ఔషధాల ఖజానా పుదీనా | Mint The Treasure Of Medicine | Sakshi
Sakshi News home page

ఔషధాల ఖజానా పుదీనా

Jun 10 2022 11:24 PM | Updated on Jun 10 2022 11:24 PM

Mint The Treasure Of Medicine - Sakshi

పుదీనా పూర్తి ఔషధ గుణాలు కలిగి ఉన్న మొక్క. చికిత్సా విధానాల్లో దీనిని జీర్ణ సంబంధ వ్యాధులకి ఉపయోగిస్తారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకులు, దాల్చిన చెక్క కలిపి నూరి, ప్రతి రోజూ, 2–3 చెంచాలు సేవిస్తూ వుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా ఆకులు కొన్ని నమిలి తిన్న తరువాత గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.

కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషాయాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతీమంట, కడుపులో మంట, మూత్ర సంబంధ వ్యాధులు సమసిపోతాయి. గర్భిణులు చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తేనె కలిపి, చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారాలు తగ్గుతాయి. అలాగే నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడుతుంది.

పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆ రసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనాన్నిస్తుంది. చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని రసం తీసి దూదిని ఆ రసంలో ముంచి, ముక్కులోనూ, చెవిలోనూ డ్రాప్స్‌గా వేసుకుంటే వీటి సమస్య తక్ష ణం పరిష్కారమవుతుంది. పుదీనా ఆకులు ఎండబెట్టి చూర్ణం చేసి, అందులో తగినంత ఉప్పు చేర్చి ప్రతినిత్యం దంతధావనం చేస్తే చిగుళ్ళు గట్టిపడి, దంత వ్యాధులు కుండా అరికడుతుంది. అంతేకాక నోటి దుర్వాసనని కూడా అరికడుతుంది.

ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు. చిన్న పిల్లలు కడుపునొప్పి, ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది. 

పుదీనా ఆకులను టీతో కలిపి తాగితే రుచిగా ఉండడమే కాక కంఠస్వరం బాగుంటుంది. గాయకులు, డబ్బింగ్‌ చెప్పేవారు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృదువుగా మధురంగా తయారవుతుంది. ఇవే కాక, ఆహార పదార్ధాల తయారీలో, కాస్మోటిక్స కంపెనీల్లో, బబుల్‌ గమ్స్‌ తయారీలో, మందుల్లో, మరి కొన్ని ఉత్పత్తులో ఈ పుదీనా వాడకం ఎంతో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement