మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, బాధితుల న్యాయపోరాటం, పోరాటం చేసే క్రమంలో పడుతున్న కష్టాలు... అయినప్పటికీ వెనకడుగు వేయని పట్టుదలకు ‘టు కిల్ ఏ టైగర్’ డాక్యుమెంటరీ అద్దం పడుతుంది. ఝార్ఖండ్‌లోని ఒక గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా నిషా పహుజా తీసిన ఈ చిత్రం టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచిపామ్ స్ప్రింగ్స్ ఫిల్మ్ ఫెస్టివల్(2023) వరకు ‘బెస్ట్ డాక్యుమెంటరీ’గా ప్రశంసలు అందుకుంటూనే ఉంది...
పదమూడు సంవత్సరాల తన కూతురిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారని పోలిస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తాడు రంజిత్ అనే రైతు. పోలీసుల స్పందన అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇక చుట్టాలు, పక్కాలు, గ్రామస్థుల విషయానికి వస్తే...‘జరిగిందేదో జరిగింది. పోయేది మీ కుటుంబ పరువే. కేసు వెనక్కి తీసుకోండి’‘మీ సంగతి ఏమిటోగానీ మన కులం పరువు పోయేట్లు ఉంది. కేసు వెనక్కి తీసుకోండి’‘మన జాగ్రత్తలో మనం ఉండకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతాయి. వారిని మనం ఏం చేయలేము. కేసు వెనక్కి తీసుకోండి’ఎవరు ఎలా స్పందించినా, ఆ స్పందనలో చివర గట్టిగా వినిపించే మాట... కేసు వెనక్కి తీసుకోండి.
అయితే రంజిత్ వీరి ఉచిత సలహాలను పట్టించుకోలేదు. పోరాటదారిని వదలలేదు. ఈలోపు బెదిరింపులు పెరిగాయి. ‘కేసు ఉపసంహరించుకుంటావా లేదా?’ అని గ్రామస్థులనుంచి ఒత్తిడి పెరిగింది. రంజిత్ చేస్తున్న న్యాయపోరాటానికి శ్రీజన ఫౌండేషన్ అండగా నిలిచింది. మహిళల హక్కుల గురించి పనిచేస్తున్న స్వచ్ఛందసంస్థ ఇది. స్థూలంగా చెప్పాలంటే ‘టు కిల్ ఏ టైగర్’ అనే డాక్యుమెంటరీ కథ ఇది.అయితే ఇది కాల్పనిక కథ కాదు.ఝార్ఖండ్‌లోని బెరో జిల్లాలో జరిగిన వాస్తవ సంఘటనల సమాహారం.డైరెక్టర్, రైటర్ నిషా పహుజా ‘టు కిల్ ఏ టైగర్’ రూపకర్త.కెనడియన్ ఫిల్మ్‌మేకర్‌గా గుర్తింపుపొందిన నిషా దిల్లీలో పుట్టింది. కెనడాలోని టోరంటోలో పెరిగింది.
చిన్నవయసులోనే తల్లిదండ్రులతోపాటు కెనడాకు వెళ్లిన నిషా తన భారతీయ మూలాలను ఎప్పుడూ మరచిపోలేదు. బాలీవుడ్ సినిమాలు చూస్తూనే పెరిగింది.‘యూనివర్శిటీ ఆఫ్ టోరంటో’లో ఇంగ్లీష్ సాహిత్యాన్ని చదువుకున్న నిషా రకరకాల సామాజిక ఉద్యమాల్లోపాల్గొంటోంది. డాక్యుమెంటరీ రీసెర్చర్‌గా పేరు తెచ్చుకుంది.కాలేజీ రోజుల నుంచే నిషాకు రచన, దర్శకత్వం అనేవి ఇష్టమైన సబ్జెక్ట్‌లు.
కెరీర్ ప్రారంభంలో రీసెర్చర్‌గా కెనడియన్ ఫిల్మ్‌మేకర్స్ జాన్ వాకర్, అల్ కజిమ్‌లతో కలిసి పనిచేసిన నిషా చిత్ర నిర్మాణంపై కొంత అవగాహన, అనుభవం వచ్చాక డైరెక్టర్‌గా అడుగులు వేసింది. తక్కువ కాలంలో డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. కమర్షియల్ డైరెక్టర్‌గా రాణించాలనేది ఆమె కల కాదు.
వాస్తవ సంఘటనలనే చిత్రాలుగా తీయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ‘చిత్రం ఎంత వాస్తవికంగా ఉంటే ప్రేక్షకులు అంతగా కనెక్ట్ అవుతారు’ అంటుంది నిషా. 2012లో వచ్చిన ‘ది వరల్డ్ బిఫోర్ హర్’ డాక్యుమెంటరీ ఆమెలో రచన, దర్శకప్రతిభను ప్రపంచం దృష్టికి వచ్చేలా చేసింది. భారతీయ సమాజానికి చెందిన అమ్మాయిల జీవితంలో సంక్లిష్టతలు, వైరుధ్యాలను ఆధారంగా చేసుకొని తీసిన ఈ డాక్యుమెంటరీ వివాదాస్పదం కావడంతోపాటు ఎంతో చర్చను రేకెత్తించింది.
ఇక ‘టు కిల్ ఏ టైగర్’ విషయానికి వస్తే మొదట ఈ చిత్రాన్ని తీయాలనుకోలేదు నిషా. ఝార్ఖండ్‌లోని ఒక స్వచ్ఛందసంస్థ చేపడుతున్న కార్యక్రమాల గురించి చిత్రం చేయాలని రంగంలోకి దిగినప్పుడు 13 సంవత్సరాల అమ్మాయి అత్యాచారానికి గురైన సంఘటన గురించి విన్నది. బాధితురాలు, ఆమె తండ్రితో మాట్లాడింది. మొదట తాను తీస్తున్న చిత్రంలో భాగంగానే బాధితురాలి గురించి చెప్పా లనుకుంది. అయితే ఆ తరువాత మాత్రం ఈ సంఘటననే చిత్రంగా తీయాలని నిర్ణయించుకుంది.
టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్‌ఫెస్టివల్ నుంచి (హాట్ డాక్స్) కెనడియన్ ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫెస్టివల్ వరకు ఎక్కడో ఒకచోట ‘టు కిల్ ఏ టైగర్’ గురించి ప్రస్తావన, ప్రశంస వినిపిస్తూనే ఉంది. ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment