మిర్జా సల్మా బేగ్
‘ఆడవాళ్లు ఈ పని చేయలేరు’ అని సమాజంలో కొందరు ఎర్ర జెండా చూప ప్రయత్నిస్తారు. పట్టాలకు అడ్డం పడుకుంటారు. ఆడవాళ్ల ఆత్మస్థయిర్యపు రైలు ముందుకు సాగకుండా విశ్వ ప్రయత్నం చేస్తారు.
కాని కొందరు ధీరలు ‘చేయగలం’ అంటారు. తమ జీవితానికి తామే పచ్చజెండా ఊపుకోగలుగుతారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సల్మా చేసిన పని అదే. భారతదేశపు తొలి రైలుగేట్ ఉమన్‌గా ఆమె నియమితమైనప్పుడు గేటు వేయలేక తీయలేక నాల్రోజుల్లో పారిపోతుందన్నారు. ఇవాళ్టికి పదేళ్లు గడిచాయి. రైళ్లు ఆమె చెప్పినట్టుగా వింటున్నాయి. 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన సల్మాను చూసి ఆ గేటు మీదుగా వెళ్లే రైళ్లన్నీ శాల్యూట్ చేస్తున్నాయి.
‘బంధువులు ఎప్పుడూ ఏదో ఒకటి అంటూ ఉంటారు. తల్లిదండ్రులు గట్టిగా నిలబడాలి. నా తల్లిదండ్రులు నిలబడ్డారు. అందుకే ఇప్పుడు జీవితంలో స్థిరపడ్డాను’ అంటుంది సల్మా. ఆమె పూర్తి పేరు మిర్జా సల్మా బేగ్. వయసు 29. భారతదేశపు తొలి మహిళా గేట్ ఉమన్‌గా రైల్వే శాఖలో 2013లో చేరింది సల్మా. ఆమె పని చేసే రైల్వే క్రాసింగ్ లక్నోకు ఆనుకుని ఉన్న మల్హార్ స్టేషన్. ఇప్పుడు ఆ దారిన పోయే రైళ్ల డ్రైవర్లకు, గార్డులకు ఆమె సుపరిచితం అయ్యింది గాని కొత్తగా ఎవరైనా ఆ రైల్వే క్రాస్ గుండా వెళుతుంటే మాత్రం ఆగి సల్మాను మెచ్చుకోలుగా చూస్తూ ఉంటారు. ఎందుకంటే రైల్వే గేట్ దగ్గర ఒక స్త్రీ, అందునా హిజాబ్ ధరించిన స్త్రీ, పని చేయడం నేటికీ అరుదు కనుక.
‘మా నాన్న సలీం బేగ్ రైల్వే గేట్ మేన్‌గా పని చేసేవాడు. ఆయన అనారోగ్యం వల్ల చెవుడు వచ్చింది. రైలు గంట వినకపోతే గేట్‌మేన్‌గా పని చేయడం కష్టం. ఆయన వాలెంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని నన్ను ఉద్యోగంలో పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే నాకు అన్నదమ్ములు లేరు. అమ్మకు పక్షవాతం. నాన్న సంపాదించే స్థితిలో లేడు. గేట్ మేన్ ఉద్యోగం పురుషులకు మాత్రమే అని రైల్వే శాఖ ఎప్పుడూ చెప్పలేదు. కాని ఆడవాళ్లు ఆ ఉద్యోగం కోసం అప్లై చేయరు. కష్టమైన పని. పైగా నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం. అయితే ఆ పని నాక్కూడా కష్టమే అని నాకు తెలుసు. కాని రైల్వేలో వేరే ఉద్యోగం ఇమ్మని అడిగితే ఆ ఉద్యోగం నాకు అందడానికి చాలా రోజులే పట్టవచ్చు. అదే మా నాన్న పనే నేను చేస్తానంటే వెంటనే ఇస్తామన్నారు. అలా ఈ ఉద్యోగంలో చేరాను’ అంది సల్మా.
ఆమె చేరినప్పుడు ఆమెతో పాటు లక్నోలో 11 మంది పురుష గేట్ మేన్‌లు ఉండేవారు. వారంతా ‘ఈ అమ్మాయి ఈ పని చేయలేక నాలుగు రోజుల్లో పారిపోతుంది’ అన్నారు. సల్మా పని చేస్తుంటే హేళన చేసేవారు. బంధువులైతే ఇంటికి వచ్చి మరీ సూటి పోటి మాటలు అనేవారు. అమ్మాయి జీవితం నాశనం చేశారని తల్లిదండ్రులను మాటలనేవారు. కాని నాలుగు నెలలు గడిచినా సల్మా బెణకలేదు. బెసకలేదు. తండ్రి సాయంతో అధికారుల సపోర్ట్‌తో పని క్షుణ్ణంగా నేర్చుకుంది. రైలు వచ్చే ముందు గేటు వేసి వెళ్లాక గేటు తీయడానికి లివర్ ఉన్న ఇనుప చక్రం తిప్పాలి. నేర్చుకుంది. సమర్థంగా చేసింది. గత పదేళ్లుగా రోజుకు 12 గంటల డ్యూటీ చేసి విజేతగా నిలిచింది. ఆమె ఉద్యోగంలో చేరినప్పుడు పత్రికలు తొలి గేట్ ఉమన్‌గా వర్ణిస్తూ పేపర్లలో రాయడంతో బంధువులు చల్లబడి ‘మా అమ్మాయే’ అనడం మొదలెట్టారు.
‘ఆడవాళ్లు చేయలేని పనంటూ ఈ ప్రపంచంలో లేదు. ప్రయత్నించాలి అంతే. నా ఉద్యోగంలో పదేళ్లు గడిచిపోయాయి. ఇటీవలే మా అమ్మ చనిపోయింది. ఆమె నాకు ఇచ్చిన ఆసరా నేను మర్చిపోలేను’ అంటుంది సల్మా.
గొప్ప గొప్ప విజయాలు ఒక సంకోచంతో నిండిన అడుగు నుంచే మొదలవుతాయి. సంకోచాన్ని ధైర్యంతో దాటాలి. ధైర్యంతోపాటు సంకల్పం తోడు రావాలి. ప్రయత్నం జత పడాలి. ఆ తర్వాత చచ్చినట్టు ‘విజయం’ అనే స్టేషన్ వచ్చి తీరుతుంది. మీరూ ప్రయత్నించండి. (క్లిక్ చేయండి: మనసు కుదిరింది.. పెళ్లి జరిగింది)
Comments
Please login to add a commentAdd a comment