కొలనుకు కొలువు | Madhulika Started My Earth My Responsibility Program In Hyderabad | Sakshi
Sakshi News home page

కొలనుకు కొలువు

Published Mon, Jul 27 2020 2:10 AM | Last Updated on Mon, Jul 27 2020 2:10 AM

Madhulika Started My Earth My Responsibility Program In Hyderabad - Sakshi

నెక్నంపూర్‌ చెరువులో నీటిపై తేలియాడే వ్యవసాయక్షేత్రం

‘మై ఎర్త్‌ మై రెస్పాన్సిబులిటీ’ పేరుతో నగరవాసులకు ముఖ్యంగా విద్యార్థులకు పర్యావరణం పట్ల అవగాహన కలిగిస్తున్నారు హైదరాబాద్‌ నివాసి మధులిక. గత కొంత కాలంగా నగరంలోని చెరువుల సంరక్షణ, పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రకృతిని అర్థం చేసుకోవడం, పర్యావరణ హితమైన చర్యల ఆవశ్యకతను యువతకు చెబుతున్నారు. ప్రముఖులూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తున్నారు. యువతను పర్యావరణ పరిరక్షణ దిశగా నడిపించడమే తన ధ్యేయమని చెబుతున్నారు మధులిక.

గుండె ‘చెరువై’ంది...
రాజస్థాన్‌లోని పిలానీలో జన్మించిన మధులిక సింగపూర్‌ వెళ్లడానికి ముందు ఐసిఎఫ్‌ఐఐ, శారదా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. సింగపూర్‌ వెళ్లి భారతదేశానికి తిరిగివచ్చినప్పుడు హైదరాబాద్‌లో స్థిరపడటానికి నిర్ణయించున్నారు 37 ఏళ్ల మధులిక. తొలుత పర్యావరణం కోసం మాత్రమే పనిచేయాలనుకున్నారు. మొదట్లో స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు ఉత్పాదక వనరుల గురించి, గ్లోబల్‌ వార్మింగ్‌ గురించి అవగాహన కలిగించేవారు. తన ఇంటికి దగ్గరలో ఉన్న నెక్నంపూర్‌ చెరువు దుస్థితి చూసినప్పుడు ఆమె ఆలోచన చెరువుల అభివృద్ధివైపు మళ్లింది. ‘‘మనకు ప్రాణాధారమైనవి, నిర్లక్ష్యానికి గురవుతున్నవాటిలో నదీజలాలు, సరస్సులు, చెరువులు ప్రధానమైనవి. దీనివల్ల నీటి ఆధారంగా  బతికే ఎన్నోరకాల జీవులు అంతరించిపోతున్నాయి. జీవవైవిధ్యం దెబ్బతినడం వల్ల మానవ మనుగడే ప్రశ్నార్ధకం అయ్యే ప్రమాదం ఉంది.

ఒక్క అడుగుతో మొదలు..
నగరాల్లోని చెరువులను కాపాడుకోవాలంటే పెద్ద పోరాటమే చేయాలి. ఇప్పటికే చాలా చెరువులు కబ్జాదారుల కోరల్లోనే ఉన్నాయి. ఉన్న చెరువులు చెత్తా చెదారం, కాలుష్యంతో నిండి ఉండేవి. వాటి దగ్గరకు వెళ్లాలన్నా ఆ దుర్గంధానికి నిమిషం కూడా ఉండలేని పరిస్థితి. అలాంటి చెరువులను శుభ్రం చేయాలి. అందంగా తీర్చిదిద్దాలి.. పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో సమాజంలో ఒక కొత్త దృష్టికోణం తీసుకురావడానికి 2014 నవంబర్‌లో ధ్రువాంశ్‌ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. ‘ధ్రువ్‌ అంటే తార. చీకటిలో ఉన్నవారికి మార్గం చూపిస్తుంది’ అని అర్థం.

‘మై ఎర్త్‌ మై రెస్పాన్సిబిలిటీ’ అనే నినాదంతో విద్యార్థులలో అవగాహన పెంపొందించడానికి జీవవైవిధ్యం ప్రాముఖ్యతను తెలియజేసే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. చేస్తున్న పని సమాజానికి ఉపయోగపడేదైతే నలుగురూ వచ్చి చేరుతారనడానికి ధృవాంశ్‌ ఉదాహరణగా నిలిచింది. ఈ సంస్థలో కొంతమంది భాగస్వాములుగా చేరారు. కాలుష్యకారకాలైన చెత్తను తొలగించడం, బురదగా ఉన్నచోట మట్టి పోయడం, ఇళ్లలోని వేస్ట్‌ను కంపోస్ట్‌ ఎరువుగా మార్చడం, చెరువుల చుట్టూ మొక్కలు నాటడం చేస్తున్నాం. 

నీటిపై తేలియాడే వ్యవసాయ క్షేత్రాలు
హైదరాబాద్‌ నగరానికి చేరువలో 450 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న నెక్నెంపూర్‌ లేక్‌ ఇప్పుడు జీవవైవిధ్య హాట్‌స్పాట్‌గా పేరుగాంచింది. ఈ సరస్సు అభివృద్ధి అంత సులువుగా జరగలేదు. అందుకు తగిన శ్రమ చేయడంతో నేడు అనుకూల ఫలితాలు వచ్చాయి. ముందు చెరువు ప్రాంతం కబ్జాకు గురికాకుండా అక్రమార్కులకు అడ్డుకట్ట వేశాం. ఈ క్రమంలో బిల్డర్లు లంచం ఇవ్వడానికి వచ్చిన పరిస్థితులూ ఉన్నాయి. ఈమెకెందుకీ పని అన్నట్టు చాలామంది అనుమానంగా చూసేవారు. కొన్ని బెదిరింపులూ రాకపోలేదు. కానీ, వెనక్కి తగ్గలేదు. పచ్చదనం, పరిశుభ్రతను సాధించాం. హెచ్‌.ఎమ్‌.డిఎ తో కలిసి నీటిపై తేలియాడే వ్యవసాయక్షేత్రాలను అభివృద్ధి చేశాం.

ఇందులో కూరగాయలు, పూల మొక్కలతో ఆకర్షణీయమైన పచ్చదనాన్ని తీసుకువచ్చాం. దేశంలోనే నీటిపై తేలియాడే ఈ వ్యవసాయ క్షేత్రం అతి పెద్దదిగా పేరొందింది. ఈ చెరువును నేను కాదు ఎంచుకున్నది, నన్నే ఈ చెరువు  ఎంచుకుంది అని భావిస్తాను’ అని చెప్పారు మధులిక. నెక్నంపూర్‌ చెరువు పునరుద్ధరణకు పాటుపడినందుకు అనేక పర్యావరణ అవార్డులు గెలుచుకున్నారు మధులిక. పట్టణంలోని చెరువులన్నింటినీ అభివృద్ధి చేయడానికి, విద్యార్థుల్లో పర్యావరణం పట్ల అవగాహన తీసుకు రావడానికి నిరంతరం పాటుపడుతున్నారు. ఆమె లక్ష్యం సిద్ధిస్తే ఒకనాడు లేక్‌ సిటీగా పేరున్న హైదరాబాద్‌ కి పునర్వైభవం వచ్చే అవకాశం ఉంది. – నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement