
సర్వం శివమయంగా కనిపించే శ్రీశైలం క్షేత్రాన్ని మహాశివరాత్రినాడు దర్శించడమే మహాభాగ్యం.
‘సిరిగిరి మల్లన్నను శరణన్న చాలు పరమపాతక కోట్లు భస్మమై తూలు’ అని శ్రీశైల ప్రశస్తి. శ్రీ పర్వతం లేదా శ్రీశైలం అంటే కైలాసనాథునికి పరమ ప్రీతి. ఇక తెలుగువారికి శివుడంటే ఉన్న ప్రీతికి సాక్ష్యాలు అవసరం లేదు. అసలు త్రిలింగాల వల్లే తెలుగు పదం ఆవిర్భవించిందని కదా మన నమ్మకం. అందుకే శివాలయం లేని ఊరు మనకు తెలుగునాట కనిపించదు. మన శివాలయాల్లో విశిష్టమైన మహత్తుగల క్షేత్రం శ్రీశైలం మహాశివరాత్రి శ్రీశైలంలో రమణీయ, భక్తి భావతరంగిత చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది.
సర్వం శివమయంగా కనిపించే ఈ క్షేత్రాన్ని మహాశివరాత్రినాడు దర్శించడమే మహాభాగ్యం. క్షేత్రంలో ఎక్కడ ప్రతిష్ఠిత శివలింగం ఉన్నా దర్శనం చేసుకోవడానికి, అభిషేకంలో పాల్గొనడానికి భక్తులు ఆసక్తి చూపిస్తారు. అనువైన ప్రతిచోటా అడుగడుగునా లింగార్చనలు జరుగుతూ ఉంటాయి. ఆ అభిషేకాలను చూడడమే ధన్యం అనుకున్న భక్తులు తామూ ఒక్క మారేడుదళమైనా ఆ సాంబయ్యపై ఉంచాలని పోటీపడతారు. సిద్ధులు, యోగులు, తపస్వులు ఎందరో మామూలు మానవులలో కలిసిపోయి సంచరిస్తూ ఉంటారు. ఆనందంతో నాట్యం చేసేవారు. మల్లికార్జునుని భక్తిగీతాలు పాడేవారు, శంఖాలు పూరించేవారు. వాద్యఘోషతో కైలాసనాథునికి జయజయనాదాలు చేసేవారు, పురాణ శ్రవణం చేసేవారు ఇలా అందరూ ఏదో ఒక విధంగా ఆనాటితో జన్మధన్యం అనుకుంటూ ఆనందపడేవారే.
శివరాత్రి వైభవ సంప్రదాయాలు
ఉద్వేగ భరిత క్షణాలు సంధ్యాసమయంలో ప్రారంభమవుతాయి అఖిలలోకాలకు ప్రభయై వెలిగే అచలేశ్వరునికి ప్రభోత్సవం సిద్ధమవుతుంది. స్వామి అమ్మవార్లు ప్రభపైకి విచ్చేస్తారు. అందమైన ప్రభపై చిత్రవిచిత్ర పుష్పాలతో అలంకరణ జరుగుతుంది. ఆదిదంపతులు పురవీధుల్లో ప్రభలపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరిస్తారు. సూర్యాస్తమయం ఆవుతుంది. శ్రీశైల ఆలయం చుట్టూ ఉండే సాలుమండపాలపై, మెట్లపై ఇతర మండపాలలో ఎక్కడ చూసినా జనమే కానవస్తారు. వారందరి ఎదురుచూపులన్నీ పాగాలంకరణ కోసమే. మరోవైపు ఆలయంలో లింగోద్భవకాల రుద్రాభిషేక ఏర్పాట్లలో అర్చకగణం మునిగిపోతుంది. లింగోద్భవకాల మహారుద్రాభిషేకం, పాగాలంకరణ ఒకేసమయంలో ప్రారంభమవుతాయి.
దివ్యతీర్థజలాలతో, విశేషద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. అఖిల జగత్తుకు మూలాధారమైన ఆదిదేవునికి జరిగే ఈ అభిషేకాన్ని దర్శించడం ఎన్నో జన్మల సుకృతం. అభిషేకం పూర్తయ్యే సమయానికి కొంచెం ముందుగా పాగాలంకరణ పూర్తవుతుంది. ఒక్కసారిగా అంతటా వెలుగులు ప్రసరిస్తాయి. కళ్లముందు పాగాలంకరణతో మెరిసిపోయే స్వామి. నుదుట బాసికం పెట్టుకుని, పాగా చుట్టుకున్న మల్లన్న, భ్రమరాంబికాదేవితో కల్యాణం జరిపించుకోవడానికి చంద్రవతీ కల్యాణ మంటపానికి విచ్చేస్తాడు. లోకహితం కోసం జరిగే ఆదిదంపతుల కల్యాణోత్సవం... రెండు కన్నులు వాలని రసవత్తర ఘట్టాన్ని తిలకించాలంటే శ్రీశైలం సందర్శించాలి.
మల్లికార్జునా! ఆదుకో!