సాధారణంగా వేసవి వచ్చేదంటే అమ్మో!.. ఉక్కపోతా అంటూ అరిచేస్తాం. ఏసీలు, కూలర్‌లు పెట్టేసి.. వేలల్లో కరెంట్ బిల్లులు కట్టేసి హమ్మయ్యా అనుకుంటాం. జేబు చిల్లు పెట్టుకోవడానికి రెడీ అయిపోతాం గానీ సహజసిద్ధంగా ఇంటిని ఎలా కూల్‌గా ఉంచుకోవచ్చో ఆలోచించం. ఎందకంటే ఎలాగో విద్యుత్ సౌకర్యం, డబ్బులు కట్టే సామర్థ్యం రెండు ఉన్నాయి. ఇక మరో ఆలోచన కాదు గదా!.. ఆ పదం వరకు కూడా వెళ్లం. కానీ ఈ ఎడారి దేశంలోని ఓ నగరం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలవడమేగాక దాని వినూత్న ఆలోచన విధానంతో అందనంత ఎత్తులో ఉంది ఆ నగరం.
వివరాల్లోకెళ్తే..ఇరాన్‌లో ఎడారి నగరమైన యాజ్డ్‌లో వేడి అలా ఇలా ఉండదు. తట్టుకోవడం చాల కష్టం, కనీస అవసరాలు ఉండవు. పైగా కావల్సినంత విద్యుత్ కూడా ఉండే అవకాశమే లేదు కూడా. అలాంటి ఆ ప్రాంతం అందుబాటులో ఉన్న వనరులతోటే అద్భుతాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. పైగా 2017లో యునెస్కోలో వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఇంతకీ ఆ నగరంలో అంత గొప్పగా ఏముందంటే..ఆ నగరంలో ఇళ్లన్ని ఎత్తులో ఉండి పైన చిమ్నీ లాంటి టవర్లు ఉంటాయి. వేడి గాలిని ఇంట్లోకి రాకుండా నిరోధించి, చల్లగా ఉండేలా చేస్తుంటాయి ఆ టవర్లు. ఒకరకంగా చెప్పాలంటే వాటిని 'సహజసిద్ధమైన ఏసీ'లని చెప్పొచ్చు. నివాసాలను చల్లబర్చడానికి వీలుగా వీటిని ఏర్పాటు చేశారు.
వీటిని విండ్ క్యాచర్‌లు అంటారు. ఇది మధ్యప్రాచ్యంలోని పర్షియన్ సామ్రాజ్య కాలం నాటి నిర్మాణంగా భావిస్తారు నిపుణులు. నిజానికి వేసవిలో అక్కడ సుమారు 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు ఉంటాయి. దీంతో శతాబ్దాలకు ముందే అప్పటి వాళ్లే ఇళ్లను కూల్‌గా ఉంచడానికి వీలుగా ఇలాంటి నిర్మాణంలో ఇళ్లను నిర్మించారు. ప్రజలు దాన్ని ఇప్పటకీ కొనసాగిస్తుండటం విశేషం. విద్యుత్ గురించి తెలియక మునుపే మా పూర్వికులు ఇలాంటి ఇళ్లను కనుగొన్నారు, దాన్నే మేము కొనసాగించడమే కాకుండా ఆ వారసత్వాన్ని కాపాడుకుంటున్నాం అని గర్వంగా ఇరాన్ పర్యాటక మంత్రిత్వ శాఖ డిప్యూటీ అబ్డోల్మాజిద్ షాకేరి చెబుతున్నారు. ఇక్కడ ఇళ్లపై ఉండే 'విండ్ క్యాచర్'(చల్లటి గాలిని ఇచ్చేవి) టవర్లు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి.
తమ పూర్వీకులు చెదపురుగుల గూడుని బేస్ చేసుకుని ఇలా ఇళ్లను నిర్మించినట్లు ఇరాన్ వాసులు చెబుతున్నారు. ఈ ఇళ్లు ఆధునిక సిమెంట్ భవనాలకు అత్యంత విరుద్ధం. ఇవి బంకమట్టి ఇటుకతో నిర్మించే శతాబ్దాల నాటి సంప్రదాయ రీతి కట్టడాల నిర్మాణం. ఇక్కడ ఇంకో అద్భుతమైన నిర్మాణం ఉంది. అది భూగర్భ జల వ్యవస్ధ. దీన్ని ఖానాట్స్ అని పిలుస్తారు. భూగర్భ బావులు, లేదా చిన్న కాలువలు అని చెప్పొచ్చు.
అక్కడ ఇళ్లు వేడి ఎక్కకుండా ఉండటానికి ఇవి కూడా ఒక కారణం అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇరాన్‌లో ప్రస్తుతం 33వేల ఖానాట్‌లు ఉన్నాయని చెబుతున్నారు. ఇరాన్ అధికారులు ఈ ఖానాట్స్‌లను ఎండిపోకుండా పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగతా దేశాలు ఇలాంటి ప్రకృతిసిద్ధంగా లభించే గాలిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తే మంచి గాలి పీల్చి ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే గాక వాతావరణంలో కార్బన్ స్థాయిలు తగ్గించినవాళ్లము అవుతాం కదా ఆలోచించండి!.
(చదవండి: టాయిలెట్ క్లీనర్.. కానీ మనం కూల్‌డ్రింక్స్‌లా తాగేస్తున్నామా..!)
Comments
Please login to add a commentAdd a comment