్ట్రీయుల ముక్కెర చంద్రవంక లేదా జీడిపప్పు ఆకారాన్ని పోలి ఉంటుంది. ముత్యాలూ, వజ్రాలు, రాళ్లు, పూసలు జత చేసి ఉంటాయి. మహారాష్ట్ర పెళ్లికూతురు కేవలం ముక్కెర కోసమే వధువు కావాలని కోరుకునేంత అందంగా ఉంటుంది. హిమాలయ ప్రాంతాల మహిళలు బులక్ అనే పేరున్న వెడల్పాటి నోస్ రింగ్స్‌ను ఎంచుకుంటారు. పంజాబీయుల నథ్ అనే పేరు గల ముక్కు ఉంగరాలు చాలా తేలికగా ఉంటాయి. గుజరాత్, రాజస్థాన్ మహిళల నోస్ రింగ్స్ కూడా నథ్ లేదా నాథూరి అని పిలిచే నోస్ రింగ్స్‌ను పోలి ఉంటాయి.
ఇవి బంగారం లేదా వెండితో ఉంగరంలా తయారుచేస్తారు. వీటిలో విలువైన రత్నాలను పొదుగుతారు. వేడుకలలో ధరించేవి పెద్దవిగా ఉంటాయి. ముక్కు నుంచి జుట్టుకు జత చేసే గొలుసు ఉన్న నోస్ రింగ్స్‌ను కూడా వాడుతుంటారు. ఇవి బ్రైడల్, ప్రత్యేక సంప్రదాయ వేడుకల అలంకారాలలో కనిపిస్తుంటాయి. ప్రాచీన భారతీయ రాజకుటుంబీకులు వీటిని ధరించేవారు. ఆ తర్వాతి కాలాల్లో పెళ్లి కూతురు అలంకరణలో భాగమైంది.
ఉత్తరాఖండ్ మహిళల ఆభరణాల్లో నోస్ రింగ్‌ను టెహ్రీ నథ్ అని పిలుస్తారు. దీని అలంకారం అద్భుతంగా చెప్పుకుంటారు. ఈ నోస్ రింగ్‌లో విలువైన కెంపులు, ముత్యాలతో పొదిగిన వెడల్పాటి బంగారు తీగ ఉంటుంది. నెమలి డిజైన్స్ కూడా ఇందులో చూస్తాం. ఇక్కడి వివాహిత మహిళలు ఈ నోస్ రింగ్‌ను శుభప్రదంగా భావిస్తారు. ఆభరణాల కళాత్మకతలో ఈ నోస్ రింగ్‌ను ప్రత్యేకంగా చెప్పుకుంటారు. తామర పువ్వు, హంస ఆకారంలో ఉన్న ముక్కెరలు గోవా, కోంకణ్ ప్రాంతాల వధువులు ఎంపిక చేసుకుంటారు. ఈ డిజైన్స్ కర్నాటక, కేరళలో కూడా ధరిస్తారు.
దక్షిణాన శాశ్వతం
తెలుగు, తమిళ, కన్నడ రాష్ట్రాలలో ముక్కు ఉంగరాల కన్నా స్టడ్స్‌కే ప్రాధాన్యత. డైమండ్స్, కెంపులు, బంగారంతో తయారుచేసినవి ఉంటాయి. దక్షిణ భారత దేశాన ముక్కుపుడక ఒక శాశ్వత ఎంపికగా ఉంటుంది. ముక్కుపుడక అందం వారి అనుభవంతో కలిసి ప్రకాశిస్తుందా అన్నట్టుగా ఉంటుంది.
(చదవండి: అతియా, అనుష్కాలు ధరించిన టాప్ ధర వింటే..షాకవ్వాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment